Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీకి మాత్రమే సమాచారమిచ్చిన కేంద్రం : ఆర్టీఐ కార్యకర్త బాత్రా
న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉంటాయనగా ఎన్నికల బాండ్ల పథకంలో మోడీ సర్కార్ చేసిన మార్పులు..ఇప్పుడు వివాదాస్పదమవుతున్నాయి. ఆర్బీఐ చట్టం, 1934లోని సెక్షన్ 31 ద్వారా దఖలుపడిన అధికారాల్ని ఉపయోగించుకొని 2018లో ఈ పథకాన్ని మోడీ సర్కార్ తీసుకొచ్చింది. ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్ జులై, అక్టోబర్లో బాండ్ల అమ్మకాల్ని చేపట్టవచ్చు. ఈ ఏడాది అక్టోబర్లో చేపట్టిన 10 రోజుల అమ్మకాలతో పథకం గడువు ముగిసింది. అయినప్పటికీ పథకం నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేపట్టింది. మరో 15 రోజులు అదనంగా బాండ్ల అమ్మకాన్ని చేపడతామని నవంబర్ 7న నోటిఫికేషన్ జారీచేసింది. ఈ విషయాన్ని ముందుగా కేంద్ర ఎన్నికల సంఘానికి మాత్రమే మోడీ సర్కార్ తెలియజేసిందని, ఆర్బీఐ నుంచి ఆమోదం తీసుకోలేదనే విషయం బయటకు పొక్కింది. ఈ సంగతి..సామాజిక కార్యకర్త లోకేశ్ కె.బాత్రా దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన సమాచారంలో ఉంది.
దీనిపై బాత్రా ఏమన్నారంటే..''ఆర్బీఐ చట్టాన్ని ఉపయోగించి ఎన్నికల బాండ్ల పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇప్పుడదే చట్టాన్ని ఉపయోగించి కీలక మార్పులు చేసింది. ఆర్బీఐతో సంప్రదింపులు జరపకుండానే కీలకమార్పులు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉంది'' అని చెప్పుకొచ్చారు. బాండ్ల పథకం అమలు గడువు ఎట్టి పరిస్థితుల్లో పెంచరాదని ఏప్రిల్ 12, 2019లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని బాత్రా గుర్తుచేశారు. ఆర్బీఐ ఆమోదం లేకుండా పథకంలో కీలక మార్పులు చేయటాన్ని ఆయన తప్పుబట్టారు.