Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధిక ఫీజులు.. నాణ్యతలో రాజీ
- విద్యార్థినులకు భద్రత కరువు
- దేశంలో ప్రయివేటు యూనివర్సిటీల తీరు
- క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు
- విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన
దేశంలో విద్య వ్యాపారంగా మారిపోయింది. విశ్వవిద్యాలయాల స్థాయి క్రమంగా దిగజారిపోతున్నది. ప్రయివేటు యూనివర్సిటీల రాక పరిస్థితులను మరింత అధ్వాన్నంగా తయారు చేసింది. నాణ్యమైన విద్యను, సదుపాయాలను అందించటంలో ఇలాంటి విద్యా సంస్థలు విఫలమవుతున్నాయి. విద్యార్థుల చేతికి డిగ్రీ పట్టాలు అందుతున్నా.. దానికి తగిన విధంగా ప్లేస్మెంట్లు కనిపించటం లేదు. దీంతో చదివిని చదువకు తగిన నైపుణ్యం కొరవడి.. ప్లేస్మెంట్లూ లేక ప్రయివేటు విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులంతా తీవ్రంగా నష్టపోతున్నారు.
న్యూఢిల్లీ : దేశభవిష్యత్తును నిర్ణయించే యువతకు విద్య ఒక విలువైన ఆభరణం వంటిదనీ, అలాంటి విద్యను మోడీ సర్కారు, దేశంలోనికొన్ని రాష్ట్రాలు ప్రయివేటు వ్యక్తుల చేతులకు అప్పగించి వ్యవస్థను నాశనం చేస్తున్నాయని విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద భవనాలు.. చక్కగా అలంకరించబడిన పచ్చిక బయళ్లు.. విద్యార్థుల చిరునవ్వు ముఖాలు..ఇవీ భారత్‌లోని ప్రయివేటు విశ్వవిద్యాలయాల బ్రోచర్లు, ప్రకటనలలో కనిపించే అంశాలు. అయితే, ఇదంగా మేడి పండు చందంగానే ఉన్నది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పైకి కనబడినంత ఆకర్షణీయంగా మాత్రము లేవు. విద్యను వ్యాపారంగా భావించి పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి వచ్చేలా మాత్రమే వ్యవహరిస్తున్నాయి. విద్యలో నాణ్యతకు, విద్యాసంస్థల్లో మౌలికసదుపాయాలకు తిలోదకాలిస్తున్నాయి.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ పాలనలో దేశంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇలాంటి యూనివర్సిటీల సంఖ్య దాదాపుగా రెట్టింపయ్యింది. ఇక ప్రయివేటు యూనివర్సిటీల తీరు చూస్తే.. మొహాలి జిల్లాలోని ఘరువాన్ గ్రామంలోచండీగఢ్ విశ్వవిద్యాలయం ఉన్నది. 105 ఎకరాల సువిశాల మైదానంలో ఇది విస్తరించి ఉన్నది. డైనింగ్హాల్లు, నిఘా కెమెరాలు, వందల మంది సెక్యూరిటీ గార్డులు, భారీ భవంతులు కలిగి ఉన్న ఈ యూనివర్సిటీ.. ఇంజినీరింగ్, మీడియా నుంచి మేనేజ్మెంట్ వరకు విద్యను అందిస్తుంది. ఇది పంజాబ్‌లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయమని పేరున్నది. అయితే, కొందరు తమను హాస్టల్ టాయిలెట్లో రహస్యంగా చిత్రీకరిస్తున్నారని ఈ ఏడాది సెప్టెంబరులో కొందరు బాలికలు ఆరోపించారు. దీంతో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత క్యాంపస్ భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల గురించి తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. అధిక ఫీజులు చెల్లిస్తున్నారనీ, మెరుగైన సౌకర్యాలు లేవని విద్యార్థులు తమ సమస్యలుగా చెప్పారు.
దేశవ్యాప్తంగా, అత్యుత్తమైన విశ్వవిద్యాలయాలుగా పరిగణించబడుతున్న బెంగళూరులో రెవా యూనివర్సిటీ, కోల్‌కతాలోని బ్రెయిన్వేర్ విశ్వవిద్యాలయం పేలవమైన ప్లేస్మెంట్లతో విమర్శలకు కేంద్రంగా ఉన్నాయి. ఇక్కడ హాస్టల్ వసతి లేదని కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలపై స్పందించటానికి ఆ రెండు విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు ముందుకు రాకపోవటం గమనార్హం. దేశంలో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు, అందులో చేరే విద్యార్థుల సంఖ్య వేగంగానే పెరుగుతున్నది. అయితే, విద్యాసంస్థల యజమానులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానే పాలకపార్టీతో మంచి సంబంధాలు నెరుపుతున్నారు. ఇటు విద్యాధికారులు సైతం చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థుల నుంచి ఈ సంస్థలు అధిక ఫీజులను వసూలు చేస్తున్నాయి. ప్రతి సంస్థలోనూ 'నాణ్యత' అనేది సమస్యగానే పరిణమించింది.
431కి పెరిగిన ప్రయివేటు యూనివర్సిటీలు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూసీజీ) సమాచారం ప్రకారం.. రాష్ట్ర శాసనసభల చట్టాల ద్వారా స్థాపించబడిన ప్రయివేటు, సెల్ఫ్ ఫైనాన్స్ విశ్వవిద్యాలయాల సంఖ్య గత కొన్ని ఏండ్లుగా విపరీతంగా పెరిగింది. వాటి సంఖ్య 2015లో 225గా ఉంటే.. 2022లో దాదాపు 431కి పెరిగింది. గతేడాదిలోనే 68 కొత్త యూనివర్సిటీలు ప్రారంభమయ్యాయి. భారత్‌లోని మొత్తం ఉన్నత విద్యాసంస్థల్లో ప్రయివేటు విశ్వవిద్యాలయాలు 30 శాతానికి పైగా ఉన్నాయని జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ లీడర్షిప్ స్టడీస్‌లో ప్రచురించబడిన అధ్యయనం వెల్లడించింది.
372 శాతం పెరిగిన 'ప్రయివేటు విద్యార్థుల' సంఖ్య
ఉన్నత విద్యపై ఆలిండియా సర్వే (ఏఐఎస్హెచ్ఈ) ప్రకారం.. 2011-12లో 2.7 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ప్రయివేటు కాలేజీల్లో చేరారు. 2019-20లో అది 12.76 లక్షలకు పెరిగింది. అంటే పెరుగుదల 372 శాతం అన్నమాట. దీనికి భిన్నంగా 2011-12లో రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 24.47 లక్షలు. 2019-20లో అది 5.35 లక్షల మంది విద్యార్థుల చేరికతో 25.78 లక్షలకు స్వల్పంగా పెరిగింది.
'ప్రభుత్వ నియంత్రణ అవసరం'
ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు డిమాండ్ పెరగటానికి అనేక కారణాలున్నాయని విద్యావేత్తలు, నిపుణులు విశ్లేషించారు. ప్రభుత్వ సంస్థల్లో తగిన సంఖ్యలో సీట్లు లేకపోవటం దీనికి ప్రధాన కారణంగా తెలిపారు. అయితే, విద్య అనేది ప్రభుత్వం చేతిలోనే ఉండాలనీ, ప్రయివేటు యూనివర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరని వారు సూచించారు.