Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం చర్యలతో మునిగిపోయిన రంగం
- మరింత అట్టడుగుకు పడిపోయిన వైనం
- కళకళలాడుతున్న కార్పొరేట్ సెక్టారు
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ సర్కారు విధానాలు అసంఘటిత రంగానికి శాపంగా మారాయి. ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా అసంఘటిత రంగం మరింత అట్టడుగుకు పడిపోయింది. ఇదే తరుణంలో మోడీ సర్కారు కార్పొరేటు సానుకూల నిర్ణయాలతో ఆ రంగం భారీగా ప్రయోజనాలు పొందుతూ కళకళలాడుతున్నది. దేశంలోని ఈ విభిన్న పరిస్థితులపై కార్మిక సంఘాల నాయకులు, మార్కెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న కోట్లాది వ్యాపారాల్లో కార్పొరేటు సంస్థలు కొన్ని వేల వ్యాపారాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. 90 శాతానికి పైగా వ్యాపారాలు అసంఘటిత రంగంలో ఉన్నాయి. అయితే అవి మాత్రం క్షీణిస్తున్నాయని పలు నివేదికలు సూచిస్తుండటం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 తొలి త్రైమాసికానికి అధికారిక జీడీపీ కరోనా మహమ్మారి స్థాయి కంటే స్వల్పంగానే ఎక్కువగా ఉన్నది. స్థానిక మార్కెట్, ఆర్థిక వ్యవస్థ మధ్య ఈ అస్తవ్యస్తత స్తబ్దుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో కార్పొరేటు లాభాల పెరుగుదలను ప్రతిబింబిస్తున్నదని నిపుణులు చెప్పారు.
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆగస్టు 2022లో విడుదల చేసిన సుమారు 2700 ప్రభుత్వేతర, ఆర్థికేతర కంపెనీల సమాచారం ప్రకారం.. కార్పొరేటు కంపెనీల అమ్మకాలు 41 శాతం పెరిగాయి. నికర లాభాలు గత ఏడాదితో పోలిస్తే 24 శాతం ఎగబాకాయి. కార్పొరేటు రంగం పెరుగుదల ఆర్థిక వ్యవస్థ వృద్ధిని మించిపోయింది. మరోపక్క, అసంఘటిత రంగం క్షీణతను నమోదు చేయటం గమనార్హం. రెండు రంగాల మధ్య విభేదాల విస్తృతంగా కనిపిస్తున్నాయని నిపుణులు తెలిపారు. అసంఘటిత రంగం తమ వ్యయాలను పెంచే మార్పులను తట్టుకులేకపోతున్నదని వివరించారు. జీఎస్టీ ఆర్థిక వ్యవస్థను, అసంఘటిత రంగాన్ని తీవ్రంగా దెబ్బ తీసిందని మార్కెట్ నిపుణులు చెప్పారు. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం కార్పొరేటు ప్రయోజనాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవటంతో అసంఘటిత రంగం భవష్యత్తు ఆందోళనకరంగా మారిందని నిపుణులు తెలిపారు. ఇది అసంఘటిత రంగాన్ని నమ్ముకొని ఉన్న కార్మికులు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నదని వివరించారు. ఫలితంగా దేశంలోని ప్రజల మధ్య ఆర్థిక, సామాజిక అసమానతలు మరింత తీవ్రమైందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటలైజేషన్తో పాటు కేంద్రం తీసుకున్న పలు అనాలోచిత నిర్ణయాలు ఈ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశాయని మార్కెట్ నిపుణులు వివరించారు. కరోనా మహమ్మారి కాలంలో కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్ ప్యాకేజీ అసంఘటిత రంగానికి చేసింది శూన్యమేనని అన్నారు. ముఖ్యంగా, వ్యవసాయం రంగంపై ఆధారపడిన కుటుంబాలనూ ఇది అఘాతంలోకి నెట్టిందన్నారు. ఫలితంగా దేశంలో నిరుద్యోగ సమస్యను ఇది మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు. అసంఘటిత రంగాన్ని ఆదుకోవాల్సిన గురుతర బాధ్యత కేంద్రంపై ఉన్నదని నిపుణులు చెప్పారు. అలాగే, సంఘటిత రంగం కూడా తన సొంత ప్రయోజనాలే లక్ష్యం కాకుండా అసంఘటిత రంగం గురించి కూడా ఆలోచించాలన్నారు. ఈ మేరకు కేంద్రం నిబంధలను సవరించాలన్నారు. కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే క్షీణించిందనీ, ఇప్పుడు అసంఘటిత రంగం మరింతగా దెబ్బ తింటే ఆ పరిస్థితి మరింత సంక్లిష్టంగా తయారవుతుందని నిపుణులు హెచ్చరించారు.