Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను ఎంపిక చేయాలి
- సీఈసీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ఎన్నికల కమిషనర్‌గా అరుణ్ గోయల్ నియామకం ఎలా జరుగుతోంది?
- ఆ నియామక ఫైల్ మాకు ఇవ్వండి : అత్యున్నత న్యాయస్థానం
న్యూఢిల్లీ : తప్పు చేస్తే ప్రధాన మంత్రిపై సైతం చర్యలు తీసుకునేంత సత్తా ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) దేశానికి అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయం పడింది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల ఎంపిక సరైనదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేంద్ర ఎన్నిక సంఘానికి సంబంధించి ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం నడుస్తున్న వ్యవస్థ సరికాదనీ, కొలీజియంలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ అరు రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రారు, జస్టిస్ సిటి రవి కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే ప్రధాని ఎన్నికల కమిషనర్ దేశానికి అవసరమని పేర్కొంది. 'ప్రధానికి వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చాయనుకుందాం. ఆ సమయంలో సీఈసీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సీఈసీ గనుక బలహీనంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోలేరు కదా' అని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. 'సీఈసీ ఉన్నత స్థానం రాజకీయ ప్రభావం నుంచి రక్షించబడాలి. స్వతంత్రంగా ఉండాలి. కానీ అలా జరగడం లేదు. ఇది పూర్తిగా వ్యవస్థ విచ్ఛిన్నం కాదా?' అని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణిని ధర్మాసనం ప్రశ్నించింది. మార్పులు అవసరమని కమిటీలు చెబుతున్నాయనీ, రాజకీయ నాయకులు కూడా అడుగుతున్నారనీ, కానీ ఏమీ జరగలేదని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల కమిషనర్ నియామకంలో అనుసరిస్తున్న యంత్రాంగాన్ని తమకు చూపాలని కేంద్రాన్ని కోరింది. కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలని రాజ్యాంగంలో ఉందనీ, ఇంతవరకు అదే అమలవుతోందని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు.
అరుణ్ గోయల్ నియామకం ఫైల్ దాఖలు చేయండి
రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అరుణ్ గోయల్‌ను ఎన్నికల కమిషనర్‌గా ఇటీవల నియమించిన ఫైల్‌ను సమర్పించాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నియామకాలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన మధ్యంతర దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నందున ఈ నియామకం ఎలా జరుగుతుందని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అలా చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని భావించిన ధర్మాసనం గురువారం ఫైల్ తీసుకురావాలని ఏజీని కోరింది. కేంద్రం తరపున ఏజీతో పాటు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ బల్బీర్ సింగ్ వాదించారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ ఆర్టికల్ 324 ప్రకారం చట్టం లేనందున మార్గదర్శకాలను రూపొందించాలని మాత్రమే కోర్టును కోరుతున్నామని అన్నారు. సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదిస్తూ ఒక చట్టం గురించి ఆలోచించారని, కానీ ఇంకా అమలులోకి రాకపోవడం న్యాయస్థానం జోక్యం అవసరమని వాదించారు. విచారణ నేడు (గురువారం) కూడా కొనసాగనుంది.