Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బరిలో ఎర్రజెండా
- 17 మంది అభ్యర్థులను బరిలో నిలిపిన వామపక్ష కూటమి
- సమస్యలపై బీజేపీ, ఆప్‌లను ప్రశ్నిస్తూ ముందుకు
- నగర ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ
న్యూఢిల్లీ : మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికల్లో వామపక్ష కూటమి బరిలో దిగింది. ప్రత్యామ్నాయ రాజకీయాలే లక్ష్యంగా ఎర్రజెండా ముందుకు కదులుతున్నది. సమస్యలపై పాలక పార్టీలైన బీజేపీ, ఆప్‌లను ప్రశ్నిస్తూ ప్రజలలో ఆదరణ సంపాదిస్తున్నది. ఎంసీడీలో మొత్తం 250 సీట్లకు గానూ అన్ని పార్టీల నుంచి మొత్తం 1416 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 17 మంది అభ్యర్థులు ఐక్య వామపక్ష కూటమి నుంచి ఉన్నారు. ఇందులో సీపీఐ(ఎం) ఆరు సీట్లకు అభ్యర్థులను నిలిపింది. అలాగే, సీపీఐ మూడు సీట్లకకు, సీపీఐ-ఎంఎల్(లిబరేషన్) ఐదు వార్డులకు, ఫార్వర్డు బ్లాక్ మూడు సీట్లకు అభ్యర్థులను బరిలో ఉంచింది. ఎంసీడీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 4న జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరిగి అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
బలమైన ప్రతిపక్షం ఏర్పాటే లక్ష్యంగా
ఢిల్లీ ఎన్నికల కమిషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీ (ఆప్), కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ లు 250 మంది చొప్పున అభ్యర్థులను నిలబెట్టాయి. మరోపక్క, 439 మంది స్వతంత్ర అభ్యర్థులూ పోటీలో ఉన్నారు. అయితే, పోటీ తీవ్రంగా ఉన్నప్పటీ, ఎన్ని ఇబ్బందులెదురైనప్పటికీ.. తమ పనితీరు ఆధారంగా దేశ రాజధాని మునిసిపల్ ఎన్నికల్లో వామపక్ష కూటమి పోటీకి దిగుతున్నది. ఎన్నికల్లో ప్రజాసమస్యలను లేవనెత్తుతూ, ఎంసీడీలో బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయటమే లెఫ్ట్‌ఫ్రంట్ లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
సమస్యలను లేవనెత్తుతూ..
ప్రధాన పార్టీల మధ్య పోటీతో ఢిల్లీ మునిసిపల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రతి ఒక్క పార్టీ హామీలను గుప్పిస్తున్నాయి. అయితే, లెఫ్ట్ పార్టీలు మాత్రం సమస్యలే ప్రాతిపాదికగా ముందుకు కదులుతున్నాయి. ఇతర పార్టీలు పట్టించుకోని ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. బీజేపీ చేస్తున్న మత, బుల్డోజర్ రాజకీయాలను లెఫ్ట్‌ఫ్రంట్ లేవనె త్తుతున్నది. ఎంసీడీలో వీధివ్యాపారులు, పారిశుధ్య సిబ్బంది గురించి మాట్లాడుతున్నది.
'ఈ దుస్థితికి 15 ఏండ్ల బీజేపీ పాలనే కారణం'
గత ఎన్నికల్లో ఎంసీడీని కైవసం చేసుకున్న బీజేపీ మాత్రం కార్పొరేషన్లో తన పేలవ పనితీరుపై వస్తున్న ప్రశ్నలను పట్టించుకోవటం లేదు. గత 15 ఏండ్లుగా ఎంసీడీ లో ఆపార్టీ అధికారంలో ఉండటమే ఈ దుస్థితికి కారణమని ప్రతిపక్ష పార్టీల నాయకులు తెలిపారు. వీధివ్యాపారులు, బుల్డోజర్ రాజకీయాల గురించి మాట్లాడటానికి ఆప్ కూడా వెనకడుగు వేస్తుండటం గమనార్హం.
బీజేపీ మతరాజకీయాలను తిప్పికొడుతూ..
