Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు ఏపి హైకోర్టు నుంచి ఇద్దరు
- సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అధ్యక్షతన ఈనెల 24న జరిగిన కొలీజియం మూడు హైకోర్టులకు చెందిన ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ముగ్గురు, మద్రాస్ హైకోర్టు నుంచి ఇద్దరు బదిలీ అయ్యారు. ఏపి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్ మద్రాసు హైకోర్టుకు, జస్టిస్ డి.రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కన్నెగంటి లలితను కర్నాటక హైకోర్టుకు, జస్టిస్ నాగార్జున్‌ను మద్రాసు హైకోర్టుకు, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ ఎంవి వేలుమణిని కలకత్తా హైకోర్టుకు, జస్టిస్ టి.రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేసింది. నవంబర్ 23న జరిగిన కొలీజియం సమావేశంలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు అనిల్ కుమార్ ఉప్మాన్, నుపుర్ భాటి, జ్యూడిషల్ ఆఫీసర్లు రాజేంద్ర ప్రకాష్ సోని, అశోక్ కుమార్ జైన్, యోగేంద్ర కుమార్ పురోహిత్, భువన్ గోయల్, ప్రవీర్ భట్నాగర్, అశుతోష్ కుమార్‌ను నియమిస్తూ సిఫారసు చేసింది. ఛత్తీస్‌గఢ్ హైకోర్ట అడిషనల్ న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్ర కుమార్ వ్యాస్, జస్టిస్ నరేష్ కుమార్ చంద్రవంశీలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కొలీజియం సిఫారసు చేసింది.