Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసలు ఉద్దేశాల్ని మరిచిన డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటక్షన్ బిల్లు
- పౌరుల గోప్యతకు తూట్లు పొడిచేలా ప్రతిపాదనలు : ఐఎఫ్ఎఫ్
న్యూఢిల్లీ : కేంద్రం సిద్ధం చేసిన 'డిజిటల్ డాటా ప్రొటక్షన్ బిల్లు-2022' (డీపీడీపీబీ) లోని అంశాలపై 'ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్' (ఐఎఫ్ఎఫ్) అసంతృప్తి వ్యక్తం చేసింది. ముసాయిదా బిల్లులోని మొదటి భాగంలోనే బిల్లు అసలు ఉద్దేశాన్ని బలహీనం చేసే అంశాలున్నాయని, బలంలేని..అధికారాలు లేని చట్టాన్ని రూపొందించారని ఇండియన్ డిజిటల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్, ఐఎఫ్ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్తగా రూపొందించిన ముసాయిదా బిల్లు..డీపీడీపీబీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలకు అనేక మినహాయింపులు ఉన్నాయని, వీటిని కారణంగా చూపి పౌరుల వ్యక్తిగత గోప్యతను ఉల్లఘించటం చట్టబద్ధమేననే విధంగా బిల్లును కేంద్రం రూపొందించింది. చట్టంలో పేర్కొన్న మినహాయింపుల కారణంగా గోప్యతా హక్కు ఉల్లంఘనలు పెరుగుతాయని ఐఎఫ్ఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. డీపీడీపీ బిల్లు-2022కు సంబంధించి 24 పేజీల ముసాయిదా ప్రతులను కేంద్రం ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై పౌరులు, వివిధ సంఘాల నుండి ఫిర్యాదులు, సూచనలు తీసుకుంటామని కేంద్రం పేర్కొన్నది.
డిజిటల్ వేదికలపై పౌరుల గోప్యతకు భంగం వాటిల్లేలా ఎవరైనా వ్యవహరిస్తే భారీ జరిమానాలు విధించాలని బిల్లులో తెలిపారు. అయితే దీనికి అనేక మినహాయింపులు కూడా ప్రస్తావించారు. ముసాయిదా బిల్లుపై న్యాయ నిపుణులు, హక్కుల కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. అస్పష్టమైన, మార్గ నిర్దేశం లేని అధికారాలు ఉన్నాయని, పౌరుల గోప్యతను రక్షించాల్సిన బిల్లు..దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వాలకు అనేక అధికారాలు దఖలుపడేలా చేసిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి ప్రభుత్వ వ్యవస్థలను చట్ట పరిధి నుంచి తప్పించారు. డాటా ప్రొటక్షన్ బోర్డ్‌ను 'టూత్‌లెస్' అని పౌర హక్కుల కార్యకర్త మిషి చౌదరి పేర్కొన్నారు. బోర్డ్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం విచక్షణమేరకు ఉంటుంది. సభ్యుల ఎంపిక, కూర్పు, నియామకం, సేవా నిబంధనలు, షరతులు, సభ్యుల తొలగింపు..అంతా కేంద్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. బోర్డ్ స్వయం ప్రతిపత్తి, పనితీరు కేంద్రం కనుసన్నుల్లో సాగుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.