Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ సగటు కంటే కనిష్టం..!
- కేరళ భేష్.. జాతీయ సగటు కంటే అధికం
- ఆర్బీఐ సమాచారం
న్యూఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాలలో గ్రామీణ భారతంలో వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇందులో తక్కువ కూలీల చెల్లింపులు ఒకటి. ముఖ్యంగా, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్, బీజేపీ పాలిత మరొక రాష్ట్రం మధ్యప్రదేశ్ (ఎంపీ) లలో రైతు కూలీలకు తక్కువ చెల్లింపులు జరుగుతున్నాయి. దీంతో అక్కడి రైతు కూలీలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయేతర కార్మికుల విషయంలోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, కేరళలో వ్యవసాయ, వ్యవసాయేతర కూలీలకు చెల్లింపులు చక్కగా జరుగుతున్నాయి. కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) జమ్మూకాశ్మీర్లు ఈ విషయంలో చక్కటి ప్రదర్శనను కనబర్చి అగ్రభాగాన నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీకరించిన సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
ఎంపీలో రూ. 217.. గుజరాత్లో రూ. 220
ఆర్బీఐ సమాచారం ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయి ఆదాయ స్థాయిలు తగ్గాయి. ఎంపీలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికుడు పొందే రోజువారీ కూలీ రూ. 217.8 మాత్రమే. అంటే, నెలకు(25 రోజులకు) దక్కేది దాదాపు రూ. 5,445 మాత్రమే కావటం గమనర్హాం. మరోపక్క, గుజరాత్లో ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి ఇది రూ. 220.30గా ఉన్నది. ఈ రెండు రాష్ట్రాల్లో జరిగే చెల్లింపులు జాతీయ సగటు రూ. 323.2 కంటే తక్కువే కావటం గమనార్హం. గుజరాత్లో ఒక వ్యవసాయ కార్మికుడు నెలలో 25 రోజులు పనిని పొందగలిగితే, ఆయనకు నెలకు దక్కేది దాదాపు రూ. 5,500 మాత్రమే. జాతీయ సగటు కంటే తక్కువ చెల్లింపులు జరిపే రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రం యూపీతో పాటు బీహార్, మహారాష్ట్ర లు ఉన్నాయి. యూపీలో వ్యవసాయ కార్మికునికి దక్కే రోజువారి కూలీ రూ. 270గా ఉన్నది. అలాగే, మహారాష్ట్రలో రూ. 284.2, ఒడిశాలో రూ. 269.5గా ఉన్నది.
అధిక చెల్లింపులతో కేరళ టాప్
గ్రామీణ వ్యవసాయ కూలీలకు చెల్లింపులు కేరళలలో చక్కగా ఉన్నాయి. దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడే అధిక కూలీ లభించటం గమనార్హం. ఈ రాష్ట్రంలో నెలలో 25 రోజుల పనిని పొందగలిగే రైతు కూలీకి నెలకు సగటున రూ. 18,170 దక్కుతున్నది. అంటే, రోజుకు దక్కేది రూ. 726.8 అన్నమాట. ఇది జాతీయ సగటుతో పోలిస్తే రెండు రెట్ల కంటే అధికం కావటం గమనించాల్సిన అంశం. కేరళలో జరుగుతున్న ఈ కూలీలు దేశంలో తక్కువ చెల్లింపులు జరిగే రాష్ట్రాల నుంచి వలస కార్మికులను ఆకర్షించడానికి ప్రధాన కారణంగా నిలిచింది. కేరళలో దాదాపు 25 లక్షల మంది వలస కార్మికులు ఉన్నట్టు అంచనా. అలాగే, జమ్మూకాశ్మీర్‌లో వ్యవసాయ కార్మికులకు దక్కే సగటు రోజువారి కూలీ రూ. 524.6 కాగా, హిమాచల్‌ప్రదేశ్ లో రూ. 457.6, తమిళనాడులో రూ. 445.6గా ఉన్నాయి.
వ్యవసాయేతర కార్మికులకు...
ఎంపీ, గుజరాత్‌లోని వ్యవసాయేతర కార్మికులూ తక్కువ చెల్లింపులను పొందుతున్నారు. ఒక మగ వ్యవసాయేతర కార్మికుడికి ఎంపీలో దక్కే సగటు కూలీ రూ. 230.3గా ఉంటే, గుజరాత్లో రూ. 252.5 గా మాత్రమే ఉన్నది. త్రిపురలో ఇది రూ. 250గా ఉన్నది. ఇవన్నీ జాతీయ సగటు రూ. 326.6 కంటే తక్కువ కావటం గమనార్హం. వ్యవసాయేతర కార్మికులకు చెల్లింపుల విషయంలోనూ కేరళ మరోసారి పై చేయి సాధించింది. ఇక్కడ ఒక వ్యక్తికి దక్కే రోజువారీ కూలీ రూ. 681.8గా ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో జమ్మూకాశ్మీర్ (రూ. 500.8), తమిళనాడు (రూ. 462.3), హర్యానా (రూ. 409.3) లు ఉన్నాయి.
నిర్మాణరంగ కార్మికులకు..
గ్రామీణ నిర్మాణరంగానికి సంబంధించి గ్రామాల్లో పురుషులకు జరిగే చెల్లింపుల్లోనూ గుజరాత్, ఎంపీ లు వెనకబడే ఉన్నాయి. జాతీయ సగటు రూ. 373.3 కంటే తక్కువగా ఉన్నాయి. గుజరాత్లో గ్రామీణ నిర్మాణరంగ కార్మికులకు దక్కే సగటు కూలీ రూ. 295.9 కాగా, ఎంపీలో రూ. 266.7, త్రిపురలో రూ. 250 మాత్రమే కావటం గమనార్హం. ఈ విషయంలో కేరళ మరోసారి ముందున్నది. ఇక్కర దక్కే రోజువారీ కూలీ రూ. 837.7గా ఉన్నది. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్ (రూ,519.8), తమిళనాడు (రూ. 478.6), హిమాచల్‌ప్రదేశ్ (రూ. 462.7) రాష్ట్రాలు ఉన్నాయి.
నలుగురైదుగురు సభ్యులుండే కుటుంబాన్ని నెట్టుకురావటానికి కూలీకి దక్కే కొద్దిపాటి మొత్తం ఏ మాత్రమూ సరిపోదని విశ్లేషకులు చెప్పారు. ద్రవ్యోల్బణం కారణంగా రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలు రైతు కూలీలు, వ్యవసాయేతర కార్మికులకు మరింత ఇబ్బందికర పరిస్థితులను ఏర్పర్చుతున్నాయని చెప్పారు. ఈ విషయంలో గుజరాత్, మధ్యప్రదేశ్, యూపీ, త్రిపుర వంటి రాష్ట్రాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని విశ్లేషకులు సూచించారు.