Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ అంశంపై ఉపన్యాసాలకు చర్యలు
- ఇప్పటికే పలు కళాశాలలకు ఆదేశాలు
న్యూఢిల్లీ : ఈనెల 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వేడుకలకు సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా 'భారతదేశం : ప్రజాస్వామ్యానికి తల్లి' లేదా ' భారత్ : లోక్తంత్ర కీ జననీ' అనే అంశంపై ఉపన్యాసాలు నిర్వహించాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే కళాశాలలను ఈ కార్యక్రమాలను నిర్వహించాలని కోరింది. అయితే, యూజీసీ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తున్నది. ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ పురాతన ప్రజాస్వామ్యంగా ఉన్నదనీ, అయితే, భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా పేర్కొంటూ యూజీసీ చేస్తున్న ప్రయత్నాలు కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. దేశ గొప్పతనాన్ని చాటి చెప్పటంలో తప్పులేదనీ, కానీ, అవాస్తవాలను ప్రచారం చేసేలా యూజీసీ వంటి చేస్తున్న ప్రయత్నాలు ఎలాంటి సందేశాన్నిస్తాయని వారు ప్రశ్నించారు.కచ్చితంగా ఇవి హిందూత్వం వైపు యూజీసీ అడుగులంటూ పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ ఉపన్యాసాలలో భాగంగా, యూజీసీ ఉపన్యాసాల ఇతివృత్తాలను రూపొందించటంలో సహాయం చేయటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్)ని ఉపయోగించుకున్నది. ఇది వేదాల కాలం నుంచి భారత్‌లో ప్రబలంగా ఉన్న ప్రజాస్వామ్య ఆలోచన నుంచి తీసుకోబడింది. అయితే, ఇలాంటి అంశాలతో ఆధునిక ప్రజాస్వామ్యానికి ముడి పెట్టటంపై మరికొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఉపన్యాసాలు నిర్వహించటమే కాకుండా నవంబర్ 15 నుంచి 30 వరకు ప్రత్యేక ఉపన్యాసాలు చేపట్టాని యూజీసీ చైర్పర్సన్ ఎం. జగదీశ్ కుమార్ 45కి పైగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పాటు 45 డీమ్డ్ యూనివర్సిటీలకు లేఖ రాశారు. 1949లో ఇదే రోజున (నవంబర్ 26న) బీఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే యావత్ దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని పాటిస్తుంది.