Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరీక్షల్లో పేపర్ లీక్‌లు
- నియామకాలు ఆలస్యం
- నష్టపోతున్న విద్యార్థులు,నిరుద్యోగులు
- గుజరాత్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
గాంధీనగర్ : గుజరాత్‌లోని బీజేపీ సర్కారు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. దీంతో ప్రభుత్వ విభాగాల్లో పలు పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం అక్కడి నిరుద్యోగులు, విద్యార్థులు ఏండ్లుగా ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడి పరీక్షలు జరిగినా.. అందులో లీక్ భయాలున్నాయి. బీజేపీ సర్కారు వైఫల్యం కారణంగా ఇలా పలు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు లీక్ గండాన్ని ఎదుర్కొని నిరుద్యోగులను నిండా ముంచాయి. వారి ఆశలను అడియాశలు చేశాయి. ఇక మరికొన్ని ఉద్యోగాలకు పరీక్షలు జరిగి ఫలితాలు వెలువడినా.. నియామకానికి ఆలస్యం జరిగిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ కొలువు సాధించాలనీ, కన్న తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని తాపత్రయ పడుతున్న విద్యార్థులు, నిరుద్యోగుల ఆకాంక్షలకు విరుద్ధంగా అక్కడి సర్కారు వ్యవహరించింది. దీంతో ఎందరో ఆశావాహులు తీవ్రంగా నష్టపోయారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిరుద్యోగులు, విద్యార్థులంతా ఓటు ఆయుధంతో బీజేపీకి సరైన బుద్ధి చెప్తామని తెలిపారు.
ప్రభుత్వ ఉదాసీనత కారణంగా ఎందరో అభ్యర్థులు తాము చదువుకున్న చదువుకు సంబంధంలేని ఉద్యోగాలను చేయాల్సిన దుస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. గుజరాత్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన హితేంద్ర చౌదరి పరిస్థితి ఇలాంటిదే. చౌదరీ ఒక క్రీడాకారుడు కూడా కావటంతో పోలీసు శాఖలో చేరాలని తహతహలాడాడు. ఇంతలో 2018న లోక్రక్షక్ దళ్ (గుజరాత్ పోలీసు కానిస్టేబుల్) కోసం 8.75 లక్షలకు పైగా ఖాళీలు ప్రకటించబడ్డాయి. నాలుగు నెలల అనంతరం ఈ పరీక్ష జరిగింది. అయితే, పరీక్షా పేపర్ లీక్ కావటంతో హితేంద్ర చౌదరీ లాంటి లక్షలాది మంది అభ్యర్థుల కలలు కల్లలయ్యాయి. దీంతో హితేంద్ర చౌదరీ ఆటో రిక్షా నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోవిడ్-19 తొలి దశలో హితేంద్ర తండ్రి ఆకస్మిక మరణం చెందటంతో ఆయనకు మరింత గుండె కోతను కలిగించింది. పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన హితేంద్ర లాంటి అభ్యర్థులందరి పరిస్థితితీ ఇలాగే తయారైంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవటంతోనే పరీక్ష పేపర్ లీక్ అయిందని అభ్యర్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఆ తర్వాత పరీక్షను 2019, జనవరి 6కు రీషెడ్యూల్ చేశారు. అయితే, హితేంద్ర కటాఫ్‌ను దాటలేకపోవటంతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాడు. ఇక ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను తదుపరి దశకు పిలవటంలోనూ తీవ్ర ఆలస్యం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఆధారంగా ఖాళీలను భర్తీ చేయకపోవటంతో చాలా మంది నష్టపోయారు. చివరగా 1578 ఖాళీలు మిగిలి ఉన్నాయి.
ఉపాధ్యాయ ఖాళీలు వేలల్లో..!
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 2017 నుంచి కనీసం 12000 విద్యా సహాయక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం అక్టోబరులో 2600 ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నిబంధనల ప్రకారం, ఏటా 3300 మంది తాత్కాలిక విద్యా సహాయక్లను నియమించాల్సి ఉంటుంది. వీరిని ఐదేండ్ల తర్వాత రెగ్యులరైజ్ చేస్తారు. అయితే, ప్రభుత్వం నిబంధనలను పాటించకపోవటంతో ఉద్యోగ ఖాళీలు వేల సంఖ్యలో ఏర్పడ్డాయి. విద్యా శాఖలోనే ఉపాధ్యాయ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉండటం అక్కడి ఉద్యోగ నియామక ప్రక్రియకు, స్కూళ్లపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని విశ్లేషకులు చెప్పారు.
లెక్చర్‌షిప్ కోసం ఏడేండ్ల నిరీక్షణ
రాష్ట్రంలో లెక్చర్ల నియామకానికి 2015లో నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి పరీక్షలూ జరిగాయి. అయితే, రాష్ట్రంలో ఎన్నికలు సమీపించటంతో 60 మందికి ఈనెలలో జాయినింగ్ లేఖలు రావటం మొదలయ్యాయి. ఇక కాంట్రాక్టు లెక్చరర్లను నియమించి రాష్ట్ర ప్రభుత్వం వారిని శ్రమ దోపిడికి గురి చేసింది. శాశ్వత లెక్చరర్ల నెలవారి జీతం రూ. 80వేల వరకు ఉంటుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక లెక్చరర్లకు నెలకు రూ. 25వేల మాత్రమే చెల్లిస్తూ లెక్చరర్ల నియామకాలను ఆలస్యం చేసింది. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్కారు కొలువుల విషయంలో విద్యార్థులు, నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందని పలువురు నిరుద్యోగులు ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు మోక్షం కలిగిందన్నారు. బీజేపీ సర్కారు తమకు చేసిన నష్టాన్ని మరిచిపోబోమని వారు చెప్పారు. ఇందుకు రాబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన సమాధానం చెప్తామని వివరించారు.