Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్ 'మత' చట్టంపై హైకోర్టు ఉత్తర్వులు
భోపాల్ : మత స్వేచ్ఛ పేరుతో దానిని హరించేలా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన చట్టంలోని ఒక సెక్షన్‌ను రాజ్యాంగ విరుద్ధమని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ సెక్షన్ అమలును నిలిపివేస్తూ తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేసింది. ఆ చట్టంలోని పదవ సెక్షన్ ప్రకారం మతం మారాలని భావించిన వ్యక్తి మత మార్పిడికి 60రోజులు ముందుగా జిల్లా మేజిస్ట్రేట్‌కు తెలియజేయాల్సి వుంటుంది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించే మత పెద్ద కూడా 60 రోజుల నోటీసు ఇవ్వాలని సబ్‌సెక్షన్ 2లో పేర్కొన్నారు. వీటిని ఉల్లంఘించిన వారికి మూడు నుండి ఐదేళ్ల శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉది. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన ఏడు పిటిషన్లను విచారించిన కోర్టు సెక్షన్ 10 మొత్తం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని భావిస్తున్నట్లు జస్టిస్ సుజోరు పాల్, పి.సి .గుప్తాలతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ మేరకు 32 పేజీల ఆదేశాలను విడుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వం, సెక్షన్ 10ని ఉల్లంఘించినందుకు ఎవరినీ ప్రాసిక్యూట్ చేయరాదని పేర్కొంది. ప్రలోభాలు పెట్టి వివాహం చేసుకోవడాన్ని లేదా అక్రమ మత మార్పిడిని నివారించే లక్ష్యంతో 1968 నాటి మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టాన్ని సవరించినట్లు గతంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కలెక్టర్‌కు ముందుగా తెలియచేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని, అటువంటి చర్యల వల్ల దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని పిటిషన్ దారుల పట్ల వాదించిన న్యాయవాది హిమాంశు మిశ్రా మీడియాకు చెప్పారు.