Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మహిళలు వినియోగించే శానిటరీ పాడ్స్‌లో హానికారకమైన రసాయన పదార్థాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఈ రసాయన పదార్థాలను అధికంగా వినియోగించడంతో మహిళల్లో దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలు కలిగే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది. 'రాప్డ్ ఇన్ సీక్రెసీ' పేరుతో ఓ ఎన్జీఓ సంస్థ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఇవి తీవ్రమైన, దీర్ఘకాలిక ఆరోగ్యపరమైన చిక్కులనూ కలిగిస్తాయని ఈ అధ్యయనం పేర్కొంది. సాధారణంగా విక్రయించే శానిటరీ ప్యాడ్లలో క్యాన్సర్ కారకాలు, పునరుత్పత్తి టాక్సిన్స్, ఎండోక్రైన్ డిస్రప్టర్స్, అలర్జీలు వంటి విష రసాయనాలు ఆరోగ్యానికి చాలా హానికరం. భారత్‌లో విక్రయించే పది శానిటరీ ప్యాడ్ బ్రాండ్లపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం, అన్ని నమూనాల్లోనూ థాలేట్స్, అస్థిర కర్బన సమ్మేళనాలు (వీఓసీ)లు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. థాలేట్లు వివిధ ప్లాస్టిక్ ఉత్పత్తుల ఉపరితలం మృదువుగా ఉండేందుకు వినియోగిస్తారు. శానిటరీ ప్యాడ్స్లలో వేర్వేరు పొరలను కలిపేందుకు, వాటి మన్నిక పెంచేందుకు ఉపయోగిస్తున్నట్టు అధ్యయనంలో తేలింది. వీటితో గర్భధారణ సంబంధిత సమస్యలు, పిండం పెరుగుదలలో సమస్యలు, ఇన్సులిన్ నిరోధకత, రక్తపోటు కలిగే అవకాశం అధికంగా ఉంది. మరో ఆందోళనకరమైన రసాయనం అస్థిర కర్బన సమ్మేళనం (వీఓసీ)లు. ఈ రసాయనం త్వరగా గాలిలో ఆవిరైపోతుంది. వీటిని అధికంగా పెయింట్స్, డియోడరెంట్స్, ఎయిర్ ప్రెషనర్స్, ఆటోమోటివ్ ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. శానిటరీ ప్యాడ్స్‌లో సువాసన కోసం వీటిని వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఇవి మెదడు పనితీరుపైప్రభావం చూపడం నుండి చర్మ సమస్యలు, రక్త హీనత, కాలేయం, మూత్రపిండాల సమస్యలు, అలసట, అపస్మారక స్థితి కలిగించవచ్చని నివేదిక పేర్కొంది.
భారత్‌లో సుమారు నలుగురిలో ముగ్గురు టీనేజ్ అమ్మాయిలు పీరియడ్స్ సమయంలో శానిటరీ ప్యాడ్లను వినియోగిస్తున్నారు. అలాగే 15 నుంచి 24 సంవత్సరాల వయస్సు ఉండే స్త్రీలలో 64 శాతం మంది శానిటరీ ప్యాడ్లను వినియోగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా శానిటరీ ఉత్పత్తులలో రసాయనాల ఉనికిని నియంత్రించే చట్టాలు సమర్థవంతంగా లేవు. ముఖ్యంగా భారత్‌లో ఈ రసాయన పదార్థాలను అడ్డుకునే చట్టాలు లేవు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) 1980 ప్రకారం.. ప్యాడ్ ఆకృతి, ఉపరితలం, పీల్చుకునే పదార్థాలను గుర్తించేందుకు ప్రాథమిక పరీక్షలను నిర్దేశిస్తోంది. వాటిలో వినియోగించే రసాయన పదార్థాలను పరీక్షించాల్సిన అవసరంలేదు.