Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవాక్సిన్‌పై కలవరపెడుతున్న లాన్సెట్, స్టాట్ కథనాలు
- రాజకీయ ఒత్తిడితో నామమాత్రంగా ట్రయల్స్
- కీలక పరీక్షలను విస్మరించిన భారత్ బయోటెక్
- ఖండించిన కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ :కరోనా వైరస్ కట్టడికి దేశంలో విస్తృతంగా వినియోగించిన కోవాక్సిన్ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించిన తీరు వివాదాస్పదంగా మారింది. కోవాక్సిన్‌ను తయారు చేసిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ట్రయల్స్‌కు సంబంధించిన నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించలేదని తాజాగా వెల్లడైంది. ఈ మేరకు వివరాలతో సహా 'లాన్సెట్' పరిశోథన కథనాన్ని ప్రచురించింది. సైన్స్, వైద్యం తదితర అంశాలకు సంబంధించి కీలక పత్రాలకు లాన్సెట్ వేదిక అన్న సంగతి తెలిసింది. దీని ఆధారంగా వైద్య విషయాల ప్రచురణ సంస్థ స్టాట్ చేసిన పరిశోధనలో జంతువుల మీద తప్ప మనుషుల మీద పూర్తి స్థాయిలో కోవాక్సిన్‌ను పరిశీలించలేదన్న విషయం తేలింది. భారత్ బయోటెక్‌కు చెందిన ఒక కీలక వ్యక్తి ఈ విషయాన్ని ధృవీకరించినట్లు తెలిపిన స్టాట్, దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని పేర్కొంది. లాన్సెట్, స్టాట్ల సమాచారం ఆధారంగా 'ది వైర్' ప్రచురించిన తాజా కథనం దుమారాన్ని రేపింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ గురువారం జారీ చేసిన ప్రకటనలో ఈ కథనాలను ఖండించింది.
ఏం జరిగింది....?
కరోనా ఉధృతంగా వ్యాపించిన సమయంలో స్వదేశీ తయారీ అంటూ కోవాక్సిన్‌కు కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం కల్పించిన సంగతి తెలిసిందే. వృద్ధులతో ప్రారంభించి విడతల వారీగా అందరికీ ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంత త్వరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడాన్ని తమ ఘనతగా పేర్కొంటూ మోడీ ప్రభుత్వం భారీ ప్రచారాన్ని చేసుకుంది. ఈ క్రమంలో సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్సిఓ) రూపొందించుకున్న నిబంధనలను కూడా పాటించలేదు. స్టాట్ కథనం ప్రకారం వ్యాక్సిన్‌కు మూడు విడతలుగా ట్రయల్స్ నిర్వహించాల్సిఉండగా ఏ విడతలోనూ నిబంధనలను పూర్తిస్థాయిలో పాటించలేదు. ట్రయల్స్‌కోసం మొదటి రెండు విడతల్లో భాగస్వాములైన వారి సంఖ్య నుండి, అనుసరించిన పద్దతుల వరకు అనుమానాస్పదంగా మారాయి. వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం ఏర్పాటు చేసిన ప్రోటోకాల్ డిపార్ట్మెంటు లెక్కల ప్రకారం మొదటి విడతలో 402 మందికి, రెండవ విడతలో 394 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే, జనవరి 2021లో 'లాన్సెట్'కు ఇచ్చిన అధికారిక సమచారంలో 375 మందికి మొదటి డోసును, 368 మంది రెండవ డోసును వేసినట్లు పేర్కొన్నారు. అయితే, 'మారుమూల ప్రాంతాల్లో కూడా ట్రయల్స్ నిర్వహించడం వల్ల కొంత సమన్వయ సమస్యలు ఏర్పడ్డాయని, అందువల్ల ప్రయోగాత్మకంగా వ్యాక్సిన్ వేసుకున్న వారి అందరి వివరాలు సేకరించలేకపోయామని భారత్ బయోటెక్ కంపెనీ తెలియచేసింది.
'ప్లాసి బో' ను విస్మరించారు!
