Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంలో విద్యార్థి, యువజన వ్యతిరేక సర్కార్
- ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ పార్లమెంట్ మార్చ్‌లో డి.రాజా
- అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి.. ఖాళీలను భర్తీ చేయాలి
- భగత్‌సింగ్ పేరుతో ఉపాధి హామీ చట్టం
- నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
న్యూఢిల్లీ :కేంద్రంలోని మోడీ సర్కార్ విద్యార్థి, యువజన వ్యతిరేక విధానాలను అమలంభిస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. దేశంలోని యువతకు ఉపాధిని కల్పించడంలో, విద్యార్థులకు నాణ్యమైన, ఉచిత విద్య విధానం అమలు చేయడంలో మోడీ సర్కార్ విఫలం అయిందని దుయ్యబట్టారు. శుక్రవారం నాడిక్కడ జంతర్ మంతర్‌లో ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్ జరిగింది. ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోడీ గద్దెనెక్కినప్పటి నుంచి విద్యార్థి, యువజన ప్రయోజనాలను గాలికొదిలి, దేశ భవిష్యత్తును మంటగలుపుతోందని ధ్వజమెత్తారు. అన్ని రంగాల ను ప్రయివేటీకరణ చేసేందుకు పూనుకుందని, దీనివల్ల గౌరవప్రదమైన ఉపాధికి గండి పడుతోందని పేర్కొన్నారు. ప్రయివేట్ రంగంలో అనేక పరిశ్రమలు సంక్షోభంతో మూసివేతకు గురయ్యాయని, అయితే మోడీ సర్కార్ మరోపక్క ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు విధానాలు వేగవంతం చేస్తోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి విద్యార్థి, యువజనలపై ఒక స్పష్టమైన విధానం లేదని దుయ్యబట్టారు. సీపీఐ రాజ్యసభ ఎంపి బినరు విశ్వం మాట్లాడుతూ పార్లమెంట్‌లో విద్యార్థి, యువజన సమస్యలపై లేవనెత్తుతామని అన్నారు. జాతీయ మోనిటైజేషన్ పైప్‌లైన్ పేరుతో నింగి నుంచి నేల వరకు అన్నింటిని ప్రయివేట్‌పరం చేస్తున్నారని విమర్శించారు. ఎఐవైఎఫ్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుకేంద్రీ మహేశ్వరీ, తిరుమలయి మాట్లాడుతూ దేశంలోని అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టం (బీఎన్‌ఈజీఏ) తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎఐఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు శుభం బెనర్జీ, విక్కీ మహేశ్వరి మాట్లాడుతూ నూతన విద్యా విధానాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. దేశంలో శాస్త్రీయ విద్యా విధానాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉల్లవలీ ఖాద్రీ, ధర్మేంద్ర, ఎఐఎస్‌ఎఫ్ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ,ఎఐవైఎఫ్ ఏపీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేంద్ర, ఎన్.లెనిన్ బాబు, ఎఐఎస్‌ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం. సుబ్బారావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్ బాబు, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.