Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోషకాహార లోపాన్ని పెంచిన 'గుజరాత్ మోడల్'
- వందమంది పిల్లల్లో ఆరుగురికి మాత్రమే పౌష్టికాహారం..
- పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పేదరికమే ప్రధాన కారణం : ఆరోగ్య నిపుణులు
- 1995 నుంచి అధికారంలో ఉన్నా పట్టించుకోని బీజేపీ సర్కార్
న్యూఢిల్లీ: పిల్లల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించటంలో గుజరాత్ ట్రాక్ రికార్డ్ అత్యంత దయనీయంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. 5ఏండ్ల లోపు బాలబాలికల్లో 40శాతం మంది పోషకాహర సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి బలవర్ధకమైన ఆహారం అందుబాటులో లేకపోవటమే. అణగారిన వర్గాలు, గిరిజన కుటుంబాలకు సరైన ఆదాయ వనరులు లేవని, దీనివల్ల ఆ కుటుంబాల్లోని మహిళలు, పిల్లల్లో రక్తహీనత ఎక్కువగా నమోదవుతోందని ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తలు ఎప్పట్నుంచో చెబుతున్నారు. అయినప్పటికీ 1995 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ సమస్యపై గట్టిగా దృష్టి సారించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విషయం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఐదేండ్లలోపు బాలల్లో పోషకాహార సమస్య తీవ్రంగా ఉన్న రాష్ట్రంగా గుజరాత్ ముందుభాగంలో నిలుస్తోందని ప్రతిపక్షాల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. 2019-20లో విడుదలైన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే ఐదవ రౌండ్ ఫలితాల ప్రకారం, అన్ని కేటగిరిల్లో గుజరాత్ చాలా వెనుకబడి ఉంది.
అహ్మదాబాద్, సూరత్, వడోదర, దాహోద్, బన్సాకాంత, సూరత్, పంచ్ మహల్..తదితర జిల్లాల్లో పోషకాహార లోపం తీవ్రస్థాయికి చేరుకుందని 'నిటి ఆయోగ్' హెచ్చరించింది. 'గుజరాత్ మోడల్' పిల్లలకు అవసరమైన పోషకాహారాన్ని అందించ లేకపోయిందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అణగారిన వర్గాలు, గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాల్లో పేదరికం ఎక్కువగా ఉందని, తగిన ఆదాయం లేనందువల్లే తల్లి, బిడ్డలో పోషకాహార సమస్య తలెత్తుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంగన్వాడీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించకపోవటం, నిధులు విడుదల చేయకపోవటమూ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
జాతీయ సగటు కన్నా ఎక్కువ
6-23 నెలల వయసున్న బాలల్లో పౌష్టికాహారం పొందుతున్నవారు..జాతీయ సగటు 11.3శాతం కాగా, గుజరాత్లో 5.9శాతం నమోదైంది. అంటే వందమందికి 6గురు చిన్నారులు మాత్రమే పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. దీంతో రాష్ట్రంలోని చిన్నారుల్లో పోషకాహార సమస్య తీవ్రరూపం దాల్చింది. వయస్సుకు తగిన ఎత్తు లేకపోవటం అనేది భారత్లో 35.5శాతం కాగా, గుజరాత్లో 40శాతానికి చేరుకుంది. అలాగే ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు భారత్లో 19.3శాతం కాగా, గుజరాత్లో 25.1శాతం నమోదైంది. తక్కువ బరువున్న పిల్లలు జాతీయ సగటు 32.1శాతం కాగా, గుజరాత్లో 39.7శాతముంది. అత్యంత పేద రాష్ట్రాలతో పోల్చి చూసినా..గుజరాత్ నమోదు చేసిన గణాంకాలు చాలా దారుణంగా ఉన్నాయని సామాజిక కార్యకర్తలు అనేకమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా గుజరాత్లోని పాలకులు ఈ సమస్యను పరిష్కరించటంలో విఫలమవుతున్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వమని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నాయకులు, రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు పౌష్టికాహారాన్ని అందించలేక పోతున్నారని ఆరోపణలున్నాయి.
27 ఏండ్లుగా ఇదే పరిస్థితి
గజరాత్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని ప్రధాని మోడీ అనేకమార్లు కొట్టిపారేశారు. 27ఏండ్లుగా బీజేపీ పాలకుల తీరుతోనే పోషకాహార సమస్య ఈస్థాయికి చేరుకుందని, 'గుజరాత్ మోడల్' వల్లే పరిస్థితి దయనీయంగా మారిందని మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు గుజరాత్లో ఎక్కువగా ఉన్నారని 'జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5' గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 5ఏండ్లలోపు పిల్లల్లో దాదాపు 80శాతం మందిలో రక్తహీనత ఉందని సర్వే తేల్చింది. జాతీయ సగటు 67శాతం కన్నా ఇది చాలా ఎక్కువ. గర్భిణుల్లో రక్తహీనత విషయానికికొస్తే జాతీయ సగటు 52శాతం కాగా, గుజరాత్లో 63శాతం నమోదైంది.