వ్యాక్సిన్ ట్రయల్ రన్లో భాగస్వాములయ్యే వారిని రెండు గ్రూపులుగా విభజించి పరీక్షలు నిర్వహించాల్సివుంది. ఒక గ్రూపు వారికి వ్యాక్సిన్ వేసి, రెండో గ్రూపు వారికి డమ్మీ వ్యాక్సిన్ వేసి ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఎవరికి ఏది వేస్తున్నారన్న అంశాన్ని గోప్యంగా ఉంచుతారు. సైడ్ ఎఫెక్ట్స్‌తోపాటు, మానసిక ఒత్తిళ్లను గుర్తించడానికి ఇలా చేస్తారు. ఇలా డమ్మీ వ్యాక్సిన్ వేయడాన్ని 'ప్లాసి బో'గా వ్యవహరిస్తారు. దీనివల్ల వ్యాక్సిన్ వేసిన వారికి, వేయని వారికి మధ్య గల తేడాను, వేసుకున్న వారికి తలెత్తే సమస్యలను గుర్తించడం వీలవుతుంది. అయితే, భారత్ బయోటెక్ ఈ పరీక్షను పూర్తిగా విస్మరించింది. డమ్మీ వ్యాక్సిన్ వేయడానికి బదులుగా ఒక గ్రూపు వారికి ఒక పద్దతిలో తయారైన కోవాక్సిన్‌ను, మరో గ్రూపు వారికి ఇంకో పద్దతిలో తయారైన కోవాక్సిన్‌ను వేశారు. ఈ విధానం వల్ల ఈ రెండింటిలో ఏది మెరుగైనదో మాత్రమే తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
జంతువుల మీద జరిపిన పరీక్షలే...!
తొలివిడత వ్యాక్సిన్ వేసిన వారి ఫలితాలు రాకముందే రెండవ విడత ట్రయల్స్ చేయడానికి సిడిఎస్సిఓ సబ్జక్టు ఎక్స్పర్ట్ కమిటీ భారత్ బయోటెక్‌కు అనుమతిచ్చింది. మొదటి విడత ట్రయల్స్‌కు ముందు జంతువులపై చేసిన ప్రి-క్లీనికల్ పరీక్షా ఫలితాల ఆధారంగా రెండవ విడత ట్రయల్స్‌కు అనుమతిచ్చారు. మొదటి విడత ట్రయల్స్‌లో శ్యాంపిల్ సంఖ్య తక్కువ వుంది కాబట్టి అనుమతిచ్చారని భావించినా, రెండవ విడత ట్రయల్స్ ఫలితాలు రాకముందే మూడవ విడత పరీక్షలకు అనుమతిచ్చేశారు. అప్పటికీ అధికారికంగా అందుబాటులో ఉన్నది జంతువులపై జరిపిన పరీక్షలే!నిజానికి రెండవ విడతలో వ్యాక్సిన్ సురక్షితమా కాదా అన్న అంశాన్ని, మూడవ విడతలో ఎంత సామర్ధ్యంతో వ్యాక్సిన్ పనిచేస్తోందన్న అంశాన్ని పరిశీలించాల్సిఉంది. దీనిపై భారత్ బయోటెక్‌కు చెందిన డైరక్టర్ ఒకరు జంతువుల మీద జరిపిన పరీక్షల ఆధారంగానే మూడవ విడత ట్రయల్స్‌ను నిర్వహించినట్లు 'స్టాట్'కు చెప్పారు. తమపైన పదేపదే తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయని, రెగ్యులేటర్లు కూడా ఏదో రకంగా ట్రయల్స్ పూర్తి చేయాలని ఒత్తిడి చేశారని, దీంతో తమకు మరో మార్గం లేకుండా పోయిందని ఆయన చెప్పినట్లు స్టాట్ ప్రచురించింది.
డబ్య్లుహెచ్ఓ సస్పెండ్ చేసిన ఏకైక వ్యాక్సిన్
ఐక్య రాజ్యసమితి ఏజెన్సీలకు కోవాక్సిన్ సరఫరా చేయడాన్ని డబ్ల్యుహెచ్ఓ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 'మంచి తయారీ పద్దతుల (గుడ్ మాన్యుఫాక్ఛరింగ్ ప్రాక్టిసెస్)ను పాటించలేదంటూ డబ్య్లుహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై భారత్ బయోటెక్ ఎటువంటి ప్రకటన చేయలేదు. వివిధ దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్లలో డబ్ల్యుహెచ్ఓ చేత సస్పెన్షన్‌కు గురైనది కోవాక్సిన్ ఒక్కటేఅని సమాచారం.
కేంద్రం ఏమంది?
పూర్తిస్థాయిలో ట్రయల్స్ నిర్వహించకుండానే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కోవాక్సిన్‌కు అనుమతించారనడాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో అన్ని శాస్త్రీయ విధానలకు అనుగుణంగా సూచించిన నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహించిన తరువాతే అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. దీనికి భిన్నంగా తప్పుదోవ పట్టించేలా మీడియా కథనాలు ఉన్నాయని విమర్శించింది. 'సిడిఎస్సిఓ సబ్జక్టు ఎక్స్పర్ట్ కమిటీ 2021 జనవరి ఒకటి, రెండు తేదీలలో సమావేశమై తగిన చర్చల తరువాత భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్‌కు పరిమితంగా, అత్యవసర వినియోగా నికి సంబంధించి అనుమతి ఇచ్చారు' అని పేర్కొంది.