Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్‌భవన్లకు మార్చ్‌లో 50 లక్షల మంది
- దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ర్యాలీలు
- రాష్ట్రపతికి, గవర్నర్లకు ఎనిమిది డిమాండ్లతో వినతి
- రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వంపై అన్నదాత ఆగ్రహం
- మలిదశ పోరాటానికి నాంది : రైతు నేతలు
దేశంలోని రైతన్నలు మరోసారి గర్జించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానులు రైతు నినాదాలతో దద్దరిల్లాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపులో భాగంగా రాజ్‌భవన్‌ల మార్చ్ శనివారం దిగ్విజయంగా జరిగింది. ఈ మెగా నిరసనలో మిలియన్ల మంది రైతులు పాల్గొన్నారు. ఎస్‌కేఎం పిలుపుకు రైతులతో పాటు కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, సామాన్య ప్రజలు రాష్ట్రాల రాజధానుల్లో భారీ పాదయాత్రలు, ర్యాలీ, కవాతులు నిర్వహించారు. 25 రాష్ట్రాల రాజధానుల్లో 300లకు పైబడి జిల్లా కేంద్రాల్లో, వేలాది మండల కేంద్రాల్లో భారీ సభలు జరిగాయి. దేశవ్యాప్తంగా మూడు వేలకు పైగా ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.
న్యూఢిల్లీ : ఎస్‌కేఎం రాజ్‌భవన్ మార్చ్‌ల్లో పాల్గొనేందుకు ఐదు మిలియన్లకు పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. చండీగఢ్, లక్నో, పాట్నా, కోల్‌కతా, తిరువనంతపురం, చెన్నై, హైదరాబాద్, భోపాల్, జైపూర్, విజయవాడ, అగర్తలా, దిస్‌పూర్, ముంబాయి, రాంచీ, పనాజీతో పాటు అనేక ఇతర రాష్ట్ర రాజధానుల్లో లక్షలాది మంది ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. పంజాబ్‌లోని చండీగఢ్‌లో 40 వేల మందితో భారీ ర్యాలీ జరిగింది. రాజ్‌భవన్ వైపుగా వెళ్తన్న ర్యాలీని చండీగఢ్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం భారీ బహిరంగ సభ జరిగింది. ఎస్‌కేఎం నేతలు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. సభలో అశోక్ ధావలే, జోగీందర్ సింగ్ ఉగ్రహన్, దర్శన్ పాల్, బూటా సింగ్ బుర్జ్‌గిల్, బల్దేవ్ సింగ్ నిహల్‌గర్, రుల్దు సింగ్ మాన్సా తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారీ కిసాన్ ర్యాలీ జరిగింది. అనంతరం ఎకో మైదాన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో హన్నన్ మొల్లా, రాకేష్ టికాయిత్ తదితరులు మాట్లాడారు.
మలిదశ పోరాటానికి నాంది
సామూహిక బలంతో భారీ ప్రదర్శన, రైతుల అన్ని డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతు నేతలు స్పష్టం చేశారు. 2020 నవంబర్ 26న ఎస్‌కేఎం చారిత్రాత్మకమైన ''ఢిల్లీ చలో'' ఉద్యమాన్ని ప్రారంభించిందనీ, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రైతు ఉద్యమంగా అవతరించిందని తెలిపారు. రైతులను వారి భూమి నుంచి గెట్టివేసేందుకు కుట్రలు పన్నిన కార్పొరేట్, రాజకీయ బంధానికి వ్యతిరేకంగా రైతుల అద్భుతమైన విజయానికి దారితీసిందని తెలిపారు. రెండేండ్ల తర్వాత అదే రోజున దేశవ్యాప్తంగా ''రాజ్ భవన్ మార్చ్‌లు' నిర్వహించామని తెలిపారు. ఇది రైతుల మలిదశ పోరాటానికి నాందని స్పష్టం చేశారు. 'రాజ్‌భవన్ మార్చ్‌ల' కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, పౌర సమాజానికి ఎస్‌కేఎం నేతలు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా నిరంతరం, నిబద్ధతతో కూడిన దేశవ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు గర్జించారు. రాష్ట్రపతికి, రాష్ట్రాల గవర్నర్లకు రైతుల డిమాండ్లతో కూడిన మెమోరాండం పంపారు. కేంద్రంలోని అధికార పార్టీ రైతు వ్యతిరేక విధానాలను జోక్యం చేసుకుని ఆపాలని కోరారు.
ఎనిమిది డిమాండ్లతో వినతలు
1. రైతులందరికీ అన్ని పంటలకు సి2+50 శాతంతో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టబద్ధంగా హామీ ఇవ్వాలి. 2. సమగ్ర రుణమాఫీ పథకంతో రుణభారం నుంచి రైతులకు విముక్తి కల్పించాలి. 3. విద్యుత్ సవరణ బిల్లు-2022ను ఉపసంహరించుకోవాలి. 4. లఖింపూర్ ఖేరి రైతుల, జర్నలిస్ట్ మారణకాండలో నిందితుడైన కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు కుమార్ టెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఆయనను పదవి నుంచి తొలగించాలి. 5. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు త్వరగా పరిహారం అందించేందుకు సమగ్ర, ప్రభావవంతమైన పంటల బీమా పథకం తీసుకురావాలి. 6. సన్నకారు, చిన్న, మధ్య తరహా రైతులు, వ్యవసాయ కార్మికులందరికీ నెలకు రూ. 5,000 రైతు పింఛను ఇవ్వాలి. 7. రైతు ఉద్యమంలో రైతులపై నమోదైన అన్ని తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి. 8. అమరులైన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి'' అని డిమాండ్ చేశారు. వీటితో పాటు రైతుల ఉద్యమ సమయంలో ఆయా రాష్ట్రాల్లో నెలకొన్ని స్థానిక డిమాండ్లను కూడా లేవనెత్తారు.