Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు అదే స్కూలుకు అతని నామకరణం
- నాటి జ్ఞాపకాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
- పసితనంలో స్వాతంత్రోద్యమం నుంచి చనిపోయే వరకు విప్లవ నాయకుడుగా...
ఆయనే హరి కిషన్ సింగ్ సూర్జీత్... గ్రామీణ ప్రజా ఉద్యమాలకు మార్గదర్శి, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘానికి నిర్మాత : వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
న్యూఢిల్లీ : పసితనంలో జాతీయోద్యమ స్ఫూర్తితో ఉద్యమాల్లోకి దిగిన సూర్జీత్ ను స్కూలు యాజమాన్యం స్కూలు నుంచి బహిష్కరించిందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ తెలిపారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్ జిల్లా బండాల గ్రామంలో స్వాతంత్ర ఉద్యమ కాలంనాడే ఒక పాఠశాల ఉండేదని, అందులో హరి కిషన్ సింగ్ సూర్జీత్ విద్యాభ్యాసం చేశారని తెలిపారు. ఆ స్కూలును వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత బృందం, సీపీఐ(ఎం) నాయకులు సందర్శించారు. ఆ స్కూలు పరిసరాలను పరిశీలించిన వెంకట్ మాట్లాడుతూ జాతీయ ఉద్యమ కాలంలో బండాల స్కూల్లో చదువుకుంటున్న సూర్జీత్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటున్నారనే కారణంతో స్కూల్ నుంచి యాజమాన్యం బహిష్కరించిందని తెలిపారు. నేడు అదే స్కూలు ప్రధాన ద్వారానికి ఆయన పేరును నామకరణం చేసి ఆయన జ్ఞాపకాలన్నిటిని నేటి విద్యార్థి లోకానికి తెలియజేస్తున్నారనీ, సూర్జీత్ జ్ఞాపకాలని విద్యార్థుల్లో రగిలింపజేస్తున్నారని ఇది అత్యంత సంతోషకరమైన విషయమన్నారు.
జాతీయ ఉద్యమానికి ఊపిరిగా..
జాతీయ ఉద్యమ కాలంలో విద్యార్థులందరినీ ఉద్యమాలకు సమీకరించేందుకు ఆ స్కూల్లో ఉన్న స్కూల్ బెల్లును సూర్జీత్ వినియోగించేవారనీ, ఆయన జ్ఞాపకార్థం నేటికీ ఆ బెల్లును యధావిధిగా వినియోగిస్తున్నారని తెలిపారు. పసితనంలో స్వాతంత్ర పిపాసతో కదిలి.... జాతీయ ఉద్యమం ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చి, భగత్ సింగ్ స్ఫూర్తితో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, కమ్యూనిస్టు ఉద్యమాలతో కడవరకు కొనసాగారని, సీపీఐ(ఎం) అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారని తెలిపారు. ఏఐకేఎస్ కు సుదీర్ఘకాలం అధ్యక్షులుగా పని చేశారనీ, వ్యవసాయ కార్మికుల యొక్క డిమాండ్స్ ను గుర్తించి, వారికి ప్రత్యేక సంఘం అఖిల భారత స్థాయిలో ఉండాలని భావించి 1982లో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఏర్పడేందుకు ఆయన చొరవ చేశారని, చివరి వరకు ఆ సంఘం జాతీయ కమిటీలో వుండి ఆయన పని చేశారని తెలిపారు.
స్వాతంత్య్రమంటే సమానత్వం, సామాజిక న్యాయం, సమాన హక్కులకోసం ..
స్వాతంత్రం అంటే ఈ దేశాన్ని విదేశీయులు కాకుండా స్వదేశీయులు పాలించుకోవడం మాత్రమే కాదని, అందరికీ సమానత్వం, సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధిం చబడాలని ఆయన కోరుకున్నారని తెలిపారు. పంజాబ్ లో ఆయన నాయకత్వంలో అనేక భూ పోరాటాలు, కూలి పోరాటాలు జరిగాయని, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కావాలని...
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం కావాలని పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న దశలో పార్లమెంట్లో ఆయన ప్రయివేట్ బిల్లును పెట్టారని, పాలకులు అటువంటి బిల్లును నేటికీ చట్టం చేయకపోవడం విచారకరమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తి కారకులుగా వ్యవసాయ కార్మికులను పరిగణించాలని, ఎంతో విశ్లేషణాత్మకమైన అనేక గ్రంథాలను ఆయన రాసారని తెలిపారు. విద్యార్థి దశలో సూర్జిత్ యొక్క పోరాట పటిమను ఆనాటి నాయకత్వం ప్రశంసించిందని తెలిపారు. భగత్ సింగ్ మొదటి వర్ధంతిని జరపాలని జాతీయ ఉద్యమం పిలుపునిస్తే దానిని అమలు జరిపిన మొదటి వ్యక్తిగా సూర్జిత్ చరిత్రపుటల్లో నిలుస్తారని తెలిపారు.
సూర్జీత్ చదివిన చదువులమ్మ ఒడిలో...
బండాల స్కూలులోనే చదువుకొని గుర్తింపు పొందిన నాయకుల్లో సూర్జిత్ మొదటి వారైతే, అదే స్కూల్లో చదువుకున్న సర్దార్ దర్శన్ సింగ్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారని అనేకమంది విదేశాంగ మంత్రులు, పీసీసీ అధ్యక్షులుగా ఆ స్కూలు నుంచి వచ్చారని, వారి అందరి పేర్లు స్కూలు గోడపై చెక్కారని తెలిపారు. గత సంవత్సరం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ ఛెన్నీ ... సూర్జిత్ జ్ఞాపకాలు పొందుపరుస్తూ అనేక కార్యక్రమాలు చేశారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి యొక్క జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పంజాబ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా సూర్జిత్ సొంత గ్రామంలో పర్యటించడం గొప్ప అనుభూతినిచ్చిందని వెంకట్ అన్నారు. సూర్జిత్ స్ఫూర్తితో వ్యవసాయ కార్మిక ఉద్యమాన్ని మరింత అభివద్ధి చేయడం, హిందుత్వ కార్పొరేట్ శక్తులను ఓడించడమే ఆయనకు అర్పించే నివాళి అన్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రమాదానికి గురైన సూర్జిత్ కుమారుడు గురు చరణ్ సింగ్ బాచి ని పరామర్శించినట్టు తెలిపారు.