Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7.97 కోట్లు తగ్గిన పీఎంకిసాన్ లబ్దిదారుల సంఖ్య
- తెలంగాణాలో 14.78 లక్షల మంది,ఏపీలో 27.48 లక్షలు : కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు
న్యూఢిల్లీ: మూడేండ్లలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) చెల్లింపుల్లో 67 శాతం తగ్గుదల ఉన్నది. 2019 ఫిబ్రవరిలో మొదటి విడత నుంచి 2022 మే-జూన్‌లో 11వ విడత వరకు పీఎం కిసాన్ లబ్దిదారుల సంఖ్య 11.84 కోట్ల నుంచి 3.87 కోట్లకు తగ్గింది. అంటే 7.97 కోట్ల మంది లబ్దిదారులు పీఎం కిసాన్‌కు దూరమయ్యారని కేంద్ర వ్యవసాయమంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. హక్కుల కార్యకర్త కన్హయ్యకుమార్ దాఖలు చేసిన సమాచార హక్కుచట్టం దరఖాస్తుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది. 11వ విడత నిధులను పొందిన రైతులు సంఖ్య 67 శాతం తగ్గిందని తెలిపింది. 2022 మే-జూన్‌లో 11వ విడత రూ.2,000ని కేవలం 3.87 కోట్ల మంది రైతులకు మాత్రమే వారి ఖాతాల్లో జమ చేసినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 ఫిబ్రవరి 2019లో మొదటి విడతను పొందిన 11.84 కోట్ల మంది రైతులతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గింది. 12వ విడత అక్టోబర్ 2022లో పంపిణీ చేశారు. మొదటి విడతలో 11.84 మంది రైతులుండగా, 9.87 కోట్ల మంది రైతులకు అందిన ఆరో విడత నుంచి తగ్గుదల ధోరణి మొదలైంది. ఏడో విడతలో 9.30 కోట్లకు, ఎనిమిదో విడత 8.59 కోట్లకు, తొమ్మిదో విడత 7.66 కోట్లకు, పదో విడత 6.43 కోట్లకు లబ్దిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ తగ్గారు..
తెలంగాణలో మొదటి విడతలో 39.10 లక్ష మంది రైతులకు పీఎం కిసాన్ నిధిఅందగా, 11వ విడతకు వచ్చే సరికి 24.32 లక్షల మంది రైతులకు తగ్గారు. ఈ మూడేండ్లలో 14.78 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ నుంచి తొలగించారు. ఆంధ్రప్రదేశ్‌లో పీఎం కిసాన్ లబ్దిదారుల సంఖ్య 55.68 లక్షల నుంచి 28.2 లక్షలకు తగ్గింది. ఈ మూడేండ్లలో 27.48 లక్షల మంది తగ్గారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీహార్‌లో లబ్దిదారుల సంఖ్య 83 లక్షల నుంచి ఏడు లక్షలకు తగ్గగా, ఛత్తీస్‌గఢ్‌లో 37 లక్షల నుంచి రెండు లక్షలకు తగ్గినట్టు నివేదిక స్పష్టం చేస్తుంది. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో 2019లో 63.13 లక్షల మంది రైతులు ఈ మొత్తాన్ని పొందగా, 2022లో కేవలం 28.41 లక్షల మంది రైతులు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ది పొందారు. హర్యానాలో 19.73 లక్షల మంది రైతులు మొదటి విడత పొందగా, 11 విడత 11.59 లక్షల మంది రైతులు పొందారు. మహారాష్ట్రలో లబ్దిదారుల సంఖ్య 2019లో 1.09 కోట్ల మంది రైతుల నుంచి 2022 నాటికి 37.51 లక్షలకు భారీగా తగ్గింది. మధ్యప్రదేశ్‌లో 2019లో 88.63 లక్షల మంది లబ్దిపొందగా, 2022లో కేవలం 12,053 మంది రైతులు మాత్రమే ఈ మొత్తాన్ని పొందారు. మేఘాలయలో మొదటి విడతలో 1.95 లక్షల మంది రైతులు పీఎం కిసాన్ పథకం నుంచి లబ్ది పొందగా, 11వ విడతలో కేవలం 627 మంది రైతులు మాత్రమే లబ్ది పొందారు. పంజాబ్‌లో మొదటి విడతలో 23.34 లక్షల మంది రైతులు లబ్ది పొందితే, 11 విడతలో 11.31 లక్షల మంది రైతులకు తగ్గిందని గణాంగాలు స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ..
ఉత్తరప్రదేశ్‌లో 2019లో 2.6 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అందగా, 2022లో అది సగానికి తగ్గి 1.26 కోట్లకు చేరింది. పశ్చిమ బెంగాల్లో 2019లో 45.63 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సాయం అందగా, ఆరో విడత నుంచి ఒక్క రూపాయి కూడా రైతులకు అందలేదని డేటా స్పష్టం చేస్తుంది. అసోంలో మొదటి విడతలో 28.79 లక్షల మంది రైతులకు పీఎంకిసాన్ అందగా, 11వ విడతలో కేవలం 2.54 లక్షల మంది రైతులకు మాత్రమే అందింది. చండీగఢ్‌లో 2022 మే-జూన్‌లో కేవలం ముగ్గురికి మాత్రమే ఈ మొత్తం అందింది. ఢిల్లీలో ఈ సంఖ్య 16,513 నుంచి 2,065కి తగ్గింది. హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా ఈ సంఖ్య 9.86 లక్షల నుంచి 5.43 లక్షలకు సగం తగ్గింది. జమ్మూకాశ్మీర్‌లో లబ్దిదారులు 12.07 లక్షల నుంచి 5.61 లక్షలకు తగ్గారు. జార్ఖండ్‌లో 11 విడతలో 4.17 లక్షల మంది రైతులు మాత్రమే అందుకున్నారు. మొదటి విడతలో 27.07 లక్షల మంది రైతులు అందుకున్నారు. కర్నా టకలో ఈ సంఖ్య 55.61 లక్షల నుంచి 2.58 లక్షలకు తగ్గింది. కేరళలో 36.99 లక్షల మంది నుంచి 24.23 లక్షల మంది రైతులకు తగ్గారు. అదేవిధంగా ఒడిశాలో 39.20 లక్షల మంది రైతుల నుంచి 7.05 లక్షల మందికి తగ్గారు. తమిళనాడులో 46.8 లక్షల లబ్దిదారుల నుంచి 23.04 లక్షల మందికి తగ్గారు. త్రిపురలోనూ సగానికి సగం తగ్గింది.
పథకం ప్రారంభం ఇలా...
2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అర్హులైన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6,000 (మూడు విడతల్లో, విడతకి రూ.2000 చొప్పున) ఇవ్వనున్నారు.
దిగ్భ్రాంతికరం : అశోక్ ధావలే, ఎఐకెఎస్
ఈ గణాంకాలు ''చాలా దిగ్భ్రాంతికరమైనవి'' అని ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే అన్నారు. ''2022లో ఈ డేటా ప్రకారం మూడొంతుల మంది రైతులకు చెల్లింపులు అందలేదు. లబ్దిదారుల సంఖ్యలో ఇంత తగ్గుదలకు ఎలాంటి కారణం లేదు. ఈ పథకాన్ని కేంద్రం మెల్లమెల్లగా గాలికొదిలేసే ప్రయత్నం చేస్తోందన్నది సుస్పష్టం. ఈ పథకం చట్టబద్ధంగా హామీ ఇవ్వబడిన ఎంఎస్పీకి ప్రత్యామ్నాయం కాదు. రైతులు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను అధిగమించేందుకు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలి. ఈ పథకం జుమ్లా'' అని ధావలే స్పష్టం చేశారు. మొత్తం 12 విడతల్లో రూ.2.16 లక్షల కోట్లు రైతులకు అందజేశామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.