Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ గవర్నర్ వైఖరితో ఉన్నత విద్యా రంగంలో సంక్షోభం
- మీడియా ఇంటర్వ్యూలో కేరళ న్యాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు
తిరువనంతపురం : అసెంబ్లీలు ఆమోదించిన చట్టం లేదా రాజ్యాంగంలో పేర్కొన్న రాష్ట్రాల జాబితాలో 'సబార్డినేట్ లెజిస్లేషన్' లేదా కేంద్ర చట్ట నిబంధనలను ప్రవేశపెట్టి అమలు చేయవచ్చా లేదా అనే రాజ్యాంగపరమైన ప్రశ్నపై న్యాయవాదులను కేరళ ప్రభుత్వం సంప్రదిస్తోంది. రాష్ట్రంలోని 11 వైస్ ఛాన్సలర్లకు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నోటీసులు ఇచ్చిన తర్వాత తలెత్తిన ప్రస్తుత వివాదాలు కేవలం కేరళకే పరిమితం కాదని కేరళ న్యాయ శాఖ మంత్రి పి.రాజీవి మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు. మొత్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలనే నియంత్రించేందుకు కేంద్రానికి విస్తృత ఉద్దేశ్యం వుందని ఆయన భావిస్తున్నారు.
అసలు ఈ విశ్వవిద్యాలయాలపై చెలరేగిన వివాదానికి నేపథ్యం ఏమిటని చూసినట్లైతే, కేరళ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లందరినీ తొలగించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవడంతో సహా ఇటీవల జరిగిన పరిణామాలతో కేంద్ర రాష్ట్ర శాసన సామర్ధ్యాలకు సంబంధించి పలు అంశాలు తలెత్తాయి. యుజిసి చట్టం, 1956కి గల ప్రాముఖ్యత, ప్రతీసారీ యుజిసి జారీ చేసే మార్గదర్శకాల గురించి కూడా వివాదం తలెత్తింది.
రాజ్యాంగంలో సెక్షన్ 66 (ముసాయిదా రాజ్యాంగంలోని 57ఎ)ను ప్రవేశపెడుతూ డాక్టర్ అంబేద్కర్, ప్రతిపాదిత 57ఎ, కేంద్రానికి కొంతపరిమితి మేరకు పరిశోధనా సంస్థలను సమన్వయం చేసే అధికారాలను ఇవ్వాలని ప్రతిపాదిస్తోందని పేర్కొన్నారు. ఆ పరిశోధనా సంస్థల్లోని ప్రమాణాలు దిగజారకుండా చూడాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై వుందన్నారు. ఉమ్మడి ప్రమాణాలను నెలకొల్పడం గురించి కూడా ఆయన మాట్లాడారు. కాగా, కేంద్రం నుండి నిధులు పొందాలంటే రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు నిర్దిష్ట ప్రామాణికాలను పాటించాల్సి వుందని 1990ల్లో సుప్రీంకోర్టు వివరించింది. కానీ ఈనాడు, యుజిసి, కేంద్రం, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఆర్థిక సాయాన్ని తగ్గించేయడంతో పాటూ మరోవైపు ఆ విశ్వవిద్యాలయాలపై పాలనాపరమైన, విద్యా సంబంధమైన నియంత్రణను కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కేరళ టెక్నికల్ యూనివర్శిటీకి వైస్ ఛాన్సలర్ నియమించే విషయంపై ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యం, ఆ తర్వాత వరుసగా కేరళలో జరుగుతూ వచ్చిన పరిణామాలతో ఈ ప్రశ్న చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజ్యాంగ సవరణ చేసి మరీ విద్యను ఉమ్మడి జాబితాలో పెట్టారు. కానీ విశ్వవిద్యాలయాల విలీనం, నియంత్రణ అనేది రాష్ట్ర జాబితాలోనే వుంచారు. దేశంలో జాతీయ ప్రాధాన్యత కలిగిన విశ్వవిద్యాలయాలు కొన్ని వున్నాయి. వాటి నిర్వహణా బాధ్యత కేంద్రానిదే, ఇతర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మాత్రం రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
ప్రస్తుత తరుణంలో కేరళ ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి చర్య గురించి ప్రశ్నించగా, ఇది ఒక్క కేరళకి సంబంధించిన అంశం కాదని, మొత్తంగా జాతీయాంశమని మంత్రి రాజీవి అన్నారు. ఈ సమస్యను ఉన్నత న్యాయ వ్యవస్థ రాజ్యాంగ సమస్యగా చూడాలన్నారు. చట్టాలు చేయడమనేది అసెంబ్లీకి గల కీలకమైన విధి. దాన్ని ప్రభుత్వానికి వదిలివేయరాదని అన్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన కొన్ని తీర్పులకు ఇస్తున్న భాష్యాలు కేవలం విశ్వవిద్యాలయాలనే కాదు, రాష్ట్రాల పరిధిలోని అనేక అంశాలను కేంద్రం లాక్కోవడానికి దారి తీయగలవన్నారు. శాసన ఉద్దేశ్యం ఇక్కడ ముఖ్యమైనదని, దాన్ని అర్ధం చేసుకోవడం ద్వారా ఉన్నత న్యాయస్థానాలు కూడా ఈ సమస్యలను పరిష్కరించాలని తాను భావిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.
రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఐక్య కార్యాచరణతో అన్ని రాష్ట్రాలు కలిసి ఒకతాటిపైకి రావాలన్నారు. సమాఖ్యవాదం సవాలుకు గురయ్యే పరిస్థితికి దేశాన్ని తీసుకెళ్లరాదని అన్నారు. రాష్ట్రాల పరిధిలో వున్న అంశాలన్నింటితో సహా అన్నింటిపై పాలనాపరమైన నియంత్రణను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా లాక్కోవడానికి కేంద్రం చూస్తోందన్నారు. ఇది చాలా విస్తృతమైన సమస్యగా వుందన్నారు. సుప్రీం కోర్టులో కూడా తాము దీన్ని లేవనెత్తుతామన్నారు. ఇది, రాష్ట్రాల హక్కులపై దాడిచేయడమేనని అన్నారు.
అయితే యుజిసి చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది కదా, అప్పుడు విశ్వవిద్యాలయాల పనితీరులో కేంద్రం జోక్యం చేసుకోగలదా అని ప్రశ్నించగా, రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం చట్టం చేసేందుకు పార్లమెంట్‌కు శాసనపరమైన సామర్ధ్యం లేదని ఎట్టకేలకు పార్లమెంట్లో నిర్ణయించారని మంత్రి తెలిపారు. అయితే, జాతీయ ప్రాధాన్యత కలిగిన విశ్వవిద్యాలయమైతే అప్పుడు పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించవచ్చని అన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా వుండగా జరిగిన అనుభవాన్ని ఆయన వివరించారు.
రాష్ట్రాల చట్టాల కంటే యుజిసి మార్గదర్శకాలు ప్రబలమైనవని, అందువల్ల యుజిసి నిబంధనలను రాష్ట్ర విశ్వవిద్యాలయాలు తప్పనిసరిగా అమలు చేయాలని గంభీర్ధన్ కె.గాదవి కేసు (2022)లో సుప్రీంకోర్టు ప్రకటించింది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన అంశమేమంటే, అంతకుముందు ఇదే కోర్టు భిన్నమైన వైఖరి తీసుకుంది. 2015లో కల్యాణి మాథవనన్ కేసులో సుప్రీం కోర్టు, కేంద్ర విశ్వవిద్యాలయాలకు యుజిసి నిబంధనలు తప్పనిసరని, రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు డైరెక్టరీ వంటివని పేర్కొంది.
గతంలో తాను తీసుకున్న వైఖరులకు పూర్తి భిన్నంగా, సుప్రీం కోర్టు ఇపుడు యుజిసి నిబంధననలు తప్పనిసరిగా అమలుపరచాలని ప్రకటించింది. ఈ భాష్యం, సమాఖ్యవాదంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తీర్పు ప్రకారం, ఉమ్మడి జాబితాలోకి వచ్చిన అంశాలపై రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన ఏ రాష్ట్ర చట్టాన్నైనా కేంద్ర ప్రభుత్వం రద్దుచేయవచ్చు లేదా సవరించవచ్చు.
ఈ తీర్పుకు భాష్యం చెప్పడం ద్వారా కేరళ ఛాన్సలర్ తీసుకున్న వైఖరి దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా రంగంలో సంక్షోభాన్ని సృష్టిస్తోంది. వాస్తవానికి ఈ కొత్త భాష్యం దేశ ఫెడరల్ వ్యవస్థలో కల్లోలాన్ని సృష్టించబోతోంది.