Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం తర్వాతే జైలు నుంచి బయటకు!
ముంబయి : ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన సామాజిక కార్యకర్త ఆనంద్ తెల్తుంబ్డే (73)కు బాంబే హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ విషయమై ప్రాసిక్యూషన్ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి వీలుగా వారం రోజుల పాటు ఆ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. అంటే, సుప్రీంకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఆయన బెయిల్ ఉంటుంఇ. అప్పటివరకు తెల్తుంబ్డే జైలు నుంచి బయటకు రావడానికి వీల్లేదు. 2020 ఏప్రిల్‌లో అరెస్టయినప్పటి నుంచి జైల్లో వున్న తెల్తుంబ్డే దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ ఎ.ఎస్.గడ్కరి, జస్టిస్ ఎం.ఎన్.జాదవ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. లక్ష రూపాయల పూచీకత్తుపై కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం నవీ ముంబయిలోని తలోజా జైల్లో తెల్తుంబ్డే ఉన్నారు. తన బెయిల్‌ను ప్రత్యేక కోర్టు తిరస్కరించడంతో గతేడాది హైకోర్టును ఆయన ఆశ్రయించారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్ పరిషద్ సమావేశం జరిగిన రోజున తానక్కడ లేనని, ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేదని తెల్తుంబ్డే తన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన మూడో నిందితుడు తెల్తుంబ్డే. వరవరరావుకు మెడికల్ బెయిల్ ఇవ్వగా, సుధా భరద్వాజ్‌కు సాధారణ బెయిల్ ఇచ్చారు.