Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం
న్యూఢిల్లీ : ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం మతపరమైన భావాలు కలిగిన రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్‌ను నిరోధించే చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మతపరైన చిహ్నాలను కలిగి ఉన్న రాజకీయ పార్టీలను రద్దు చేయాలని సయ్యద్ వజీమ్ రిజ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో అనేక హిందూ, ముస్లిం, క్రైస్తవ పేర్లతో ఉన్న పార్టీలను పేర్కొన్నారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించగా.. సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. దశాబ్దాలుగా ఉనికిలో ఉన్న పార్టీల పేర్లు వారసత్వ పేరుగా మారాయనీ, అది రాజకీయ పార్టీల పేర్లకు భంగం వాటిల్లవచ్చా? లేదా అనేది కోర్టు విజ్ఞతకే వదిలేస్తున్నామని ఈసీ పేర్కొంది. 2005లో సెక్షన్ 29ఏ ప్రకారం మతపరమైన భావాలున్న రాజకీయ పార్టీలను రిజిస్ట్రర్ చేయకూడదని విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. అప్పటి నుంచి ఎన్నికల సంఘం అటువంటి రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయలేదని తెలిపింది. అయితే ఈ నిర్ణయం తీసుకోకముందే పిటిషన్‌లో పేర్కొన్న రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోరే రాజకీయ పార్టీలు మతపరమైన భావాలను కలిగి ఉండరాదని 2014 మే 19న ఎన్నికల సంఘం ఉత్వర్తులు జారీ చేసిందని అఫిడవిట్‌లో పేర్కొంది. రాజ్యాంగం, సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్య సూత్రాలకు, దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతలను సమర్థిస్తూ రాజకీయ పార్టీ నియమాలు ఉండాలనీ, లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ జరగదని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే రాజకీయ పార్టీ నిజమైన విధేయతను కలిగిఉండాలని ఈసీఐ చట్టం సెక్షన్ 29ఏ (5), సెక్షన్ 29ఏ(7)లో ఉందని పేర్కొంది. రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అనుగుణంగా ఉన్న పద్ధతితో మాత్రమే ఏ అభ్యర్థినైనా అనర్హులుగా ప్రకటించవచ్చని, అంతేతప్ప రాజకీయ పార్టీని నిషేధించలేమని పేర్కొంది.