Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా, ద్రవ్యోల్బణం ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా వ్యయ నియంత్రణలు
- దాంతో ప్రభుత్వ సేవలకు దూరమవుతున్న మహిళలు, బాలికలు : ఆక్స్‌ఫామ్ నివేదిక
- లింగ వివక్షతో ఉపాధి లేమి, పనిభారం, మరణాలు, పేదరికం
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా మహిళలు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారని, పలు చోట్ల ఆంక్షల రూపంలో అది అమలవుతోందని 'ఆక్స్‌ఫామ్' ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు మహిళల జీవితాల్ని, భద్రతను ఫణంగా పెట్టి..కరోనా సంక్షోభం నుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకున్నాయని ఆక్స్‌ఫామ్ హెడ్ (మహిళల హక్కులు, న్యాయం) అమీనా హెర్సీ అన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడటానికి, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనడానికి ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు మహిళలు, బాలికలను ప్రభుత్వ సేవలకు దూరం చేస్తున్నాయని నివేదిక వివరించింది. దీంతో మహిళల్లో పేదరికం, పనిభారం, మరణాలు, ప్రమాదాలు ఎక్కువయ్యాయని తెలిపింది. 2020తో పోల్చుకుంటే 2021లో మహిళల్లో ఉద్యోగిత స్వల్పంగా పెరిగిందని, ద్రవ్యోల్బణం, కరోనా సంక్షోభ సవాళ్లను ఎదుర్కొనేందుకు మహిళలు ఎన్నో కష్టనష్టాలకు గురవుతున్నారని పేర్కొన్నది. దీనికి కారణం ప్రభుత్వ సేవలు లేకపోవటమేనని విశ్లేషించింది. ఈ నివేదికలోని మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు కొత్త ప్రమాదాలు తెచ్చిపెట్టాయి. లింగ వివక్ష ఆంక్షల రూపంలో అమలవుతోంది. ఉదాహరణకు ప్రభుత్వ వ్యయంలో కోతలు ఏర్పడటంతో తాగునీరు కొరతను మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు అదనంగా 20కోట్ల గంటలు పనిచేయాల్సి వస్తోంది. వ్యయ నియంత్రణ కారణంగా, పేదరికం, మరణాలు సరికొత్త స్థాయిలకు చేరుకున్నాయి. కీలకమైన ప్రభుత్వ సేవలు దెబ్బతినటం వల్ల, మహిళలపై శారీరక, మానసిక భారం పెరిగింది.
ఉపాధి అవకాశాల్లో 21శాతం
లాక్‌డౌన్ సమయంలో హింసకు గురైన మహిళా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ సేవలపై 85శాతం దేశాల్లో బడ్జెట్ కోతలు విధించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు 2023లోనూ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టబోతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి.