Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలి
- ఎస్పీఈ చట్టాన్ని పరిరక్షించాలి
- జంతర్ మంతర్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ధర్నా
- మోడీ సర్కార్ విధానాలతో ప్రభుత్వ రంగం కుదేలు : తపన్ సేన్
న్యూఢిల్లీ . ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశంలోని మెడికల్ రిప్రజెంటేటివ్స్ కందం తొక్కారు. సోమవారం నాడిక్కడ జంతర్‌మంతర్‌లో ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎంఆర్‌ఎఐ) ఆధ్వర్యంలో వేలాది మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. ప్లకార్డులతో చేబూని ''ఎస్పీఈ అమలు కోసం చట్టబద్ధమైన పని నియమాలు రూపొందించాలి. సేల్స్ ప్రమోషన్స్ సర్వీస్ కండీషన్ (ఎస్పీఈ) చట్టం-1976ను పరిరక్షించాలి. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను ఉపసంహరించుకోవాలి. మందుల ధరలు తగ్గించాలి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడికల్ డివైజ్‌లపై జిఎస్టి మినహాయించాలి. ప్రభుత్వ రంగ ఔషధాల పునరుద్ధరించాలి. యజమానుల వేధింపులు ఆపాలి'' అని డిమాండ్ చేస్తూ నినాదాల హౌరెత్తించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ అధ్యక్షుడు రమేష్ సుందర్ అధ్యక్షతన జరిగిన ప్రదర్శనలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాలతో ప్రభుత్వ రంగం కుదేలవుతోందని విమర్శించారు. కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను మోడీ సర్కార్ వేగవంతం చేసిందని దుయ్యబట్టారు. దేశంలో ఒకపక్క నిరుద్యోగం పెరుగుతుంటే, మరోపక్క ప్రభుత్వం రంగ సంస్థలను మోడీ సర్కార్ ప్రయివేటీకరణ చేస్తోందని ధ్వజమెత్తారు. కార్పొరేట్లకు దేశ సంపదను ధారదత్తం చేయడమే కాకుండా, మరోవైపు లక్షల కోట్లు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. సిఐటియు ఉపాధ్యక్షులు జెఎస్ మజుందర్ మాట్లాడుతూ లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కుల హననం అవుతాయని, ప్రధానంగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ హక్కులు కాలరాయబడతాయని పేర్కొన్నారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధతం చేయాలని పిలుపు ఇచ్చారు. సీఐటీయూ కార్యదర్శి అమితవ గుహ మాట్లాడుతూ కార్మిక సంక్షేమాన్ని మోడీ సర్కార్ విస్మరిస్తోందని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎఫ్‌ఎంఆర్‌ఎఐ ప్రధాన కార్యదర్శి శాంతను ఛటర్జీ మాట్లాడుతూ ఉత్పత్తి వ్యయం ప్రాతిపదికన ఔషధాల ధరలను మార్చి కంపెనీలకు లాభాలు వచ్చేలా కేంద్రం ధరల విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. మందులపై 18 శాతం వరకు అధిక జీఎస్టీ విధించారని దుయ్యబట్టారు. నిత్యావసర ఔషధాల ధరలు ఏటా పది శాతం పెరుగుతున్నాయని, కార్పొరేట్లు, కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఎంఆర్‌ఎఐ ఉపాధ్యక్షుడు కెఎం. సురేంద్రన్, కార్యదర్శి ఎంఎం హనీఫా తదితరులు మాట్లాడుతూ శీతాకాల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్వహించే పార్లమెంట్ మార్చ్‌లో ఫెడరేషన్ కూడా పాల్గొంటుందని ప్రకటించారు. తెలంగాణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాను కిరణ్, ఐ.రాజుభట్, నేతలు దుర్గప్రసాద్, నాగేశ్వరావు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దక్షిణామూర్తి, యువి కృష్ణయ్య, నేతలు కామేశ్వరరావు, కుమార్, డి.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ మార్చ్ అనంతరం ఎఫ్‌ఎంఆర్‌ఎఐ ప్రతినిధి బృందం కేంద్ర కార్మిక శాఖ అదనపు కార్యదర్శి శశాంక్ గోయల్‌ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.