Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకే అత్యధికంగా..
- కోటి రూపాయల బాండ్లు... 93.5 శాతం
- ఒక లక్ష, పదివేల బాండ్లు.. కేవలం 0.25శాతం :ఎస్బీఐ
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం మొదలయినప్పటి నుంచీ ఇప్పటివరకూ మొత్తం రూ.10,246 కోట్లు వసూలు అయ్యాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా గణాంకాలు విడుదల చేసింది. కోటి రూపాయలు విలువజేసే బాండ్లు 93.5శాతం ఉన్నాయని పేర్కొన్నది. మొత్తం అమ్ముడుపోయిన బాండ్లలో కోటి విలువ జేసేవే అత్యధికశాతం ఉన్నాయని దీంతో తేలిపోయింది. ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నది బడా కార్పొరేట్లు, అత్యంత ధనికులేనని, సామాన్యులెవరూ కోటి రూపాయలు పార్టీ విరాళంగా ఇవ్వరు కదా..! అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మార్చి 2018 నుంచి ఇప్పటివరకూ బాండ్ల పథకంలో లక్ష, పదివేలు, వెయ్యి విలువగలవి కేవలం 0.25శాతం మాత్రమే ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. సమాచార హక్కు కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆర్టీఐ దరఖాస్తుకు ఎస్బీఐ పై గణాంకాలు విడుదల చేసింది. ఇప్పటివరకూ బాండ్ల పథకంలో కొనుగోలు అయిన కోటి, పది లక్షలు, లక్ష, పదివేలు, వెయ్యి..విలువైన బాండ్ల వివరాలు విడుదల చేయాలని ఆయన కోరారు. ఈనేపథ్యంలో ఎస్బీఐ పై గణాంకాలు విడుదల చేసింది.మార్చి 2018లో బాండ్ల పథకాన్ని మోడీ సర్కార్ తీసుకొచ్చింది. కోటి, పది లక్షలు, లక్ష, పదివేలు, వెయ్యి..విలువ జేసే బాండ్లను కేంద్రం జారీచేస్తోంది. ప్రతిఏటా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ముఖ్య నగరాల్లోని ఎస్బీఐ బ్యాంక్ వద్ద 15 రోజులపాటు బాండ్ల కొనుగోలు పథకం ప్రవేశపెడుతోంది. అయితే..ఈ పథకం మొదట్నుంచీ అధికార బీజేపీకి కనకవర్షం కురిపిస్తోంది. వేల కోట్ల రూపాయలు బడా కార్పొరేట్, అత్యంత ధనిక వర్గాల నుంచి ఆ పార్టీకి వచ్చి పడుతోంది. బాండ్ల కొనుగోలు చట్టబద్ధం కాదని, తెరవెనుక కార్పొరేట్లకు అనేక ప్రయోజనాలు కల్పిస్తూ..వాటికి ప్రతిఫలంగా బాండ్ల పథకం ద్వారా అధికార బీజేపీ విరాళాలు సేకరిస్తోందని సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పథకానికి వ్యతిరేకంగా వామపక్షాలు, కాంగ్రెస్ నాయకుల, సామాజిక కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టులో విచారణ నత్తనడకన సాగుతోంది.