Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్‌ఐఎ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు
- హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోం.. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్
న్యూఢిల్లీ : 2018 భీమా కోరేగావ్ కేసులో దళిత హక్కుల కార్యకర్త ఆనంద్ తెల్తుంబ్డేకు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నవంబర్ 18న ఆనంద్ తెల్తుంబ్డేకు బెయిల్ మంజూరు చేస్తూ ముంబాయి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎఎస్ గడ్కరీ, జస్టిస్ మిలింద్ జాదవ్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తెల్తుంబ్డేపై ఉగ్రవాద కార్యకలాపాల నేరానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రాథమిక పరిశీలనలో పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఎన్‌ఐఎ ఆశ్రయించింది. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఉపా సెక్షన్‌లను అమలులోకి తీసుకురావడంలో నిర్దిష్ట పాత్ర ఏమిటీ? మీరు ఆరోపించిన ఐఐటి మద్రాస్ ఈవెంట్ దళిత సమీకరణ కోసమే. దళితుల సమీకరణ సన్నాహక చర్య నిషేధిత కార్యకలాపాలకు సంబంధించినది కాదు కదా? అని ఎన్‌ఐఎ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు భావజాలాన్ని మరింత ముందకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని కూలదోయడానికి తేల్తుంబే కుట్ర పన్నారని ఆయనపై దాఖలైన చార్జిషీట్‌లో పేర్కొన్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయంలో ఉపాలోని 8 సెక్షన్ల కింద అభియోగాలు ఉన్నాయని, మావోయిస్టు పార్టీతో తెల్తుంబ్డేకు లోతైన సంబంధం ఉందని బహిర్గతం చేసే అనేక పత్రాలను ఆమె ఉదహరించారు. అయితే తెల్తుంబ్డే తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకొని ఆ పత్రాలు ఏవీ తెల్తుండ్డే నుంచి స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. తేల్తుంబ్డే నుంచి పంపినట్లు భావిస్తున్న ఈ మెయిల్‌లు సహ నిందితురాలు రోనా విల్సన్ కంప్యూటర్ నుండి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గతేడాది భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్ట్ నాయకుడు, తన సోదరుడు మిలింద్ తెల్తుంబ్డేతో ఆనంద్ తెల్తుంబ్డే దూరంగా ఉన్నారని కపిల్ సిబల్ వివరించారు. గత 30 ఏండ్లుగా ఆయనను ఆనంద్ తెల్తుంబ్డే కలవలేదని ధర్మాసనానికి తెలిపారు. మిలింద్‌ను ఆనంద్‌తో ముడిపెట్టిన ఎన్‌ఐఎ కేసు వినికిడి సాక్ష్యం ఆధారంగా ఉందని, ఇది సీఆర్‌పీసీ సెక్షన్ 161 కింద నమోదు చేయబడిన ఒక స్టేట్‌మెంట్‌లో ఇచ్చారని, ఈ సాక్ష్యం ఆమోదయోగ్యం కాదని సిబల్ తెలిపారు. ఆనంద్ తెల్తుంబ్డేను ఉగ్రవాద కార్యకలాపాలతో ముడిపెట్టడానికి ఎలాంటి పత్రం లేదని హైకోర్టు స్పష్టం చేసిందని, ఆయన ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో కూడా లేరని, ఆయన అక్కడ ఉన్నారని చూపించడానికి ఎటువంటి ఆధారాలు చూపలేదని ధర్మాసనానికి కపిల్ సిబల్ వివరించారు.
ఉపా కింద నిషేధిత సంస్థ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తేదీ లేని లేఖను ఐశ్వర్య భాటి ప్రస్తావించారు. ఈ లేఖలో తెల్తుంబ్డేని ''డియర్ కామ్రేడ్ ఆనంద్'' అని సూచిస్తోందని తెలిపారు. 50 ఏండ్ల నక్సల్బరీ ఉద్యమాన్ని స్మరించుకునే కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ''కామ్రేడ్ తెల్తుంబ్డే'' తగిన సూచనలు చేశారని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ క్రియాశీల సభ్యుడు రాసిన లేఖను కూడా ఆమె చదివి వినిపించారు. సహ నిందితురాలు రోనా విల్సన్ ల్యాప్‌టాప్ నుంచి స్వాధీనం చేసుకున్న తెల్తుంబ్డేకు రాసిన లేఖను కూడా ఉదహరించారు. 2018 ఏప్రిల్ 9, 10 తేదీల్లో జరగనున్న మానవ హక్కుల సదస్సు కోసం పారిస్‌లో తేల్తుంబ్డే పర్యటన గురించి, దేశీయంగా గందరగోళాన్ని సృష్టించడానికి దళిత సమస్యలపై ఉపన్యాసాలు ఇవ్వడం గురించి లేఖలో పేర్కొన్నారని తెలిపారు. కపిల్ సిబల్ జోక్యం చేసుకొని పారిస్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే ఎన్‌ఐఎకి లేఖ రాసిందని, ఆ సంస్థ ఖర్చులను భరించిందని వాదించారు. విద్యా పని కోసమే పారిస్ వెళ్లారని తెలిపారు. తెల్తుంబ్డే నిషేధత సంస్థ కార్యకలాపాలను నిర్వహించడానికి నిధులు అందుకున్నారని ఐశ్వర్య భాటి ఆరోపించారు. ఉపా ప్రకారం ఉగ్రవాద చర్యకు పాల్పడనవసరం లేదని, నిషేధిత సంస్థ కోసం సన్నాహక చర్య చేసిన నేరమేనని ఆమె అన్నారు. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ జోక్యం చేసుకొని తెల్తుంబ్డే పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ''ఉపా సెక్షన్‌లను అమలులోకి తీసుకురావడంలో నిర్దిష్ట పాత్ర ఏమిటీ? ఐఐటీ మద్రాస్ సంఘటన ఆయన దళిత సమీకరణను చైతన్యవంతం చేస్తున్నాడని మీరు ఆరోపిస్తున్నారు. దళితుల సమీకరణ సన్నాహక చర్య నిషేధిత కార్యకలాపాల్లో లేదు కదా?'' అని ప్రశ్నించారు. దీనికి భాటి స్పందిస్తూ ఆయన ప్రొఫెసర్ అని, ఉపన్యాసాలు ఇవ్వడానికి తనకు స్వేచ్ఛ ఉందని అన్నారు. అయితే ఆయన నిషేధిత సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నందున, నిధులు కూడా అందుకున్నందున వారిపై ఉపా కేసు నమోదు చేశామని తెలిపారు. అయితే తేల్తుంబ్డే నుంచి ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకోలేదని సిబల్ స్పష్టం చేశారు. ఎన్‌ఐఎ దగ్గర ఉన్న పత్రాలకు ఉపాలోని ఎలాంటి నిబంధనలతో సంబంధం లేదని, రోనా విల్సన్ కంప్యూటర్ నుంచి సేకరించిన పత్రాలు కూడా ఆనంద్ తేల్తుంబ్డే రాసినవి కాదనీ, మరెవరో రాశారని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్‌ఐఎ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, ముంబాయి హైకోర్టు తీర్పును సమర్థించింది.