Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో మతఘర్షణలు.. అల్లర్లతో అంతా మారిపోయింది..
- 2002 తర్వాతే ప్రధాని మోడీ, అమిత్ షా రాజకీయ ఎదుగుదల
- వివిధ వర్గాల మధ్య పెరిగిన దూరం : జర్నలిస్టు, రచయిత అచ్యుత్ యాగ్నిక్
- హిందూత్వను ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్, ఆప్
న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (డిసెంబర్ 1, 5) సమయం దగ్గరపడింది. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రం కావటంతో ఇక్కడి అసెంబ్లీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హిందూత్వ ఓటు బ్యాంక్‌తోనే బీజేపీ ముందుకెళ్తోందని, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలంగా లేకపోవటం కలిసివస్తోందని జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త అచ్యుత్ యాగ్నిక్ అన్నారు. 2002 గోద్రా మత ఘర్షణలు, అనంతరం చోటు చేసుకున్న మారణకాండతో గుజరాత్లో హిందూత్వ రాజకీయాలు బలపడ్డాయని, వీటిని ఆధారం చేసుకొనే ప్రధాని మోడీ, అమిత్ షా రాజకీయంగా రాష్ట్రంలో ఎదిగారని, అదే ఫార్ములాతో దేశమంతా విస్తరిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌గానీ, ఆమ్ ఆద్మీ పార్టీగానీ పనిచేయటం లేదని ఆయన విమర్శించారు. దాంతో సామాన్య ఓటరు కాస్త గందరగోళంలో ఉన్నాడని అన్నారు. ఆంగ్ల న్యూస్ వెబ్‌పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలు చెప్పారు. అవేంటంటే...
దోషులకు స్వేచ్ఛ
మత కల్లోలాలకు..హత్యాకాండలకు పాల్పడినవారికి గుజరాత్లో స్వేచ్ఛ లభిస్తోంది. జైళ్ల నుంచి విముక్తి లభిస్తోంది. హత్యాకాండలో దోషులుగా తేలినవారి కుటుంబాలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో హిందూత్వ రాజకీయాలకే ప్రాధాన్యత దక్కుతోంది. బీజేపీని ఎదుర్కోవడానికి హిందూత్వకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు వెళ్లటం లేదు. మత ఘర్షణలు, అల్లర్లతో బీజేపీ నాయకులు రాజకీయంగా బాగా ఎదిగారు. దేశవ్యాప్తంగా గుజరాత్ మోడల్‌ను ప్రధాని మోడీ, అమిత్ షా తీసుకెళ్తున్నారు.
హిందూత్వ రాజకీయాలు లేకుండా ప్రధాని మోడీ, అమిత్ షా లేరు. వారి రాజకీయ ఎదుగుదల అంతా దీనితోనే ముడిపడింది. రాష్ట్రంలో మహాత్మాగాంధీ ఆలోచనలు, భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ మెల్ల మెల్లగా దెబ్బతీస్తూ వస్తోంది. 1920లో మహాత్మాగాంధీ స్థాపించిన 'గుజరాత్ విద్యాపీఠ్' సైతం ఆర్ఎస్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. బీజేపీ హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడే స్థితిలో కాంగ్రెస్ లేదనే చెప్పాలి.
బలమైన నాయకుల్లేని కాంగ్రెస్
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ యూత్ వింగ్ 'సేవా దళ్' కన్నా...ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ బలం చాలా ఎక్కువ. కాంగ్రెస్ సీనియర్ నాయకులకు, క్షేత్రస్థాయిలో యువతకు సంబంధాలు లేనే లేవు. దాంతో సేవా దళ్ నామమాత్రంగా మారింది. మాధవ్‌సిన్హా సోలంకీ, జినాభారు దార్జీ వంటి బలమైన నాయకులు కాంగ్రెస్‌కు ఉండేవారు. ప్రతి నియోజికవర్గం నుంచి వారికి కార్యకర్తలు ఉండేవారు. అక్కడేం జరుగుతోందన్నది సమాచారం ఉండేది. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలతో బలమైన సంబంధాలున్నవారు ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వంలో లేరు. మధ్య తరగతి కుటుంబాలకు కాంగ్రెస్ దూరమైంది.