Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్త హీనత ప్రమాదంలో అతివలు
- శాస్త్రవేత్తల హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న కాలుష్య పరిస్థితులు ప్రజలపై ప్రతికూల పరిస్థితులను చూపుతున్నాయి. ముఖ్యంగా, మహిళలపై కాలుష్య ప్రభావం గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం 2.5 కాలుష్య కారకాల కారణంగా మహిళల్లో రక్తహీనత ప్రాబల్యం 7.23 శాతం పెరుగుతుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీకి చెందిన శాస్త్రవేత్తల నేతృత్వంలోని అధ్యయనం పేర్కొన్నది. పర్టిక్యూలేట్ మ్యాటర్ (పీఎం ) 2.5 అంటే 2.5 మైక్రోమీటర్లు లేదా అంతకు తక్కువ వ్యాసం కలిగిన కాలుష్య కారకాలు. ఇవి ఘన కణాలు లేదా ద్రవ బిందువులు కావచ్చు. ఇవి మానవ శరీరంలోకి ప్రవేశించి తర్వాత ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
క్లీన్ ఎయిర్ టార్గెట్లతో పునరుత్పత్తి వయస్సు గత భారతీయ మహిళల్లో రక్తహీనత భారాన్ని తగ్గించటం అనే శీర్షికతో రూపొందించిన ఈ అధ్యయనం, కాలుష్యం, రక్తహీనత మధ్య సంబంధాన్ని కనుగొనటానికి జాతీయ కుటుంబ సర్వే-4 (2015-16), జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి డేటాను ఉపయోగించింది. ఇది ఈ ఏడాది ఆగస్టులో నేచర్ సస్టైనబిలిటీ జర్నల్లో ప్రచురించబడింది.ఎన్ఎఫ్హెచ్ఎస్-5 డేటా ప్రకారం.. 15-49 ఏండ్ల వయస్సు గల మహిళల్లో రక్తహీనత 2015-16లో 53.1 శాతం నుంచి 2019-21లో 57 శాతానికి పెరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో ఒకటి కావటం ఆందోళనకరం. అలాగే, అదే వయస్సులో ఉన్న గర్భిణీ స్త్రీలలో రక్తహీనత కూడా 2015-16లో 50.4 శాతం నుంచి 2019-21లో 52.2 శాతానికి పెరిగింది. భారత్లో స్వచ్ఛమైన గాలి లక్ష్యాలు సాధించినట్టయితే పునరుత్పత్తి వయస్సు గల మహిళల్లో రక్తహీనత 53 శాతం
(ఎన్ఎఫ్హెచ్ఎస్-4 డేటా) నుంచి 39.5 శాతానికి తగ్గుతుందని అధ్యయనం పరిశోధనలు సూచించాయి. ఇది జాతీయ లక్ష్యం కంటే 186 జిల్లాలను దిగువకు తీసుకువెళ్తుందని తెలిపాయి.
వాయు కాలుష్యం ప్రభావం పురుషుల కంటే స్త్రీలు రక్తహీనతకు ఎక్కువగా గురవుతారని ఆరోగ్య నిపుణులు చెప్పారు. పలు కారణాలతో సాధారణంగా మహిళల్లో ఐరన్, విటమిన్ లోపాలు ఉంటాయని డాక్టర్ రస్తోగి తెలిపారు. గర్భిణీ స్త్రీ దీర్ఘకాలిక కాలుష్యానికి గురైతే తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదం సాధారణం కంటే 30 శాతం ఎక్కువ ఉంటుందన్నారు. పిండం పెరుగుదల, ఆరోగ్యం ప్రభావితమవుతుందని చెప్పారు. అలాగే, గుండె వైఫల్యం వంటి గుండె సమస్యలు ఏర్పడతాయని హెచ్చరించారు. బ్రోన్కైటిస్, ఆస్తమా, రినైటిస్ వంటి హృదయ, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అలెర్జీ ప్రతి చర్యలు, దగ్గు, కాలానుగుణ జ్వరం వంటి సమస్యలు వస్తాయని రస్తోగి చెప్పారు. ఈ విషయంలో మహిళలు జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ఇటు ప్రభుత్వాలు కూడా కాలుష్యంపై దృష్టి సారించాలని సూచించారు.