Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశాలకు చెక్కేయటానికి వ్యాపారవేత్తను కాదు : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్
రాయ్‌పూర్ : నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినీ, దేశాన్ని విడిచి పారి పోవడానికి వ్యాపారవేత్తను కానంటూ ఈడీ సమన్లపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మండిపడ్డారు. గురువారం ఈడీ విచారణకు హాజరవడానికి ముందు రాంచీలోని తన నివాసంలో మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించారు. తాను ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైన పదవిని కలిగి ఉన్నాననీ, అయితే విచారణ జరుగుతున్న తీరు , ఈడీ సమన్లు పంపుతున్న తీరు చూస్తుంటే తాను దేశం విడిచిపారిపోయే వ్యక్తిలా వారు భావిస్తున్నారని ఈడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా వ్యాపారవేత్తలు తప్ప నేతలెవరూ దేశం విడిచి వెళ్లిన సందర్భాలు లేవనీ, ఏ రాజకీయ నేత అలా పారిపోలేదని స్పష్టం చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) -కాంగ్రెస్‌ల సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న పెద్ద కుట్రలో ఈడీ విచారణ ఓ భాగమని అన్నారు. 2019 ఎన్నికల్లో జెఎంఎం- కాంగ్రెస్‌లు గెలిచినప్పటి నుంచి తమ ప్రభుత్వాన్ని కూల్చే యత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కుట్రదారులు జలాంతర్గామిలా పనిచేస్తున్నారనీ, నీటి నుంచి పైకి రావడానికి భయపడుతున్నారని, కానీ ఉపరితలం పైకి వచ్చే సమయం వచ్చిందని సోరెన్ అన్నారు. బీజేపీ ఫిర్యాదు మేరకు తనపై అనర్హత వేటు వేయాలన్న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలపై గవర్నర్ త్వరగా స్పందించాలని అన్నారు. కుంభకోణం ఆరోపణలు నిరాధారమనీ, మోడీ ప్రభుత్వం త్వరలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని మరింత మంది నేతలపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయించనుందని అన్నారు.
అక్రమ మైనింగ్ జరిగిందన్న సాహిబ్‌గంజ్ జిల్లా వివరాలను అందిస్తూ.. రూ. వెయ్యికోట్లు అపహరించాలంటే చట్టబద్ధమైన మైనింగ్ కంటే అక్రమమైనింగ్ నాలుగు రెట్లు ఉండాలని సోరెన్ పేర్కొన్నారు. అలాగే వాటినిరవాణా చేయడానికి 20వేల రైల్వే బోగీలు, 33 లక్షల ట్రక్కులు కావాలనీ, సరైన పత్రాలు లేకుండా రైల్వే రవాణా చేయదనీ, మీరు ఎవరైనా రైల్వే అధికారిలా వ్యవహరించారా అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. గడిచిన రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రూ.750 కోట్లు మాత్రమే సంపాదించిందనీ, అయితే వెయ్యికోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. .ఈ. ఆరోపణలు చేయడానికి ముందు ఈ సమచారాన్ని మీరు గమనించలేదని భావిస్తున్నానని అన్నారు. తమ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన నేత రవికేజ్రీవాల్ ప్రకటనలపై కూడా సందేహాలు వ్యక్తం చేశారు. రహస్య అజెండా లేదా తప్పుడు ఉద్దేశం లేకుండా ఈడీ విచారణ జరుగుతుందని తాను ఆశిస్తున్నానని సోరెన్ పేర్కొన్నారు.