Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి సేవలో తరిస్తున్న మోడీ సర్కార్
- ఆర్టీఐ దరఖాస్తుకు ఆర్బీఐ సమాధానం
- భారీ రుణమాఫీ వివరాల్లేవు...
న్యూఢిల్లీ : గత ఐదేండ్లలో కార్పొరేట్లకు భారీ మొత్తంలో రూ.10 లక్షల కోట్లకు పైగా రుణాలు మాఫీ చేసినట్టు ఆర్బీఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పిటిషన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమాధానమిచ్చింది. గత ఐదేండ్లలో రూ.10,09,510 కోట్లు ఎన్పీఏ కింద బ్యాంకులు మాఫీ చేశాయని తెలిపింది. అందులో కేవలం రూ.1,32,036 కోట్ల (13శాతం) రుణాలు మాత్రమే బ్యాంకులు వసూలు చేసినట్టు తెలిపింది. 2022-23 నాటికి అంచనా వేసిన స్థూల ఆర్థిక లోటు రూ.16.61 లక్షల కోట్లలో 61శాతం రుణమాఫీ అవుతుందని అంచనా వేశామనీ, మార్చి 2022 నాటికి ఎన్పీఏలు రూ.7,29,388 కోట్లకు తగ్గించిందని ఆర్బీఐ వెల్లడించింది. గత 10 సంవత్సరాలలో రూ.13,22,309 కోట్లు రుణమాఫీ చేసినట్టు తెలిపింది. స్థూల గణన ప్రకారం డిఫాల్ట్ చేసిన రుణాల మొత్తం రూ.16.06 లక్షల కోట్లు (రుణమాఫీతో సహా ఐదేండ్లలో రైట్-ఆఫ్‌ల ద్వారా రికవరీ చేసిన రుణాలు మినహాయించి) ఉందనీ, రుణమాఫీలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, బ్యాంకులు పేర్కొన్న 5.9శాతం నుంచి మొత్తం ఎన్పీఏ నిష్పత్తి 13.10శాతానికి పెరుగుతుందని పేర్కొంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యధికంగా రుణమాఫీలు చేశాయనీ, మొత్తం రూ. 7,34,738 కోట్లు (దాదాపు 73శాతం) ఆర్బీఐ తెలిపింది. ''క్రమబద్ధీకరించబడని క్రెడిట్ వాతావరణంలో బ్యాంకులు జారీచేసిన నిబంధనలకు లోబడి తమ బోర్డు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా రుణాల వాణిజ్య అంచనా ప్రకారం చెడ్డ రుణాల (బ్యాడ్‌లోన్స్)ను మాఫీ చేయడంతో సహా క్రెడిట్-సంబంధిత నిర్ణయాలను తీసుకోవాలని సూచించినట్టు ఆర్బీఐ తెలిపింది. అయితే పెద్ద మొత్తం చేసిన భారీ రుణమాపీలను మాత్రం ఆర్బీఐ వెల్లడించలేదు. ''రుణ గ్రహీతల వారీగా రుణమాఫీ గురించి సమాచారం మేం సేకరించలేదు.
అందువల్ల దానికి సంబంధించిన డేటా మా వద్ద అందుబాటులో లేదు'' అని తెలిపింది. రుణగ్రస్తుల పేర్లను వెల్లడించకుండానే బ్యాంకులు గత కొన్ని సంవత్సరాలుగా అనేక భారీ రుణాలను రద్దు చేశాయి. గత ఐదేండ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.7,34,738 కోట్లు (73శాతం) రుణమాఫీ చేశాయి. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎన్పీఏలు రూ.2,04,486 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) రూ.67,214 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.66,711 కోట్లు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.50,514 కోట్లు మాఫీ చేశాయి.
ప్రజల పొదుపు సొమ్ము దోపిడి...
ప్రజలు జీవితకాలం పొదుపు చేసుకునే సొమ్మును దోచుకుంటున్నారని సీపీఐ(ఎం) కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'గత ఐదేండ్లలో ఆశ్రిత పెట్టుబడిదారులు తీసుకున్న రూ.10 లక్షల కోట్లకుపైగా బ్యాంకు రుణాలను రద్దుచేశారు. బ్యాంకు ఖాతాల్లో ప్రజల పొదుపు సొమ్మును దోచుకుంటున్నారు. మోడీ సన్నిహితుల పేర్లు రహస్యంగా ఉంచారు. సరిగ్గా ఇలానే ఎలక్టోరల్ బాండ్లను రహస్యంగా ఉంచాలని కోరుతున్నారా?' అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించడం కంటే ఈ ప్రభుత్వానికి ఎలక్టోరల్ బాండ్లు చాలా ముఖ్యమైనవి' అని విమర్శించారు. 'రుణమాఫీ (రైట్ ఆఫ్) అనేది సాంకేతిక పదమని ప్రభుత్వం చెబుతోంది, అయితే 90 శాతం డబ్బు తిరిగి రావడం లేదు. వాస్తవానికి దేశ ప్రజానీకం డబ్బుతో బడా కార్పొరేట్లు లబ్ది పొందుతున్నారు. ఒక రైతు రుణం చెల్లించకపోతే, ఆ రైతు పేరు అందరికి చెబుతారు. కానీ బడా కార్పొరేట్ చెల్లించకపోతే ఎందుకు చెప్పరు'' అని ఏచూరి ప్రశ్నించారు.
- సీతారాం ఏచూరి