Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ మోడల్లో..శ్రామికవర్గానికి అన్యాయం
- దేశంలోనే అత్యంత తక్కువ వేతనాలు
- పురుషులకు దినసరి వేతనం రూ.244..జాతీయ సగటు రూ.344
- వ్యవసాయరంగంలో మహిళలకు రూ.243
- ఉపాధి పనుల్లో సగటు వేతనం రూ.213
న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పాలనపై అనేక విషయాలు మీడియా ద్వారా బయటకు వస్తున్నాయి. గత 27 ఏండ్లుగా అక్కడ బీజేపీ ఏం చేసిందన్నది చర్చనీయాంశమవుతోంది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం చలాయిస్తోంది. 'గుజరాత్ మోడల్' అంటూ ప్రధాని మోడీ చేస్తున్న హడావిడి అందరూ చూస్తూనే ఉన్నారు. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన, సంపన్నమైన రాష్ట్రంగా బీజేపీ పాలకులు గుజరాత్‌ను చూపుతున్నారు. ఇదంతా కేవలం ప్రచారంలో తప్ప..వాస్తవం కాదని ప్రతిపక్షాలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శిస్తున్నాయి. గుజరాత్ అభివృద్ధి, అక్కడి ఇతర విషయాలపై వాస్తవ గణాంకాలతో రాజకీయ విశ్లేషకులు రాస్తున్న కథనాలూ ప్రజల ముందుకు వస్తున్నాయి. వ్యవసాయ కార్మికులు, వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు..వీరంతా కూడా అత్యంత తక్కువ వేతనాలు పొందుతున్నారని, యాజమాన్యాలకు అనుకూలమైన విధానాలు అమలుజేయటం వల్లే ఈ పరిస్థితి కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అందువల్లే యాజమాన్యాలు పెద్ద మొత్తంలో లాభాలు పోగేసుకుంటున్నాయని, ఇదెప్పుడూ గుజరాత్ మోడల్లో చర్చకు రాకుండా బీజేపీ పాలన సాగిందని చెబుతున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం గుజరాత్లో భూమిలేని వ్యవసాయ కార్మికులు 68.39 లక్షల మంది వున్నారు. దశాబ్దకాలంలో ఈ సంఖ్య ఎంతో పెరిగింది. వలస కార్మికులు మరో 5 లక్షల మంది ఉంటారని అంచనా. 15 లక్షల మంది నిర్మాణ రంగ కార్మికులు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలున్నారు. ఎవ్వరీకి కూడా కనీస వేతనం అనేది అమలుకావటం లేదు. వ్యవసాయ కార్మికల వేతనాలపై సెప్టెంబర్ 2022 నాటి ఒక సర్వే ప్రకారం, అక్కడ పురుషులకు రోజువారీ సగటు వేతనం రూ.244. జాతీయ సగటు రూ.344 కన్నా చాలా తక్కువ వేతనాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నా..బీజేపీ పాలకులు పట్టించుకోవటం లేదు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటే ఇదే
కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన శాంపిల్ సర్వే గణాంకాల ప్రకారం, వ్యవసాయ రంగంలో మహిళా కార్మికులకు కేరళలో రూ.548 సగటు వేతనం అందుతోంది. జాతీయ సగటు రూ.272గా, గుజరాత్లో రూ.243గా నమోదైంది. ఇక ఉపాధి హామీ (నరేగా పథకం) చట్టం కింద జరిగే పనుల్లో ఈ ఏడాది గుజరాత్లో కార్మికులకు అందిన సగటు వేతనం కేవలం రూ.213. గత ఏడాది రూ.205 చెల్లించారు. దీనినే 'ఈజ్ ఆఫ్ డూయింగ్'గా గుజరాత్ పాలకులు పేర్కొంటున్నారు. ఎన్నో ఏండ్లుగా సాగుతున్న దోపిడి పాలన నుంచి మార్పు రావాలని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రామిక ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రయోజనాల్ని దశాబ్దాలుగా బీజేపీ అణచివేస్తోంది. యాజమాన్యాలకు స్థిరమైన అధిక లాభాల రేటు దక్కేలా వ్యవహరిస్తోందనటం రాజకీయ ఆరోపణ కాదు. 'గుజరాత్ మోడల్' వాస్తవ గణాంకాలే పై విషయాల్ని బయటపెడుతున్నాయి.
జాతీయ సగటులో సగం
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గుజరాత్లో నడుస్తున్న ఎంటర్‌ప్రైజెస్‌లో కార్మికులకు నిర్దేషించిన సగటు కనీసం వేతనం రూ.9,438. ఇదే కేటగిరిలో జాతీయ స్థాయిలో కేంద్రం నిర్దేషించిన కనీస సగటు వేతనం రూ.18,485గా ఉంది. ఇది కేవలం నోటిఫై చేసిన కనీస సగటు వేతనాల గణాంకాలు మాత్రమే. వాస్తవంగా వీటికన్నా తక్కువ వేతనాలు కార్మికులకు అందుతున్నాయి. ఇక ప్రయివేటు యాజమాన్యాల చేతిలో ఉన్న ఎంటర్‌ప్రైజెస్‌లో యాజమాన్యాలు చెప్పిందే ఫైనల్. అందుకే బడా కార్పొరేట్ కంపెనీలు గుజరాత్‌కు వరుస కడుతున్నాయి.
కార్మికుల కనీస వేతనాలపై కేంద్రం నోటిఫై చేసినట్టుగా ప్రభుత్వ, ప్రయివేటు యాజమాన్యాలు చెల్లించాల్సిందే. నోటిఫై చేసిన విధంగా యాజమాన్యాలు వేతనాలు ఇస్తున్నారా ? లేదా? అన్నది పర్యవేక్షించడానికి ఎన్ఫోర్స్మేంట్ యంత్రాంగం క్షేత్రస్థాయిలోకి పంపాలి. ఇది జరగాలంటే ముందుగా రాజకీయ చిత్తశుద్ది ఉండాలి. నోటిఫై చేసిన వేతనాలు, ఎన్ఫోర్స్మేంట్, రాజకీయ చిత్తశుద్ధి అంతా కూడా గుజరాత్లో కాగితాలకే పరిమితం. క్షేత్రస్థాయిలో ఎక్కడా కనపడదు. బడా కార్పొరేట్లు, యాజమాన్యాలు ప్రభుత్వాన్ని చెప్పుచేతుల్లో పెట్టుకున్నాయి. నిరుద్యోగ సమస్యను ఆసరాగా చేసుకొని అత్యంత తక్కువ వేతనాలతో కార్మికులతో పనిచేయించుకుంటున్నాయి. ఇక వ్యవసాయ కూలీలు, కార్మికుల అవస్థలకు లెక్కేలేదు.