Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) డిమాండ్
న్యూఢిల్లీ : ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా 'ప్రజాస్వామ్యానికి మాతృక'గా భారతదేశా న్ని పేర్కొంటూ అందుకు సంబంధించిన కొన్ని అంశాలపై విశ్వవిద్యాలయాల్లో ఉపన్యాసాలు నిర్వహించాలని గవర్నర్లను కోరుతూ యూజీసీ ఛైర్పర్సన్ ఎం.జగదీష్ కుమార్ లేఖ రాయ డాన్ని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ లేఖను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 'భారతీయ తత్వంలో ఆదర్శ రాజు', 'ఖాప్ పంచాయతీలు -వాటి ప్రజాస్వామ్య సాంప్రదాయాలు' వంటి అంశాలపై ఉపన్యాసాలు నిర్వహించేలా తమ పరిధిలోని విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలని ఈ లేఖలో యూజీసీ గవర్నర్లను కోరింది. సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో రాజ్యాంగ నిబంధనలను, పార్లమెంటు చేసిన యూజీసీ చట్టంలోని నిబంధనలను యూజీసీ లేఖ నేరుగా ఉల్లంఘిస్తోందని, రాజ్యాంగానికి విరుద్దంగా ఉందని తెలిపింది.
నియంతృత్వం లేదా కులీన వర్గాలు లేనందున ప్రాచీన భారతం చాలా విశిష్టమైనదని యూజీసీ ఛైర్పర్సన్ ఈ లేఖలో పేర్కొనడాన్ని హాస్యాస్పదమని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అదే సమయంలో ఆధునిక ప్రజాస్వామ్యానికి ప్రధాన సవాలుగా వున్న కులాల వారీ సామాజిక వర్గ క్రమం, వర్ణాశ్రమం వంటి వాస్తవికతలను పూర్తిగా విస్మరించి అటువంటి వ్యాఖ్యలు చేయడం తగదని తెలిపింది.
ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలతో ఉన్నతవిద్యపై సంప్రదింపులు జరపాల్సిన రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక కర్తవ్యాన్ని విస్మరించి, ఎన్నికకాని, ఆర్ఎస్ఎస్-బీజేపీ నియమించిన గవర్నర్లకు నేరుగా లేఖ రాసిన విషయాన్ని పోలిట్‌బ్యూరో ప్రస్తావించింది. రాజ్యాంగం పునాదులను దెబ్బతీస్తూనే శాస్త్రీయ దృక్పథం, హేతుబద్ధతలను నాశనం చేయడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించాలన్న జాతీయ విద్యా విధానం యొక్క వాస్తవ లక్ష్యాన్ని ఈ ప్రక్రియ బహిర్గతం చేసిందని పేర్కొంది. తక్షణం ఈ లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. దీని సాధన కోసం చేతులు కలపాల్సింగా ప్రజాస్వామిక సంస్థలు, వ్యక్తులకు పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది.