Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్‌బీఐ, కేంద్ర మంత్రివర్గం వద్ద పూర్తి సమాచారం లేదు
- సుప్రీంకోర్టు విచారణలో పి.చిదంబరం వాదనలు
- నేడు కొనసాగనున్న వాదనలు
న్యూఢిల్లీ : నోట్ల రద్దుపై కీలక పత్రాలను కేంద్రం దాచేసిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి.చిదంబరం పేర్కొన్నారు. ఆర్‌బీఐ, కేంద్ర మంత్రి వర్గం వద్ద పూర్తి సమాచారం లేదని స్పష్టంచేశారు. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1,000 నోట్లరద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై గురువారం జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. సీనియర్ న్యాయవాది, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం రోజంతా వివరణాత్మక వాదనలు విపించారు. మొత్తం కరెన్సీలో 86 శాతం రద్దు చేస్తున్నట్టు ఎవరికీ చెప్పలేదని అన్నారు. ''నవంబర్ 7న ఆర్‌బీఐకి కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ, రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డ్ ముందు ఉంచిన ఎజెండా నోట్, సెంట్రల్ బోర్డ్ మీటింగ్ మినిట్స్, వారి సిఫార్సులు, నవంబర్ 8న కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం వంటి పత్రాలు ఇప్పటికీ లేవు. ఆరేండ్లు గడిచినా ఈ పత్రాలు ఇంకా పబ్లిక్ డొమైన్‌లో ఉంచలేదు'' అని చిదంబరం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. నవంబర్ 8న జరిగిన కీలకమైన సెంట్రల్ బోర్డ్ సమావేశానికి ఎవరు హాజరయ్యారు? ఆర్‌బీఐ చట్టం-1934 ప్రకారం నిర్దేశించిన కనీస డైరెక్టర్ల సంఖ్య, రూపొందించిన నియమ నిబంధనలు వంటి వివరాలను వెల్లడించకుండా ప్రభుత్వం తప్పించుకుం దని తెలిపారు. 'పెద్ద నోట్ల రద్దు కసరత్తు మొత్తం దాదాపు 26 గంటల్లో జరిగింది. నవంబర్ 7న మధ్యాహ్నం తరువాత ఆర్‌బీఐకి లేఖ చేరింది. ఆ తరువాత నవంబర్ 8న ఢిల్లీలో సమావేశం కావాలని ఫోన్ ద్వారా సెంట్రల్ బోర్డ్‌ను పిలిచి ఉండవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు సమావేశమై, గంట, గంటన్నరలోపు ఆ సిఫార్సును అందజేశారు. తరువాత ప్రధాని రాత్రి 8 గంటలకు టెలివిజన్‌లో ప్రకటించారు' అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది చట్టబద్ధమైన పాలనను అపహాస్యం చేసే అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకునే ప్రక్రియ అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్‌బీఐ కానీ తమ కౌంటర్ అఫిడవిట్‌ల్లో నిర్ణయం తీసుకునే ప్రక్రియకు సంబంధించి మెటీరియల్ వివరాలను అందించలేదని తెలిపారు.