Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ విచారణ అనంతరం కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్
న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచన మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చినట్లు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం నాడిక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో అంజన్ కుమార్ యాదవ్‌కు ఈడీ అధికారులు సుమారు మూడు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా యంగ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన విరాళాలు వ్యవహారంలో అంజన్ కుమార్ యాదవ్‌ను ఈడీ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి సూచన మేరకే విరాళం ఇచ్చిన విషయాన్ని ఈడీ అధికారులకు తెలియచేశామన్నారు. యంగ్ ఇండియా సంస్థ ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉందనే స్వచ్చందంగా విరాళాలు ఇచ్చానన్నారు. అంతేగాక నేషనల్ హెరాల్డ్ కేసులో కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈడీ కాంగ్రెస్ నేతలను విచారిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో అవసరం ఉంటే మళ్లీ విచారణకు పిలుస్తామని అధికారులు చెప్పారని ఆయన తెలిపారు.