Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీసం చనిపోయినవారినైనా కుల వివక్ష నుంచి తప్పించాలి
- తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు సూచన
చెన్నై : కుల ఆధారిత శ్మశాన వాటికలకు స్వస్తి పలకాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. కనీసం చనిపోయినవారినైనా కుల వివక్ష నుంచి తప్పించాలని తెలిపింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా దేశం ఇంకా కులతత్వ సంకెళ్లను తెంచుకోలేకపోతున్నదని న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేసింది. లౌకిక ప్రభుత్వం కూడా కులం ఆధారంగా వేర్వేరుగా దహనం, ఖననం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని జస్టిస్ ఆర్. సుబ్రమణియన్, జస్టిస్ కె. కుమారేష్ బాబులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఒక కేసులో కులం ఆధారంగా మృతదేహాన్ని వెలికి తీయటానికి అనుమతించిన దిగువ కోర్టు ఆదేశాలను ధర్మాసనం పక్కనబెట్టింది. శ్మశానవాటికలను అందరికీ ఉమ్మడిగా చేయటం ద్వారా ''మంచికి ప్రారంభం'' పలకాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ''21వ శతాబ్దంలోనూ మనం కులతత్వంతో పోరాడుతూనే ఉన్నాం. చనిపోయినవారి ఖననం విషయంలోనూ కులం ఆధారంగా వర్గీకరణ చేయబడింది. ఈ పరిస్థితి మారాలి. మార్పు మంచిదే కావాలి. కనీసం శ్మశాన వాటికలు, దహన స్థలాలను అన్ని వర్గాలకూ ఉమ్మడిగా మార్చటం ద్వారా ప్రభుత్వం ఒక ప్రారంభానికి ముందుకు వస్తుందని మేము ఆశిస్తున్నాం'' అని హైకోర్టు వివరించింది.