Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభిషేక్ బోయినపల్లికి జ్యుడిషియల్ రిమాండ్
తీహార్ జైల్‌కు తరలింపు
- 'మద్యం'కేసులో అభిషేక్, నాయర్‌లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ కస్టడీలో ఉన్న అభిషేక్ బోయినపల్లికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. మరో నిందితుడు విజయ్ నాయర్‌కు రెండు రోజుల ఈడీ కస్టడి పొడిగించింది. గురువారం వారిద్దరినీ ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకె నాగ్‌పాల్ ముందు హాజరుపర్చారు. అభిషేక్ బోయినపల్లికి డిసెంబరు 8 వరకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండు విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. విజయ్ నాయర్‌ను ఇంకా విచారించాల్సి ఉన్నదనీ, ఐదు రోజుల కస్టడీ పొడిగించాలని ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ కోరారు. రెండు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అంగీకరించారు. డేటా రికవరీ నిమిత్తం విజరు నాయర్ లాప్‌టాప్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామనీ, శుక్రవారం నివేదిక రానున్నదని ఈడీ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విచారణకు సహకరిస్తున్నామని విజయ్ నాయర్ తరఫు న్యాయవాది తెలిపారు.
పది రోజుల కస్టడీలో కొన్నిరోజుల పాటు అసలు విచారణే చేయలేదని పేర్కొన్నారు. అనంతరం విజయ్ నాయర్‌కు రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. అభిషేక్ బోయినపల్లిని అధికారులు తీహార్ జైలుకు తరలించారు.
'మద్యం'కేసులో నాయర్, అభిషేక్‌లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌లకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిలు సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం జస్టిస్ యోగేష్ ఖన్నా ధర్మాసనం విచారించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబరు5కు వాయిదా వేసింది. సీబీఐ కేసులో బెయిలు పొందిన వీరిద్దరూ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం విదితమే.
శరత్ చంద్రారెడ్డి, బినోరులకు ఇంటి ఆహారం నిరాకరణ
తీహార్ జైలులో జ్యుడిషియల్ రిమాండులో ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోరుబాబులకు ఇంటి ఆహారం అందించడానికి సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. వీరిద్దరి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎంకె నాగ్‌పాల్ నిబంధనల ప్రకారం ఇంటి ఆహారం అనుమతికి వీల్లేదన్నారు. వైద్యులు సూచన మేరకు అవసరమైతే జైలు నిబంధనల మేరకు అక్కడే వండి అందజేస్తారని పేర్కొన్నారు. వీరిద్దరికీ కొన్ని ఎంపిక చేసిన పుస్తకాలను అనుమతించింది.