Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి ఆప్ కష్టాలు
- పట్టణ ప్రాంతాల్లో కమలం.. గ్రామీణ ప్రాంతాల్లో హస్తం
- బీజేపీ ఓటు బ్యాంక్‌పై ఆప్ కన్ను
న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో ఎలాగైనా ఈసారి కూడా గెలవాలని బీజేపీ, ఈసారైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణి కోట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల ప్రచారం ముమ్మరం చేశాయి. శీతాకాలంలో ప్రచారం పర్వం వేడెక్కుతోంది. పార్టీల మధ్య విమర్శ, ప్రతి విమర్శలు, ప్రజలకు హామీలపై హామీలు గుప్పిస్తూ గుజ రాత్లో రాజకీయం రంజుగా మారుతోంది. కరోనా రెండో వేవ్‌లో ప్రభుత్వ వైఫల్యం వల్ల లక్షలాది ప్రాణాలు కోల్పో వడం, నిరుద్యోగం, ధరలు పెరుగుదల, అవినీతి అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి అంశాలు బీజేపీకి అడ్డుగా ఉన్నా యి. అయితే గుజరాత్ కోటను కాపాడుకోవడానికి బీజేపీ ప్రధాని మోడీ 'చరిష్మా'పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఆయనే దిక్కుగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌కు చరిష్మా గల నాయకుడు లేడు. అయినప్పటికీ ఆ పార్టీ క్షేత్రస్థాయిల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్‌కు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆప్‌కు ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ఆకర్షణ గల నాయకు డు. ఆయనే ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. బీజే పీ, కాంగ్రెస్, ఆప్ మూడు పార్టీలు నువ్వా, నేనా అన్నట్లు ప్ర చారంలో దూసుకుపోతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో భార తీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) కాస్తా ప్రభావం చూపుతోంది.
సిట్టింగ్‌లను పక్కన పెట్టిన బీజేపీ...కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత
ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు బీజేపీ సిట్టింగ్‌లను పక్కన పెట్టింది. మాజీ ముఖ్యమంత్రి విజరు రూపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా ఎనిమిది మంది మంత్రులతో పాటు 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి బీజేపీ సీట్లు ఇవ్వలేదు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన బీజేపీ సర్కార్, దాన్ని నుంచి బయట పడేందుకు సిట్టింగ్‌లను పక్కన పెట్టింది. ఇప్పటి వరకు రెండు దశల్లో 166 మంది అభ్యర్థుల పేర్లు విడుదల చేసిన బీజేపీ, పటేళ్లకు 39, కోలి పటేళ్లకు 17, బ్రహ్మణులకు 13, క్షత్రియలకు 16, ఠాకూర్లకు 9, ఎస్టీలకు 23, ఎస్సీలకు 13, ఓబీసీలకు 16 స్థానాలను కేటాయించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేల్లో తొమ్మిది మందిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్‌కు కూడా టికెట్ ఇచ్చింది. ఆప్ 174 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఆప్ కూడా కాంగ్రెస్, బీజేపీ, బీటీపీ నుంచి వచ్చిన వారికి సీట్లను కేటాయించింది. మాండ్వీ స్థానం నుంచి కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి కైలాష్ గధ్వీని పోటీకి దింపింది. సూరత్ జిల్లా మజురా స్థానం నుండి సూరత్ మాజీ బీజేపీ అధ్యక్షుడు పివిఎస్ శర్మను కూడా పోటీకి దింపింది. దేడియాపాడు నుంచి నర్మద జిల్లా బీటీపీ మాజీ అధ్యక్షుడు చైతర్ వాసవను కూడా పోటీకి దింపింది. ఇలా అనేక మంది ఇతర పార్టీల నుంచి ఆప్‌లో చేరిన వారికి ఆ పార్టీ సీట్లను ఇచ్చింది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 96 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ఈసారి పోటీ చేయనున్నాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు గుజరాత్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. అప్పుడు ఎన్సీపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. ఈసారి ఎన్సీపీ మూడు స్థానాల్లో ఉమ్రేత్ (ఆనంద్ జిల్లా), నరోడా (అహ్మదాబాద్), దేవగఢ్ బరియా (దహౌద్ జిల్లా) పోటీ చేయనుంది. ఈ మూడు స్థానాలు ప్రస్తుతం అధికార బీజేపీ చేతిలో ఉన్నాయి.
