Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టు విచారణలో సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్
న్యూఢిల్లీ : నోట్ల రద్దును అమలు చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం అర్థవంతమైన అధ్యయనం చేసి ఉండాల్సిందని సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ శుక్రవారం సుప్రీంకోర్టులో వాదించారు. 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, రూ.1,000 నోట్లరద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ఐదురుగు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం కూడా విచారణ కొనసాగించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టంలోని సెక్షన్ 26 (2) కోసం రక్షణ కవచాలను ఏర్పాటు చేయాలని గట్టిగా కోరారు. '' 86.4 శాతం కరెన్సీని రద్దు చేస్తున్నప్పుడు కనీసం ఒక అధ్యయనం చేసి ఉండాల్సింది. కానీ నోట్ల రద్దుపై ఒక్క అధ్యయనం కూడా జరగలేదు'' అని ఆయన అన్నారు. ఆ కాలంలో 1.2 కోట్ల ఉద్యోగాలు కోల్పోయామనీ, తాము జీవనోపాధి గురించి మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయానికి గోప్యత ముఖ్యమైనప్పటికీ, కనీస అంచనా కూడా లేకపోవడం దారుణమన్నారు. నోట్ల మార్పిడికి చాలా ఇబ్బందులు పడ్డారని, తాను కూడా ఇబ్బంది పడ్డానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు ప్రారంభించారు. ఆర్థిక విధానానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టుకు ఉన్న పరిమిత అధికారంపై ఎజీ మాట్లాడారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు ప్రతిపాదనను ఆర్బీఐకి పంపినప్పటి నుంచి చట్టబద్ధమైన విధానాన్ని తారుమారు చేశారన్న ఆరోపణను ఖండించారు. విచారణను వాయిదా వేసిన ధర్మాసనం డిసెంబర్ 5న అటార్నీ జనరల్ తన వాదనలు కొనసాగించనున్నారు.