Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కన పెట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు
- రామచంద్ర భారతికి చుక్కెదురు
- బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లండి : ఎమ్మెల్యే కొనుగోలు కేసులో
సుప్రీం కోర్టు స్పష్టం
న్యూఢిల్లీ : రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన సింగిల్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. రిమాండ్‌ను సవాల్ చేస్తూ రామచంద్ర భారతి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు విముఖత చూపింది. సిట్ విచారణ యథావిథిగా కొనసాగించాల్సిందే అని స్పష్టం చేసింది. నిందితులు ఈ కేసు కొట్టివేతపై పిటిషన్ దాఖలు చేయకుండా, బెయిల్ కోసం దాఖలు చేసుంటే ఎప్పుడో ఇచ్చే వాళ్లమని వ్యాఖ్యానించింది. సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ ఉన్న అన్ని పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని ఆదేశించింది.
తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని, ప్రత్యేక విచారణ బృందం( సిట్) విచారణను నిలిపివేయాలని, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణపై ముగ్గురు నిందితులు సుప్రీం కోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తొలుత నిందితుల అరెస్ట్‌పై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులను అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది తన్మరు మెహతా వాదనలు వినిపించారు. ఇది ట్రాప్ కేసు అని, ట్రాప్ కోసం పోలీసులు ఉపయోగించిన పరికరాల వివరాలు సరిగా లేవన్నారు. ఈ కేసులో ఎలాంటి రికవరీ జరగలేదని కోర్టుకు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. లంచం తీసుకున్న వారికే పిసి చట్టం వర్తిస్తుందన్నారు. అరెస్ట్ చట్ట విరుద్ధంగా చేసిన కారణంగానే ట్రయల్ కోర్టు రిమాండ్‌ను తిరస్కరించిందని వాదించారు. 498ఎ కేసులో మెకానికల్‌గా అరెస్ట్ చేయకూడదని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఏడేండ్ల వరకు శిక్ష పడే కేసులో సిఆర్పిసి 41ఎ ప్రకారం ముందుగానే నోటీసు ఇవ్వాలంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. దర్యాప్తుకు సహకరిస్తున్నప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఈ వాదనలపై తెలంగాణ ప్రభుత్వ తరపు తరుపు సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ్ లూత్రాలు అభ్యంతరం తెలిపారు. అక్టోబర్ 29కు సెషన్ కోర్టులో నిందితులను హాజరుపరిచినట్లు చెప్పారు. అయితే, జస్టిస్ గవాయి జోక్యం చేసుకొని... హైకోర్టు తీసుకున్న నిర్ణయం గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వ్యతిరేకంగా ఉందని, ఇది ఒక వ్యక్తి స్వేచ్చకు సంబంధించిన అంశమని అన్నారు. హైకోర్టు తప్పుగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుందని వ్యాఖ్యానించారు. అవినీతిని పట్టుకునేందుకు ట్రాప్ వేశామని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పోలీసులు అక్కడే ఉన్నారని, ముందుగానే నోటీసు ఇవ్వాల్సిన అవసరమేమి లేదని అన్నారు. అక్కడికక్కడే నిందితులను పట్టుకోకపోతే వారు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ధర్మాసనానికి తెలిపారు. అందుకే వారిని అక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే నేరానికి పాల్పడ్డారని కోర్టుకు విన్నవించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం... రెగ్యులర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకొని ఉంటే ఎప్పుడో ఇచ్చే వాళ్లమని వ్యాఖ్యానించింది. పిటిషనర్ వేసే బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. పిటిషనర్ రెగ్యులర్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ ఉందని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, సింగిల్ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సమర్థనీయం కాదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా పాటించాలని సూచించింది.
సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ ఎత్తివేత...
అనంతరం సిట్ విచారణను నిలిపివేయాలని, సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణపై దాఖలైన మరో పిటిషన్ ద్విసభ్య ధర్మాసనం విచారించింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సింగిల్ బెంచ్ పక్కన పెట్టడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ అంశంపై రెండు పిటిషన్లు దాఖలయ్యాయని, రెండు కేసు పారదర్శకంగా సాగేలా సీబీఐ, సిట్టింగ్ జడ్జితో వేసిన సిట్ అండర్లో దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఒకటి పిటిషనర్ వేస్తే, మరొకటి రాజకీయ పార్టీ వేసిందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. తొలుత 29 అక్టోబర్న సింగిల్ జడ్జి దర్యాప్తు పై స్టే విధించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, హైకోర్టు స్టే ఇచ్చేందుకు తమకు అధికారం లేదని తేల్చి చెప్పిన తరువాత రాజకీయ పార్టీ తమ వాదనలు వినిపించిందని వివరించారు.
జస్టిస్ బి ఆర్ గవాయి జోక్యం చేసుకుంటూ... 'మెటిరియల్స్ నేరుగా ఎలా పంపిస్తారని అగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధ హౌదాలో ఉన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది ఇది పూర్తిగా తప్పు అని అంగీకరించారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను ఎత్తివేసిన ధర్మాసనం, సిట్ విచారణ కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. సిట్ విచారణ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ, సమయం అంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది. సీల్డ్ కవర్లో నివేదికలు ఇవ్వాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆంక్షలన్నీ ఎత్తివేసింది. దీంతో పాటు సింగిల్ జడ్జి వద్ద పెండింగ్ ఉన్న అన్ని పిటిషన్లను నాలుగు వారాల్లో పరిష్కరించాలని ఆదేశించింది.