Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకించాలి
- పార్లమెంట్లో బిల్లును అడ్డుకుంటాం
- విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల ధర్నాలో ఎలమారం కరీం
- ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం
మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత నేల నుంచి నింగి వరకు అన్నీ ప్రయివేటీకరణ చేస్తున్నదని, కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచిపెడుతున్నదని సీఐటీయూ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ ఎలమారం కరీం విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్లు లూటీ చేస్తున్నారనీ, అందుకునుగుణంగా ప్రభుత్వం విధానాల రూపకల్పన చేస్తున్నదని ఆరోపించారు. దేశాన్ని లూటీ చేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. విద్యుత్ సవరణ బిల్లు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) ఆధ్వర్యంలో బుధవారం నాడిక్కడ జంతర్ మంతర్ వద్ద విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు పార్లమెంట్ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు కదంతొక్కారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని నినాదాలు హోరెత్తించారు.
న్యూఢిల్లీ : 'విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. ప్రయివేటీకరణ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. పవర్ కార్పొరేషన్ల ఏకీకరణ చేయాలి. కేరళలోని కేఎస్ఈబీ లిమిటెడ్, హిమాచల్‌లోని హెచ్పీఎస్ఈబీ లిమిటెడ్లానే అన్ని రాష్ట్రాల్లో ఎస్ఈబీ లిమిటెడ్‌ను పునరుద్ధరించాలి. విద్యుత్ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ పునరుద్ధరించాలి. తెలంగాణ, పంజాబ్‌లో చేసినట్టు అన్ని రాష్ట్రాల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి. రెగ్యులర్ పోస్టులపై రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయాలి. విద్యుత్తు ప్రాథమిక హక్కుగా ప్రకటించాలి' అని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్ చేశారు. పార్లమెంట్ మార్చ్‌లో ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా పవర్ డిప్లొమా ఇంజనీర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్, ఇండియన్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, వివిధ రాష్ట్రాలలోని అనేక ఇతర స్వతంత్ర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశంలోని విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లతో చర్చించకుండా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టారనీ, దీనికి వ్యతిరేకంగా 27 లక్షల విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తామన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. విద్యుత్ వినియోగదారుల, విద్యుత్ వ్యవస్థ ప్రయోజనాల కోసం అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని ఎన్సీసీఓఈఈఈ కోరింది.
ఈ సందర్భంగా ఎలమరం కరీం మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం 1948లో విద్యుత్ సరఫరా చట్టాన్ని తీసుకొచ్చారనీ, దీనివల్ల రెండు కోట్ల పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారనీ, అది తక్కువ ధరలతో వ్యవసాయ అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. దేశంలో ఐదు లక్షల గ్రామాల్లో 25 కోట్ల ఇండ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. 1991 తరువాత ప్రపంచీకరణ విధానాలను ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. అన్ని రంగాలను ప్రయివేటీకరిస్తున్నదనీ, అందులో భాగంగానే విద్యుత్ రంగాన్నీ ప్రయివేటీకరణ చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటి ప్రయివేటు శక్తుల చేతుల్లో పెడుతున్నారనీ, బహుళజాతి కంపెనీలకు ఊడిగం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రయివేటీకరణను వ్యతిరేకించిందనీ, 1998లో అధికారంలోకి వచ్చిన వాజ్‌పేరు ప్రభుత్వం 2003లో విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. విద్యుత్ బోర్డలపై భారాలు, విద్యుత్ రంగ ప్రయివేటీకరణ వంటి అంశాలు బిల్లులో ప్రతిపాదించారని తెలిపారు. అప్పుడు ఒరిస్సా, మహారాష్ట్రతో పాటు కొన్ని రాష్ట్రాలు విద్యుత్ ప్రయివేటీకరణ విధానాన్ని అమలు చేశాయనీ, ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతున్నదని అన్నారు. కానీ మెజార్టీ రాష్ట్రాల్లో విద్యుత్ ప్రభుత్వ రంగంలోనే ఉందనీ, కేరళలో విద్యుత్ బోర్డును ప్రభుత్వమే ఒక కంపెనీగా నిర్వహిస్తోందని తెలిపారు. 2019లో మళ్లీ ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును తీసుకొచ్చిందని, చాలా ప్రమాదకర అంశాలు అందులో ఇమిడి ఉన్నాయని అన్నారు. అందుకే అందరమీ ఐక్యంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిలబడాలని పిలుపు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ రంగ ప్రయివేటీకరణను అక్కడి ఉద్యోగులు, కార్మికులు, ఇంజనీర్లు పోరాడి తిప్పికొట్టారని గుర్తు చేశారు. ఇటీవల జమ్మూకాశ్మీర్, పుదుచ్చేరి, చండీగఢ్‌లో కేంద్ర ప్రభుత్వం అక్కడి విద్యుత్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని చూస్తే, కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు ఐక్యంగా పోరాడి విజయం సాధించారని తెలిపారు. గతంలో ఆయిల్, గ్యాస్ ధరలను కేంద్ర మంత్రివర్గం నిర్ణయించేదనీ, ఇప్పుడు అన్ని రంగాలను ప్రయివేటీకరణ చేయడం వల్ల ఆయిల్, గ్యాస్ ధరలను అంబానీ, అదానీలు నిర్ణయిస్తున్నారని విమర్శించారు. విద్యుత్‌నూ ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే, విద్యుత్ ధరలను వారే నిర్ణయిస్తారన్నారు. పార్లమెంట్లో తాము విద్యుత్ బిల్లును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ సవరణ బిల్లు అప్రజాస్వామికమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని అన్నారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లు రైతులకూ వ్యతిరేకమైనదనీ, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. ఎస్కేఎం ప్రధాన డిమాండ్లలో విద్యుత్ బిల్లు ఉపసంహరణ కూడా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, వైసీపీ రాజ్యసభ ఎంపి ఆర్. కష్ణయ్య, ఆప్ నేత గౌరవ్ మహేశ్వరీ, కోఆర్డినేషన్ కమిటీ నేతలు ప్రశాంత నంది చౌదరి, శైలేంద్ర దూబే, మోహన్ శర్మ, ఆర్కె త్రివేది, కుల్దీప్ కుమార్, పి.రత్నాకర్ రావు, అభిమన్యు ధంకర్, పద్మజిత్ సింగ్, కె.అశోక్ కుమార్, సమీర్ సిన్హా, ఆర్కె శర్మ, సద్రుద్దీన్ రాణా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్స్ సంఘాల నేతలు కె.ఈశ్వరావు, వి.గోవర్థన్, టి.రత్నాకర్, బీసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో ఎం. చెన్నకేశవులు మృతి
విద్యుత్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీకి వస్తున్న కడప జిల్లా, పొద్దుటూరు ఈఆర్ఓ సీనియర్ అసెస్టింట్ ఎం. చెన్నకేశవులు మార్గమధ్యలోనే గుండెపోటుతో మరణించారు. రాజస్థాన్‌లోని బయన రైల్వేస్టేషన్లో మృతదేహాన్ని దించారు. అక్కడ నుంచి ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.