Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
- సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ . ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయిన అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి తీహార్ జైల్‌కు తరలించారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అరెస్టు చేసిన అర బిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, పెర్నాడో రికార్డ్ కంపెనీ ప్రతినిధి బినోరు బాబులను 11 రోజుల కస్టడీ అనంతరం సోమవారం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో జస్టిస్ ఎంకె నాగ్‌పాల్ ముందు ఈడి అధికారులు హాజరు పరిచారు. వారిద్దరికీ జ్యుడిషియల్ రిమాండు విధించాలని ఈడి తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అనారోగ్యం దృష్ట్యా ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని శరత్ చంద్రారెడ్డి, బినోరుబాబుల తరపు న్యాయవాదులు కోరారు. ఈ తరహా కేసులో ప్రత్యేక సదుపాయాలు కల్పించడం సాధ్యం కాదని న్యాయమూర్తి తెలిపారు. శరత్ చంద్రారెడ్డి తీవ్రమైన వెన్నునొప్పితో భాదపడుతున్నారని, ఇందుకు సంబంధించి రాంమనోహర్ లోహియా (ఆర్ఎల్ఎం) ఆసుప్రతిలో ఆయన తీసుకున్న సంబంధించిన పత్రాలను ఆయన తరపు న్యాయవాదులు ధర్మాసనానికి అందజేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఉన్ని దుస్తులు, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే, ఇంటి భోజనానికి, రెండు జతల చలి దుస్తులు, జైలు నిబం ధనలు అనుసరించి బూట్లకు అనుమతించారు. శరత్ చంద్రారెడ్డి వెన్ను నొప్పి తో బాధపడుతున్నారని ప్రత్యేక పడక సదుపాయం కల్పించాలన్న విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. వైద్యుల సలహా మేరకు తగిన వైద్యం అంద జేయాలని అధికారులకు సూచించారు. తదుపరి విచారణ డిసెంబరు 5కు వాయిదా వేశారు. బెయిలు పిటిషన్లపై ఈ నెల 24న విచారిస్తామని న్యాయ మూర్తి పేర్కొన్నారు. అనంతరం బినోరు బాబు, శరత్ చంద్రారెడ్డిల ను అధి కారులు తీహార్ జైలుకు తరలించారు. రౌస్ అవెన్యూ కోర్టు వద్ద సోమవారం శరత్ చంద్రారెడ్డిని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కలిశారు.