ఈ ఏడు స్థానాల్లో ఎన్నడూ గెలవని బీజేపీ
గత 27 ఏండ్ల నుంచి ఏకదాటిగా గుజరాత్‌ను ఏలుతున్న బీజేపీ, ఆ ఏడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఎన్నడూ గెలవలేదు. స్వాతంత్య్రం సాధించినప్పటి నుంచి చూసుకుంటే ఆ సీట్లలో కమలం పార్టీ పాగా వేయలేకపోతోంది. బోర్నాడ్, ఝర్బియా, అంకలావ్, దానిలిమ్గా, మహుధా, గర్భనా, వ్యారా అసెంబ్లీ స్థానాలను గెలవలేదు. మహారాష్ట్ర నుంచి గుజరాత్ 1960లో వేరుపడి రాష్ట్రంగా ఏర్పడింది. అక్కడ 1962లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఆయా స్థానాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీలు స్వతంత్రులు విజయం సాధిస్తూ వస్తున్నారు. బోర్బాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రతిసారీ కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తోంది. ఝగ్గియా సీటులో 1952 నుంచి 2017 వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్, జేడీయూ, బీటీపీ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. వ్యారా నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లూ కాంగ్రెస్ విజయం సాధించింది. దునిలిమ్గా, అంకలావ్, మహుధా, గర్భనాల్లో కూడా కాంగ్రెసే గెలుస్తూ వస్తుంది. ఇవన్ని గిరిజన ప్రాంతానికి చెందినవే. రాష్ట్ర ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయా స్థానాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను బీజేపీ చీల్చలేకపోయింది.
పట్టణాల్లో బీజేపీ, గ్రామాల్లో కాంగ్రెస్
పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. అయితే ఈసారి ఆప్ గుజరాత్ ఎన్నికల్లో ప్రవేశించడంతో ఎవరికి దెబ్బ కొడుతుందోనని భయంగా ఆ రెండు పార్టీలు ఉన్నాయి. గతేడాది సూరత్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 27 సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆప్ ప్రధాన దష్టి పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఓటు బ్యాంక్‌పైనే ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఆప్ వల్ల కాంగ్రెస్ కంటే, బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పట్టణ ప్రాంతాల్లో పాగా వేసింది. బీజేపీ అర్బన్, సెమీ అర్బన్ ఓటు బ్యాంకును దెబ్బతీస్తుందని తెలుస్తోంది. ఆప్‌కు గ్రామీణ ప్రాంతాల్లో అంత పట్టు లేదు. గత 30 ఏండ్లలో కాంగ్రెస్ గెలవలేకపోయిన 66 అర్బన్, సెమీ అర్బన్ స్థానాల్లో బీజేపీకి ఆప్ సవాల్ ఉంది. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర పోటీ నెలకొని, ఓట్లు చీలితే కాంగ్రెస్‌కే లాభం చేకూరుతోంది.
సామాజిక సమీకరణలు ఇలా...
గుజరాత్లో సామాజిక సమీకరణలు ఇలా ఉన్నాయి. ఒబిసిలు 40 శాతం, అగ్రవర్ణలు (పటేళ్లు, బ్రహ్మణలు, క్షత్రియలు, ఠాకూర్లు ) 26 శాతం, గిరిజనలు 14.75 శాతం, ముస్లింలు 9.67 శాతం, దళితులు 6.74 శాతం, ఇతరులు 2 శాతం ఉన్నారు. 1980లో మాధవ సింగ్ సోలంకి క్షత్రియ, హరిజన, గిరిజన, ముస్లీం (కెహెచ్ఎఎం) ఫార్ములాతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆయా వర్గాలు కాంగ్రెస్‌తోనే ఉన్నాయి. పటేళ్లు, బ్రహ్మణలు, ఠాకూర్లు బీజేపీతో ఉన్నారు. అయితే గత 2017 ఎన్నికల్లో బీజేపీకి పటేళ్లు దెబ్బకొట్టడంతో ఆ పార్టీ ఓటమి అంచుకు చేరింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99, కాంగ్రెస్ 77, బీటీపీ 2, ఎన్సీపీ 1, ముగ్గురు స్వతంత్రులు గెలిచారు.
అయితే తరువాత చాలా మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. దీంతో ప్రస్తుతం బీజేపీకి 109, కాంగ్రెస్ 59, బీటీపీ 2, ఆప్ 1, ఎన్సీపీ 1, ఇద్దరు స్వతంత్రలు ఉన్నారు. 1995లో గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, ఆ తరువాత ఒక్క అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోలేదు. రెండు దశల్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1న 89, డిసెంబర్ 5న 93 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.