Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి సీజన్లోనూ సమస్యలు
- బాధ్యతను విస్మరిస్తున్న ప్రభుత్వాలు
- మౌలిక సదుపాయాలకు దూరమవుతున్న నగరాలు
న్యూఢిల్లీ : భారత్లోని పట్టణ ప్రాంత పరిస్థితులపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంతాల పరిస్థితులు అసమగ్రంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి కొన్ని సంవత్సరాలకు నగరాలు అంతరించిపోతున్న పరిస్థితులు వారు గుర్తు చేశారు. ఇది దేశభవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తుందన్నారు. చలికాలంలో కాలుష్యం, వేసవిలో నీటి కొరత, వర్షకాలంలో వరదలు వంటి ప్రమాదకర పరిస్థితులను పట్టణ భారతం చూస్తున్నదని నిపుణులు చెప్పారు. ఇలా ప్రతి సీజన్లోనూ ఒక సంక్షోభంతో దేశంలోని పట్టణాలు కష్టాల కడలిని ఈదుతున్నాయని వివరించారు.
పట్టణాలు ఎదుర్కొంటున్న ఇలాంటి కష్టాలకు కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణమని నిపుణులు చెప్పారు. భారీ వర్షాలతో పాటు ఇతర ప్రకృతి వైపరీత్యాలు ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రథమశ్రేణి నగరాలు.. పూణే, నాగ్పూర్, విశాఖపట్టణం, మైసూరు, కోయంబత్తూరు వంటి ద్వితీయశ్రేణి నగరాలను, పట్టణాలను కోలుకోని దెబ్బతీసిన పరిస్థితులను వారు గుర్తు చేశారు. ప్రభుత్వాలు గతానుభవాల నుంచి పాఠాలు నేర్వకపోవటంతో విపత్కర పరిస్థితులు విపరీత పరిణామాలకు దారి తీస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా, కేంద్రం స్మార్ట్ సిటీ అంటూ ప్రచారాలతో ఊదరగొడుతున్నప్పటికీ ఈ పథకం కింద ఎంపికైన నగరాలూ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
నగరాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు మళ్లీ ఏర్పడకుండా పరిష్కార మార్గాన్ని కనిపెట్టాల్సిన ప్రభుత్వాలు.. బాధ్యతను విస్మరిస్తున్నాయి. కఠిన పరిస్థితులకు తాము కారణం కాదన్న విధంగా వ్యవహరిస్తున్నాయి. ఉదాహరణకు, దేశ రాజధాని ప్రాంతంలో వాయుకాలుష్యానికి వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టటమే కారణమనీ రైతులపై నెపం నెట్టివేయబడింది. అలాగే, పూణే, ముంబయిలో పాక్షిక కరువు కారణంగా తాగునీటికి కొరత ఏర్పడింది. అయితే, ఇక్కడ వలసదారుల సంఖ్య పెరగటాన్ని కారణంగా చూపారు పాలకులు. ఐటీకి కేంద్రమైన బెంగళూరులో ఇటీవల వరదలకు 'తీవ్ర వాతావరణ సంఘ టనలు' కారణాలుగా వర్ణించబడటం గమనించాల్సిన అంశం.
భారత్లోని పరిస్థితులపై పలు అంతర్జాతీయ నివేదికలు కొన్ని సలహాలను ఇస్తున్నాయి. 78 పేజీలతో ప్రపంచ బ్యాంకు ఒక నివేదికను విడుదల చేసింది. నానాటికీ పెరుగుతున్న దేశ జనాభాను దృష్టిలో ఉంచు కొని భారత్ తన అవసరాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వచ్చే 15 ఏండ్లలో రూ. 68 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని సదరు నివేదిక పేర్కొన్నది. అంటే ఏడాదికి రూ. 4.48 లక్షల కోట్లకు పైగా అన్నమాట. పట్టణాభివృద్ధికి అధిక కేటాయింపులు అవసర మనటంలో ఎలాంటి వివాదమూ లేదని నిపుణులు చెప్పారు. అయితే, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు వ్యవహార శైలి సమస్యకు కారణమవుతున్నదన్నారు.
పట్టణీకరణ, దానికనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉన్నదని నిపుణులు చెప్పారు. భారత రాజ్యాంగంలోని 74వ సవరణ ప్రకారం రాష్ట్రాలకు కేంద్రం, స్థానిక సంస్థలకు రాష్ట్రాలు నిధులు, విధులను బదిలీ చేయటానికి హామీనిచ్చింది. అయితే, ఈ విషయంలో 'రాజకీయాలు' ప్రవేశించటంతో పట్టణాభివృద్ధి కుంటుపడుతున్నదని నిపుణులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా, నగరపాలక సంస్థలకు ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు (కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు) డబ్బును ఎలా ఖర్చు చేస్తారో అన్నదానిపై స్పష్టత ఉండదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో వంద 'స్మార్ట్' నగరాల ఏర్పాటు కోసం ఏడేండ్లలో రూ. 30,751.41 కోట్ల కేటాయింపులు జరగాయి. అయితే, ఖర్చు జరిగింది మాత్రం రూ. 27,610.34 కోట్లు కావటం గమనార్హం. రూ.1.90 లక్షల కోట్ల విలువైన 7822 ప్రాజెక్టుల్లో ఈ నగరాలు కేవల్ 66,712 కోట్ల విలువైన 4085 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. ఇక దేశంలోనే అతిపెద్ద బృహాన్ ముంబయి కార్పొరేషన్ కు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? వాటిని ఎలా ఖర్చుచేస్తున్నారన్న విషయంపై 227 మంది కార్పొరేటర్లకు తెలియదంటే నమ్ముతారా..కానీ ఇది నిజం. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అయినా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అయినా.. ఇటు గ్రామీణ భారతాన్ని, అటు పట్టణ భారతాన్ని గాలికొదిలేశాయని నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.