Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష్యాన్ని తగ్గించుకున్న బ్యాంక్‌లు
- గతేడాదితో పోల్చితే 13 శాతం తగ్గింపు
- ఆందోళనలో విద్యార్థులు
న్యూఢిల్లీ : కార్పొరేట్లకు వేల కోట్ల అప్పులు అప్పనంగా ఇచ్చే బ్యాంక్‌లు విద్యార్థుల చదువులకు మాత్రం రుణాలివ్వడానికి వెనకాడుతున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ విభాగం రుణాల జారీలో 13.5 శాతం కోత పెట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంక్(పిఎస్బి)లు నిర్ణయించాయని తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 12 పిఎస్బిలు మొత్తంగా రూ.23,640 కోట్ల విద్యా రుణాలు అందించగా.. వీటిని ప్రస్తుత 2022-23లో రూ.20,450 కోట్ల రుణాలకు పరిమితం చేయాలని బ్యాంక్‌లు లక్ష్యంగా పెట్టుకున్నాయని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్టు చేసింది. దేశంలో మొత్తం విద్యా రుణాలలో దాదాపు 90 శాతం పిఎస్బిలే ఇస్తున్నాయి. సామాజిక బాధ్యత కొరవడిన ప్రయివేటు రంగ బ్యాంక్‌లు, ఎన్‌బిఎఫ్‌సిల వాటా 10 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. విద్యా రుణాల జారీలో బ్యాంక్‌లు పెట్టుకున్న లక్ష్యం కూడా చాలా నెమ్మదిగా సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పెట్టు కున్న లక్ష్యం లో జూన్ తో ము గిసిన త్రైమా సికం ముగింపు నాటికి కేవలం 19 శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరాయి. రూ.7.5 లక్షల కంటే తక్కువ పరిమాణ రుణాల జారీలో బ్యాంక్‌లు అప్రమ త్తంగా వ్యవహారిస్తున్నాయి. ఈ రుణాలు ఎక్కువగా నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయని ఆ వర్గాల సమాచారం. చిన్న స్థాయి రుణాల విభాగంలో డిఫాల్ట్‌లు ఎక్కువగా ఉన్నందున ఈ విషయంలో బ్యాంకులు కొంచెం జాగ్రత్తగా ఉంటాయని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్, హెడ్ ప్రకాశ్ అగర్వాల్ అన్నారు. రుణ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని గత సెప్టెంబర్‌లో ఆర్థిక సేవల విభాగం పిఎస్బిలను సమావేశానికి పిలిచింది. ప్రాముఖ్యత లేని కారణాలను చూపి రుణ అభ్యర్థనలను నిరాకరించటంపై పలు ఫిర్యాదులు అందినట్లు బ్యాంక్‌ల దృష్టికి తీసుకెళ్లింది. ఈ రంగం రుణాలు, సబ్సీడీ స్కీమ్‌లపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించిందని సమాచారం. ఇతర రంగాల మాదిరిగానే చదువుల కోసం విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. ఇటీవలి కాలంలో విదేశీ విద్యకు భారీగా డిమాండ్ పెరిగింది. దేశీయంగా టెక్నికల్ కోర్సులకు వ్యయం ఘననీయంగా పెరిగింది. దీంతో అనేక మంది మధ్య తరగతి కుటుంబాలు విద్యా రుణాలపై ఆధారపడుతున్నాయి. కానీ బ్యాంక్‌లు వారిని నిరాశకు గురి చేస్తున్నాయి. విద్యా రుణాల తగ్గుదలపై విద్యార్థులు, విద్యా నిపుణులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలలో పెద్ద చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఒక ఎదురు దెబ్బ అని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా, మధ్యతరగతి ప్రజలపై ఇది ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుని బ్యాంక్‌లు రుణాల పంపిణీ లక్ష్యాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.