Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ, సీబీఐ, ఐటీ లను ఉసిగొల్పుతున్న కేంద్రం : బృందా కరత్
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరుపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ ఎంపీ బృందా కరత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం రాజ్యాంగ వ్యవస్థపై దాడికి పాల్పడుతున్నదన్నారు. ఆయా రాష్ట్రాలలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఆదాయపు పన్ను (ఐటీ) విభాగాలను కేంద్రం 'త్రిశూలం'గా ఉపయోగిస్తున్నదని బృంద కారత్ చెప్పారు. పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల నాయకులు బీజేపీకి లొంగే వరకు ఈ 'త్రిశూల్'ను ఉపయోగిస్తారని ఆమె అన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ఎదుర్కొంటునన్నది ఒకరికి సంబంధించిన ప్రశ్న కాదనీ, ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష రాజ్యాంగబద్ధ స్థానంపై దాడిగా బృందా కరత్ అభివర్ణించారు. దీనిని ఖండిస్తున్నట్టు తెలిపారు. అక్రమ మైనింగ్ కేసులో హేమంత్ సొరెన్‌కు నోటీసులు జారీ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.. ఆయనను విచారిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపర్చటానికి తన ఎజెండాలో భాగంగా గవర్నర్ పదవిని కేంద్రం ఉపయోగించుకుంటున్నదని ఆమె ఆరోపించారు. దేశంలోని రాజ్యాంగాన్ని, సమాఖ్యస్ఫూర్తిని కాపాడటానికి ప్రస్తుతం అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమై ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు.