Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ ధర కంటే తక్కువగా ఎంఎస్‌పీ
- పడిపోతున్న అన్నదాత ఆదాయం
- పోరాటాలకు అడుగడుగునా అడ్డంకులు
- రాష్ట్ర ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని రైతులు తీరని అన్యాయానికి గురవుతున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు వారు నోచుకోలేకపోతున్నారు. మార్కెట్ రేటుతో పోల్చుకుంటే ఎంఎస్‌పీ తక్కువగా ఉండటం అన్నదాతలకు కోపం తెప్పిస్తున్నది. మరోపక్క, రాష్ట్రంలో రైతన్నల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. జరిగిన అన్యాయంపై నిరసనలతో పోరాటం చేద్దామన్నా.. చేయలేని పరిస్థితి రైతన్నలది. నిరసనల్లో పాల్గొనకుండా అక్కడి ప్రభుత్వం వారిని అడ్డుకుంటున్నది. దీంతో ప్రభుత్వ తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అహ్మదాబాద్ : రాష్ట్రంలోని బీజేపీ సర్కారు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు ఇక్కడి రైతుల నుంచి వినిపిస్తున్నాయి. తాము పడే సమస్యలకు ప్రభుత్వం తీరు మరింత తోడైందదని బనస్కాంతలోని ధనేరా అనే ప్రాంతానికి చెందిన రైతు శంకర్ చెప్పాడు. బనస్కాంతలో భూగర్భజలాలు అడుగంటిపోవటమే కాదు, ప్రభుత్వం నుంచి లభించిన సహాయం ఇది అని ఆయన అన్నాడు. ఉత్తర గుజరాత్‌లోని మహేసనా జిల్లాలో గత ఎన్నికల్లో బీజేపీ మొత్తం ఏడు స్థానాలకు గానూ ఐదు స్థానాలను గెలుచుకున్నది. అయితే, రైతుల సమస్యలకు లభించిన పరిష్కారం మాత్రం శూన్యం. దీంతో అక్కడి బీజేపీకి రాబోయే ఎన్నికల్లో రైతుల నుంచి తీవ్ర ఎదురుదెబ్బ ఎదురయ్యే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మహేసనా జిల్లా స్వతంత్రులు లేదా కాంగ్రెస్ చేతికి చిక్కే అవకాశాలున్నాయని చెప్పారు.
ఇక్కడ భూగర్భ జలాలు లేకోవటంతో సేద్యం కష్టంగా మారిందని రైతులు చెప్పారు. బిందు సేద్యం రాయితీని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసినా సద్వినియోగం కావటం లేదన్నారు. '' నా పొలంలో బోర్‌వెల్ వేయటానికి నాకు ఆర్థిక స్థోమత లేనప్పుడు నేను సబ్సిడీని ఎలా ఉపయోగించుకోగలను? గతంలో విత్తనాలకు సబ్సిడీ ఇచ్చారు. ఈ ఏడాది అది కూడా అందటం లేదు'' అని మోహన్ అనే రైతు వాపోయాడు. ధరల పెరుగుదల, తక్కువ ఆదాయాలపై రైతులు ఇక్కడ అనేక సార్లు నిరసనలు, పోరాటాలు చేశారు. కానీ, ఇక్కడి బీజేపీ సర్కారు వారిని ఎప్పటికప్పుడు అడ్డుకున్నది. ఇక్కడ నీటి వసతి పరిస్థితుల కారణంగా మూడు సీజన్లలో వ్యవసాయం లేదనీ, దీంతో రెండు పంటలకే ఇది కుదించబడిందని శంకర్ అనే రైతు తెలిపాడు. వేరుశనగ, ఆవాలు వంటి పంటకు రేట్లు తక్కువగా ఉండటంతో పంటలు అమ్మలేకపోతున్నా మని వాపోయాడు. గతంలో కంటే ప్రభుత్వం ఈ సారి తక్కువగానే కొనుగోళ్లు చేస్తున్నదని రైతులు ఆరోపించారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఉత్పత్తిలో 20 శాతం లోపే సేకరించిందని వారు చెప్పారు.
రైతులు తమ పంటను 'సర్కారీ మండి'లో విక్రయించే బదులు బహిరంగ మార్కెట్‌లో విక్రయించటం ఉత్తమమని అన్నదాతలు తెలిపారు. ధనవాడ గ్రామానికి చెందిన మషుక్ పంటేల్ అనే మధ్య తరహా రైతుకు సుమారు 20 బిగాల భూమి ఉన్నది. ఆయన మార్కెట్ స్థితిపై అసంతృప్తిగా ఉన్నాడు. ఒక రైతు పంటలను మంచి ధరకు ఎందుకు అమ్మడు? అని ప్రశ్నించాడు. ప్రభుత్వం కేవలం రెండు పంటలకే ఎంఎస్‌పీ ధరతో సేకరిస్తున్నదని రైతులు తెలిపారు. వేరుశనగ 20 కిలోలకు ఎంఎస్‌పీ రూ. 1170 కాగా, మార్కెట్‌లో ధర దాదాపు రూ. 1200 నుంచి 1350గా ఉన్నది. ఆవాలు 20 కిలోలకు ఎంఎస్‌పీ రూ. 1070 ఉండగా, రైతు మార్కెట్‌లో రూ. 1300కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు తగ్గటం రైతులపై ప్రభావాన్ని చూపుతున్నాయని విశ్లేషకులు తెలిపారు.రైతులు ఆరోపిస్తున్నట్టుగా ఎంఎస్‌పీ తగ్గింపు గత రెండేండ్లలో జరిగింది. ఉత్తర గుజరాత్, సౌరాష్ట్ర లో నీటి సమస్య తలెత్తటంతో గుజరాత్‌కు చెందిన రైతులు నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. అయితే, గుజరాత్ పోలీసు లు తమను అడ్డుకున్నారని అన్నదాతలు ఆరోపించారు. 2020 మధ్య నాటికి, కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌లు గృహ ఆదాయాలను తీవ్రంగా దెబ్బతీసిన తర్వాత వ్యవసాయ ధరలు బాగా పడిపోయాయి. వ్యవసాయ ప్రాంతాల పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది, సగటున క్వింటాల్‌కు రూ. 6 వేలుగా ఉన్న పత్తి ధర రూ. 3 వేలకు పడిపోయింది.
2014 నుంచి రైతుల హక్కుల కోసం పోరాడుతున్న ద్వారకకు చెందిన పాల్ అంబలియా అనే 44 ఏండ్ల రైతు నాయకుడు, మరో ఇద్దరు రైతులు మూడు పత్తి బస్తాలతో రాజ్‌కోట్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మంచి రేట్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అయితే, 2020 మేలో ఆయనను చెట్టుకు కట్టేసి కొట్టటం ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నది. వందలాది మంది రైతులు జనవరి 26న ఢిల్లీలో అన్నదాతలు చేపట్టిన ట్రాక్టర్ మార్చ్‌లోపాల్గొనాలని నిర్ణయించారు. అయితే, రాష్ట్ర పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ.. సొంత రాష్ట్రంలోనే అది నెరవేరటం లేదని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ఎంఎస్‌పీని కల్పించకుండా, రైతుల ఆదాయా లు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నదన్నారు. ఈ అన్యాయంపై కనీసం నిరసనల నూ తెలపనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం తన అధికార బలనాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నదని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సర్కారుకు తగిన బుద్ధి చెప్తామని ఇక్కడి రైతులు కృత నిశ్చయంతో ఉన్నారు.