Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23రోజులు..17 సిట్టింగ్స్
న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శనివారం లోక్సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. 23 రోజుల పాటు 17 సిట్టింగ్లు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు బిల్లులను ఆమోదించాలని మోడీ సర్కార్ యోచిస్తోంది. మరోవైపు ప్రజా సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు ఒత్తిడి చేయనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల్లో వివాదాస్పద దేశద్రోహ చట్టంలో సవరణ బిల్లు ఉండే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దేశద్రోహ చట్టంలో మార్పులు తీసుకురావచ్చని మోడీ ప్రభుత్వం నవంబర్ 1న సుప్రీంకోర్టుకు తెలిపింది. తొలి రోజు లోక్సభ సిట్టింగ్ సభ్యుడు, సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మరణానికి ఉభయ సభలు సంతాపం తెలపనున్నాయి. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నందున పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరు కాకపోవచ్చునని జైరాం రమేష్ అన్నారు. ఆజాదీకా అమృత్ కాల్ సమయంలో పార్లమెంట్ వ్యవహారాలు, ఇతర అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సాధారణంగా ప్రతి ఏడాది నవంబర్ మూడో వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి గుజరాత్ ఎన్నికలు ఉండటంతో డిసెంబర్లో ప్రారంభిస్తున్నారు.
కొత్త పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ సమావేశాల నాటికి కొత్త పార్లమెంట్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనం అక్టోబర్ నాటికి పూర్తి అవుతుందని తొలిత ప్రకటించారు. కానీ పూర్తి కాకపోవడంతో నవంబర్ నాటికి పూర్తి అవుతుందని, శీతాకాల సమావేశాలు అందులోనే నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ పూర్తి కాకపోవడంతో ఇప్పుడు డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని ప్రభుత్వం తెలిపింది. 2023 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొత్త పార్లమెంట్ భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి.