Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌతం నవ్లాఖా గృహ నిర్బంధంపై ఎన్ఐఏ పిటిషన్ తిరస్కరణ
- ఉత్తర్వులను 24 గంటల్లో అమలు చేయాలి
న్యూఢిల్లీ : హక్కుల కార్యకర్త, భీమా కోరేగావ్ నిందితుడు గౌతం నవ్లాఖాను జైలు నుంచి గృహ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయ స్థానం తిరస్కరించింది. తనకు గృహ నిర్బంధానికి అనుమతిస్తూ నవంబర్ 10న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయటం లేదని గౌతం నవ్లాఖా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు గృహ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ హృషికేష్ రారులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఉత్తర్వులను 24 గంటల్లోగా అమలు చేయాలని ఆదేశించింది. అయితే నవ్లాఖా గృహ నిర్బంధాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేలా అదనపు రక్షణలను తప్పనిసరి చేసింది. విచారణ సందర్భంగా నవ్లాఖాను గృహ నిర్బంధంలో ఉంచాలనుకుంటున్న భవనం సీపీఐ(ఎం)కి చెందినదంటూ... ఎన్ఐఏ లేవనెత్తిన అంశాన్ని కూడా ధర్మాసనం తిరస్కరించింది. 'కమ్యూనిస్ట్ పార్టీ(మార్కిస్టు) దేశంలో గుర్తింపు పొందిన పార్టీ. సమస్య ఏమిటి' అని ఎన్ఐఏ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను జస్టిస్ జోసెఫ్ ప్రశ్నించారు. నవ్లాఖా తరపు సీనియర్ న్యాయవాది నిత్యా రామకృష్ణన్ వాదనలు వినిపించారు. నవ్లాఖా బసచేసేందుకు ప్రతిపాదించిన స్థలం రెసిడెన్షియల్ యూనిట్ అని తెలిపారు. 'కమ్యూనిస్ట్ పార్టీ(మార్కిస్టు) స్వయంగా మావోయిస్టులను ఖండిస్తున్నది' అని పేర్కొన్నారు. 'సమకాలీన రాజకీయాలపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అది గుర్తింపు పొందిన పార్టీ అని తెలుస్తుంది' అని రామకృష్ణన్ వాదించారు. 'మా ఆర్డర్‌ను పాటించకుండా, కొన్ని లొసుగులను పేర్కొంటే, మేం దానిని తీవ్రంగా పరిగణించాలి' అని జస్టిస్ జోసెఫ్ పేర్కొన్నారు. మీ పోలీసు బలగాలతో మీరు అనారోగ్యంతో ఉన్న 70 ఏండ్ల వృద్ధుడిపై నిఘా ఉంచలేరా? అని జస్టిస్ రారు ప్రశ్నించారు. కాగా గౌతం నవ్లాఖా ఉండటానికి సీపీఐ(ఎం) నిర్వహణలో ఉన్న రణదివే భవనంలోని పై గదిని కేటాయించిందని పార్టీ వర్గాలు తెలిపాయి.