Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులో ప్రతి ధర్మాసనం రోజుకు పది బెయిల్, పది కేసుల బదిలీ పిటిషన్లను విచారిస్తుందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. శుక్రవారం జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో దీనికి సంబందించిన నిర్ణయం తీసుకున్నారు. అత్యున్నత న్యాయస్థానంలోని న్యాయమూర్తులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధర్మాసనం కార్యకలాపాల ప్రారంభంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ ఫుల్ కోర్ట్ సమావేశంలో తాము ఓ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రతి ధర్మాసనం ప్రతి రోజూ కుటుంబ వివాదాలకు సంబంధించిన 10 బదిలీ పిటిషన్లను, 10 బెయిలు పిటిషన్లను విచారణకు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. బెయిలు పిటిషన్లు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినవి కాబట్టి వాటికి ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు. వైవాహిక వివాదాలకు సంబంధించిన కేసుల్లో పార్టీలు తమకు నచ్చిన చోటుకు విచారణను బదిలీ చేయాలని కోరుతున్నాయన్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇటువంటి పిటిషన్లు సుమారు 13,000 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రతి ధర్మాసనం రోజుకు 10 ట్రాన్స్ఫర్ కేసులను చేపడితే, సుప్రీంకోర్టులోని మొత్తం 13 ధర్మాసనాలు రోజుకు 130 కేసులను, వారానికి 650 కేసులను పరిష్కరించగలుగుతాయన్నారు. ఐదు వారాలు ముగిసే సరికి, అంటే శీతాకాలం సెలవులకు ముందు, అన్ని ట్రాన్స్ఫర్ పిటిషన్లపై విచారణ పూర్తవుతుందన్నారు. అనుబంధ జాబితాలో చిట్టచివరి క్షణంలో నమోదు చేసే కేసుల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించినట్టు తెలిపారు. అర్థరాత్రి 12 గంటల వరకు, తెల్లవారుజాము వరకు కేసు ఫైళ్ళను తప్పనిసరిగా చూడవలసిన పరిస్థితిని న్యాయమూర్తులు ఎదుర్కొనకూడదనీ, వారిపై అటువంటి భారాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
దస్త్రాలు లేని న్యాయవాది... బ్యాట్ లేని సచిన్‌తో సమానం
జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కొహ్లీ ధర్మాసనం ముందుకు శుక్రవారం ఓ కేసు విచారణకు వచ్చింది. ఈ కేసులో వాదనలు వినిపించవలసిన న్యాయవాది చేతిలో సంబంధిత కేసు ఫైలు లేకపోవడంతో సీజేఐ స్పందిస్తూ బ్రీఫ్‌ను వెంట తీసుకురాని న్యాయవాది బ్యాట్ లేని సచిన్ టెండూల్కర్ వంటివారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరికాదన్నారు. గౌన్, బ్యాండ్ ధరించి వచ్చారని, కానీ దస్త్రాలు లేవని అన్నారు. ''మీ బ్రీఫ్ (కేసు ఫైలు) ఎల్లప్పుడూ మీ వెంట ఉండాలి'' అని చెప్పారు.