Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొలెరో, లారీ ఢకొని ఎనిమిది మంది దుర్మరణం
- మృతులంతా ఛత్తీస్గఢ్వాసులు
చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కొండగన్ జిల్లా నుంచి బొలెరో వాహనంలో పది మంది భద్రాచలం సీతారాముల దర్శనానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారి వాహనం, చింతూరు నుంచి భద్రాచలం వైపునకు ఐరన్ ఓర్ లోడుతో వెళ్తున్న లారీ... బొడ్డుగూడెం వద్ద ఎదురెదురుగా ఢకొీన్నాయి. దీంతో, బొలెరోలోని ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మనీషా ఠాకూర్ (18), పదం సింగ్ (45), దయానిష్, కార్తీక్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని తొలుత ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రికి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి మూడు అంబులెన్సుల్లో తరలించారు. పరిస్థితి విషమించి ఆస్పత్రిలో ఠాకూర్, పదం సింగ్ మృతి చెందారు. ఈ ప్రమాదంలో బొలెరోలో ఇరుక్కుపోయిన వారిని పోలీసులు గడ్డపారలతో డోర్లను పెకిలించి బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని చింతూరు ఎఎస్పి మహేశ్వర్రెడ్డి సందర్శించి సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. చింతూరు సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ క్షతగాత్రులను ఏడుగురాళ్లపల్లి ఆస్పత్రిలో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతుల్లో ఆరుగురి పేర్లు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మృతుల, తీవ్రంగా గాయపడిన వారి సెల్ఫోన్లు దెబ్బతినడంతో పోలీసులకు పెద్దగా వివరాలు లభించలేదు. వారి వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.