మతతత్వాన్ని ఆయుధంగా వాడుకొని రాజకీయాలు చేసే బీజేపీని లెఫ్ట్‌కూటమి ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలను చేస్తున్నది. ఆ మతతత్వాన్ని ఎన్నికల అంశంగా సీపీఐ(ఎం) తయారి చేయగలిగింది. అలాగే, ఢిల్లీ అల్లర్లకు ప్రభావితమైన ముస్తఫాబాద్ వార్డు నుంచి అభ్యర్థిని బరిలో నిలిపింది. బీజేపీ మత రాజకీయాలు, ఆప్ ద్వంద్వ రాజకీయ విధానాలకు ఈ సారి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని సీపీఐ(ఎం) నాయకులు తెలిపారు. ఢిల్లీ అల్లర్లు జరిగిన ప్రాంతంలో సీపీఐ(ఎం)కు పట్టు లేనప్పటికీ.. అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించి ఆర్థికంగా, న్యాయపరంగా పలు సహాయ, సహకారాలను ఆ పార్టీ అందించింది. పరిమిత బలంతోనే లెఫ్ట్ పార్టీలు జనాల్లో వెళ్తున్నాయి. ఢిల్లీ అలర్లు, బుల్డోజర్ రాజకీయాలు, కోవిడ్-19 మహమ్మారి కాలంలో కార్మికులు సహాయం అందించటం వంటివి ఇందులో ఉన్నాయి.
ప్రశ్నిస్తూ.. జనాల్లో ఆలోచన రేకెత్తిస్తూ..
దేశ రాజధాని కావటంతో ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో వామపక్షాలు మాత్రం పాలక పక్షాన్ని సమస్యలవారిగా ప్రశ్నిస్తూ.. ప్రజలలో ఆలోచన రేకెత్తించే విధంగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఢిల్లీ కార్పొరేషన్లో పారిశుధ్యం చాలా ప్రధానమైన సమ్యగా ఉన్నదని సీపీఐ(ఎంఎల్) ఢిల్లీ రాష్ట్ర కమిటీ నాయకులు శ్వేత అన్నారు. పారిశుధ్య కార్మికుల సమస్య కూడా అలాగే ఉన్నదనీ, వారికి చాలా నెలలుగా జీతాలు అందలేదని చెప్పారు. ఈ సమస్యను ఏ పార్టీ లేవనెత్తటం లేదనీ, అందుకే ఈ సారి లడో సరారు నుంచి స్వీపర్‌ను తమ అభ్యర్థిగా నిలబెట్టినట్టు శ్వేత చెప్పారు. మురికి వాడలలో నివసించే ప్రజలకు ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన పాలక బీజేపీ, ఆప్‌లు ఆ హామీని నెరవేర్చకపోగా.. బుల్డోజర్లను ఉపయోగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ దుష్పరిపాలనలో అవినీతి : సీపీఐ(ఎం)
కార్పొరేషన్లో 15 ఏండ్ల బీజేపీ పాలనలో దుష్పరిపాలన, అవినీతి చోటు చేసుకున్నదని సీపీఐ(ఎం) తెలిపింది. దీనికి సంబంధించిన ప్రశ్నలను లెఫ్ట్ లేవనెత్తుతున్నదని సీపీఐ(ఎం) ఢిల్లీ సెక్రెటేరియట్ సభ్యులు రాజీవ్ కున్వార్ అన్నారు. దేశంలోనే అధిక ఆదాయాన్ని గడించే కార్పొరేషన్‌గా ఉన్న ఢిల్లీలో ఉద్యోగులు, కార్మికులకు కనీసం జీతాలూ సరిగ్గా అందటం లేదని చెప్పారు. ఎంసీడీలో సంక్షేమ కార్యక్రమాలకు ఉద్దేశించిన నిధులను బీజేపీ పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించి అవినీతికి తెరలేపిందని రాజీవ్ ఆరోపించారు. ఉద్యోగులు పెన్షన్ డబ్బులు తప్పుడు ప్రదేశాల్లో ఖర్చు పెట్టారనీ, ఇది భారీ అవినీతిని సూచిస్తుందని తెలిపారు. బీజేపీ అవినీతి నగర ప్రాథమిక విద్యా మౌలికసదుపాయం, ఆరోగ్య సేవలను నాశనం చేసిందన్నారు. బీజేపీ, ఆప్ వంటి పార్టీలు ఎన్నికల్లో బరిలో నిలవటానికి అనేక వనరు లుంటాయనీ, అయితే, తమ లాంటి చిన్న పార్టీలకే చాల సమస్యలు ఎదురవుతాయని రాజీవ్ చెప్పారు. ఈ కారణంగానే తాము ఈ ఎన్నికల్లో చాలా మంది అభ్య ర్థులను నిలబెట్టలేకపోయామన్నారు. అభివృద్ధి విషయంలో చేసిన వాగ్దానాలను ఆప్ ప్రభుత్వం విస్మ రించిందన్నారు.