Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చార్జిషీట్‌లో ఏడుగురి పేర్లు.... 10 వేల పేజీల చార్జ్జిషీట్
- ఢిల్లీ మద్యం కుంభంకోణంలో సీబీఐ తొలి చార్జ్జిషీట్
- ఢిల్లీ డిప్యూటి సీఎం సిసోడియా పేరు మినహాయింపు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. శుక్రవారం రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో 10 వేల పేజీలతో కూడిన ఈ-డాక్యుమెంటు, సీడీల రూపంలో చార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసులో నిందితులైన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లి, విజరు నాయర్‌లతో ఏడుగురిపై చార్జిషీట్ వేశారు. విచారణ ప్రారంభం అయిన నాటి నుంచి 60 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ గడువు నేటి (శుక్రవారం)తో ముగియనుండటంతో ట్రయల్ కోర్టు ముందు సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జిషీట్ లో ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఉండగా, ఐదుగురు ప్రయివేట్ వ్యక్తులు ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్‌దీప్ సింగ్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్ పేర్లను కూడా చార్జిషీట్ లో పేర్కొంది. చార్జిషీట్ లో ఎ1గా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కుల్‌దీప్ సింగ్, ఎ2గా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నరేంద్ర సింగ్, ఎ3గా విజరునాయర్ (ఆమ్‌ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి), ఎ4గా అభిషేక్ బోయినపల్లి (హైదరాబాద్ వ్యాపారి), ఎ5గా ముత్తా గౌతమ్ (ఇండియా ఎహెడ్ అధినేత), ఎ6గా అరుణ్ రామచంద్ర పిళ్లై (రామిన్ డిస్టిలరీస్ ఎల్‌ఎల్‌పి), ఎ7గా సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) పై అభియోగాలు మోపింది. 2022 ఆగస్టు17న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని ఈ పేర్లను మాత్రమే తొలి చార్జిషీట్ లో నమోదు చేసినట్లు న్యాయమూర్తికి తెలిపింది.
చార్జిషీట్ లో కీలక అంశాలు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ లో పలు అంశాలు పేర్కొంది. మద్యం పాలసీ రూపొందించడంలో, అమలు చేయడంలో అవినీతిపై కేంద్ర హౌంశాఖ సూచనపై పది మంది మద్యం లైసెన్సుదారులు, వారి సహచరులు, ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు తెలిపింది. ఎక్సైజ్ పాలసీలో సవరణలు, లైసెన్సులకు అనుచిత ప్రయోజనాలు కల్పించడం, లైసెన్సు ఫీజులో మినహాయింపు/తగ్గింపు, ఆమోదం లేకుండానే ఎల్-1 లైసెన్సు పొడిగింపు తదితర విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు సీబీఐ తెలిపింది. ఖాతా పుస్తకాల్లో తప్పుడు లెక్కలతో సంపాదించిన దాంట్లో కొంత మొత్తం ప్రభుత్వ అధికారులకు ప్రయివేటు వ్యక్తుల ఖాతాల నుంచి మళ్లించారని పేర్కొంది. నిందితుల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి విలువైన రికార్డులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.