Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కోరెగావ్-బీమా కేసులో అరెస్టయి 2020 ఏప్రిల్ నుంచి జైల్లో వుంటున్న 70 ఏళ్ల సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖాను సుప్రీంకోర్టు ఆదేశాలననుసరించి శనివారం జైలు నుంచి విడుదల చేసి గృహ నిర్బంధంలో వుంచారు. ఆరోగ్యానికి సంబంధించి నవలఖా కోర్టును ఉద్దేశపూర్వకంగానే తప్పు దారి పట్టిస్తున్నారంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) శుక్రవారం వాదించింది. ఆ వాదనలను తోసిపుచ్చిన కోర్టు ఆయనను ఇకపై గృహంలో నిర్బంధించాలని ఆదేశాలు జారీ చేసింది. 48 గంటల వ్యవధిలో ఆయనను గృహ నిర్బంధానికి తరలించాలని కోర్టు గతవారం ఆదేశాలు జారీ చేసినా, విడుదల ఆలస్యమైంది. దీనిపై కోర్టు శుక్రవారం తీవ్రంగా మండిపడింది. ఎన్ఐఎ జాప్యం చేసే ఎత్తుగడలను అవలంబిస్తోందని వ్యాఖ్యానించింది. 24గంటల్లోగా జైలు నుంచి విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. ఎన్ఐఎ శనివారం ప్రత్యేక కోర్టుకు విడుదలకు సంబంధించిన నివేదిక సమర్పించింది. కోర్టు విడుదల మెమోను జారీ చేసింది. నవీ ముంబయిలో ఆయన ఎక్కడ వుండాలనుకుంటే అక్కడే వుంచుతారు. నవలఖా ప్రస్తుతం పలు రకాల రుగ్మతలతో బాధపడుతున్నారు.